ఆధార్ లేకున్నా సబ్సిడీ ప్రయోజనాలు: కేంద్రం
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు లేనంత మాత్రాన ఎవరికీ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలను నిరాకరించలేమని, ఇతర గుర్తింపు కార్డులనూ అంగీకరిస్తామని కేంద్రం స్పష్టతనిచ్చింది. ఉపకారవేతనాలు, మధ్యాహ్న భోజన పథకాలకు కేంద్ర మానవ వనరుల శాఖ ఆధార్‌ను తప్పనిసరిచేయడం పట్ల పలు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
‘ఆధార్ లేనందుకు ఎవరూ ప్రభుత్వ సబ్సిడీలకు దూరం కాకూడదు. ఆధార్ పొందే వరకూ ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల ద్వారా వారికి ప్రయోజనాలు అందుతాయి’ అని అధికార ప్రకటన వెలువడింది. మధ్యాహ్న భోజనం, సమీకృత పిల్లల అభివృద్ధి పథకాల కింద లబ్ధిదారుల ఆధార్ వివరాలు సేకరించాలని పాఠశాలలు, అంగన్‌వాడీలను కోరతామని, కార్డు లేనివారు అందుకు నమోదుచేసుకునేలా అధికారులు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.