
రోహిత్ పేరు ప్రస్తావించలేదు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లోక్ సభలో స్పందించారు. తాను రాసిన లేఖలో రోహిత్ పేరును ప్రస్తావించలేదని ఆయన మంగళవారం సభలో స్పష్టం చేశారు. హెచ్‌సియు విద్యార్థుల వివాదం సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో తాను ఏ విద్యార్థి పేరును పేర్కొనలేదని దత్తాత్రేయ వివరణ ఇచ్చారు. అనవసరంగా తనమీద అభాండాలు వేసి, ఈ వివాదంలోకి లాగారన్నారు.
ఈరోజు ఉదయం ప్రారంభమైన లోక్ సభ వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సమావేశమైన తరువాత రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు బండారు దత్తాత్రేయ సమాధానమిచ్చారు. ఈ వివాదంలో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన ప్రతిష్టను దిగజార్చారంటూ మండిపడ్డారు.
కాగా హెచ్సియూలోని ఎబీవీపీ, అంబేడ్కర్ విద్యార్థుల వివాదం నేపథ్యంలో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ అంశంపై దత్తాత్రేయ జోక్యంతోనే రోహిత్ సహా మరి కొందరి విద్యార్థులను యూనివర్శిటీ అధికారులు సస్పెండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.