సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే...పోలవరం ముంపు ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలోకి కలిపే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర సాగునీటి శాఖ అధికారుల నుంచి సేకరించినట్లు తెలిసింది. పోలవరం వల్ల ముంపునకు గురయ్యే సుమారు 277 గ్రామాల్లో దాదాపు 95 శాతం గోదావరి నదికి ఎడమ వైపున ఉన్న భద్రాచలం డివిజన్‌లోనే ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్ మొత్తం సీమాంధ్ర ప్రాంతంలోకి వెళ్తుంది.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తున్నట్టు ఇదివరకే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని అమలు చేయాలంటే...ముంపు ప్రాంతాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు. అందువల్ల భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్ర పరిధిలోకి తీసుకురావాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట గ్రామం వద్ద పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 277 గ్రామాలు, 44,574 కుటుంబాలు ముంపు బారిన పడనున్నాయి. ముంపు బాధితుల్లో అధికులు తెలంగాణ ప్రాంతం వారే కావడంతో పోలవరం ప్రాజెక్టును చాలా కాలంగా తెలంగాణ ప్రాంత నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని కూడా కేంద్ర మంత్రుల బృందానికి అందించిన నివేదికలో టీ జేఏసీ కోరింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నివేదికను కోరడంతో.. ఆ వివరాలతో కూడిన ప్రత్యేక సమాచారాన్ని రాష్ర్ట ఇరిగేషన్ శాఖాధికారులు కేంద్రానికి పంపించారు. ఒకవేళ భద్రాచలం డివిజన్‌ను ఆంధ్ర ప్రాంతంలో కలిపితే.. తెలంగాణ ప్రాంతం వారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ంపై అభ్యంతరం తెలపడానికి కారణం ఉండదు. ప్రధాన ముంపు అంతా కూడా గోదావరి నదికి ఎడమవైపునే ఉంది. ఆ ప్రాంతాన్ని తెలంగాణ నుంచి విడదీయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా పోలవరం ప్రాజెక్టు ద్వారా 7.21 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి, గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌లోకి 80 టిఎంసీల నీటిని తరలించడానికి అవకాశముంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయవచ్చు.