న్యూఢిల్లీ : ర్యాగింగ్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలపాలని లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో రాగింగ్‌ను అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2009లో నిబంధనలు రూపొందించింది. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రతీ సంవత్సరం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు.
ర్యాగింగ్‌ను నిరోధించడం కోసం యాంటీ ర్యాగింగ్ టోల్ ఫ్రీ నంబర్‌ను రూపొందించామన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు చేయాలనుకుంటే 1800-180-5522 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఇందుకోసం 12 భాషల్లో కాల్ సెంటర్ల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఫిర్యాదులు స్వీకరించడానికి యాంటీ ర్యాగింగ్ వెబ్‌సైట్ www.antiragging.in ను కూడా రూపొందించామన్నారు. ఫిర్యాదులకు సంబంధించిన వివరాలు, స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు.
గతేడాది మే 17న యాంటీ ర్యాగింగ్ మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించామని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. యాంటీ ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన గురించి, బాధితుల మానసిక వేదనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా అప్‌లోడ్ చేశామన్నారు. యూజీసీ వెబ్‌పేజీ http://www.ugc.ac.in/page/Videos-Regarding-Ragging.aspx లో చూడవచ్చని, సీబీఎస్‌సీ కూడా ర్యాగింగ్ వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించి www.cbseaff.nic.inలోని నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ర్యాగింగ్‌ను అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్న హెచ్‌ఆర్‌డీ శాఖ బాధితుల గురించి అనేక సంక్షేమ చర్యలు తీసుకుంటోందన్నారు. బాధితులతో పాటు నేరస్తుల మానసిక ఆరోగ్యం గురించి పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో ఓరియెంటేషన్, స్వాగత కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా రూపొందించిన నిబంధనలు అమలయ్యేలా వైస్ చాన్స్‌లర్‌లకు కూడా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment