స్మృతి ఇరానీ అలిగారా?
కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలక శాఖల్లో ఒకటి... మానవ వనరుల మంత్రిత్వ శాఖ. నిన్న మొన్నటి వరకు ఈ శాఖ స్మృతి ఇరానీ వద్ద ఉండగా, తాజా మార్పులలో భాగంగా ఇది ప్రకాష్ జవదేకర్కు వెళ్లింది. జవదేకర్ తన కొత్త బాధ్యతలను గురువారం చేపట్టారు. స్మృతి ఇరానీకి అంతగా ప్రాధాన్యం ఏమీ లేని చేనేత, జౌళి శాఖ దక్కింది. ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో స‍్మృతి మీద జోకులు బాగానే పేలాయి. దాంతో ఆమె అలిగినట్లు కనపడుతున్నారు.
గురువారం నాడు ప్రకాష్ జవదేకర్ మానవ వనరుల మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమానికి ఆమె డుమ్మా కొట్టారు. సాధారణంగా అయితే.. మంత్రులు శాఖలు మారినప్పుడు పాత మంత్రి దగ్గరుండి కొత్త మంత్రికి ఆ బాధ్యతలు అప్పగించడం, కుర్చీ చూపించడం అనవాయితీ. ఇతర శాఖల్లో కూడా ఇలాగే జరిగింది. కానీ, తన ప్రాధాన్యాన్ని గణనీయంగా తగ్గించడం, దానికి తోడు తన మీద సోషల్ మీడియాలో జోకులు పేలడంతో ఆమె నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ప్రకాష్ జవదేకర్కు దగ్గరుండి బాధ్యతలు అప్పగించకుండా.. అసలు ఆ కార్యక్రమానికే రాకుండా ఊరుకున్నారని అంటున్నారు.