కేంద్రీయ విద్యాలయ విద్యార్థి మోహన్ బాబు కుటుంబం (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : అనంతపురం కేంద్రీయ విద్యాలయం తొమ్మిదో తరగతి విద్యార్థి మోహన్ బాబు స్కూలు యాజమాన్యం తనను వేధింపులకు గురిచేస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్‌కు లేఖ రాశాడు. ‘పీఈటీ టీచర్లు నన్ను, నా సోదరున్ని కాళ్లపై కొట్టడంతో నా తండ్రి స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై టీచర్‌పై చర్యలు తీసుకోకుండా మమ్మల్ని సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లిపోవాలని బెదిరించారు. వారు ఈవిధంగా వేధింపులకు పాల్పడటానికి కారణం.. స్కూల్లో జరిగిన సెక్యూరిటీ గార్డుల నియామకం గురించిన వివరాలు తెలియజేయాలంటూ ఆర్టీఐలో దరఖాస్తు చేయడమే’ అని మోహన్ బాబు లేఖలో ఆరోపించాడు.
మోహన్ బాబు తండ్రి నాగరాజు కూడా కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్నాడు. 2013లో కేంద్రీయ విద్యాలయ సెక్యూరిటీ గార్డుల నియామకం గురించిన వివరాలు తెలియజేయాలంటూ ఆర్టీఐలో అతను దరఖాస్తు చేశాడు. అయితే అప్పటినుంచి స్కూలు యాజమాన్యం తనను, తన కుటుంబాన్ని వేధిస్తోందని మోహన్ బాబు ఈ నెల 3న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి లేఖ రాశాడు. మోహన్ బాబు అతని కుటుంబంతోపాటు ఢిల్లీ వెళ్లగా మంగళవారం అతని తండ్రి మంత్రి జవదేకర్‌ను కలిసి ఫిర్యాదు లేఖ అందజేశాడు. అదే రోజు సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలేను కూడా కలిసి దళితులమైన తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పామని విద్యార్ధి తండ్రి తెలిపాడు.
విద్యార్థి ఆరోపణలను ప్రిన్సిపాల్ భారతీదేవి ఖండించారు. 2010 నుంచి నాగరాజు అతడిని, అతని పిల్లలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె తెలిపారు. స్కూలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామని, ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment