Ramdas Athavale
-
బడ్జెట్లో ఏపీకి నిధులు.. కేంద్రమంత్రి అథవాలే కీలక వ్యాఖ్యలు
సాక్షి,మెదక్: దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. శనివారం(జులై 27) మెదక్‌లో పర్యటించిన అథవాలే మీడియాతో మాట్లాడారు.‘ఎన్డీఏ ప్రభుత్వానికి దేశమంతా సమానమే. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కూడా బడ్జెట్లో నిధులు ఇచ్చాం. ఏపీకి రాజధాని లేకపోవడం వల్లే ఎక్కువ నిధులు కేటాయించాం. సౌత్ ఇండియాలో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధించింది. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం అని అథవాలే తెలిపారు. -
బురఖా బ్యాన్పై సేన డిమాండ్ : కేంద్ర మంత్రి నో..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో బురఖాను నిషేధించాలన్న శివసేన డిమాండ్‌ను కేంద్ర మంత్రి రాందాస్ అథవలే తోసిపుచ్చారు. బురఖా ధరించే మహిళలంతా ఉగ్రవాదులు కారని, వారి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బురఖా ధరించే హక్కు వారికుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వారిలో ఎవరినైనా ఉగ్రవాదులుగా గుర్తిస్తే వారి బురఖాలను తొలగించాలని వ్యాఖ్యానించారు. కాగా దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీలంక తరహాలో బహిరంగ ప్రదేశాల్లో బురఖా వాడకాన్ని నిషేధించాలని శివసేన పత్రిక సామ్నా డిమాండ్ చేసింది. గతంలో బీజేపీ మొగ్గుచూపిన ప్రతిపాదనను రావణ రాజ్యం (శ్రీలంక)లో అమలు చేస్తున్నారని దీన్ని అయోధ్య (భారత్)లో ఎప్పుడు అమలు చేస్తారని తాము ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నామని సామ్నాలో శివసేన పేర్కొంది. భద్రతా దళాలు ఎవరినైనా గుర్తించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు బురఖాలను తొలగించడం అనివార్యమని సూచించింది. ముఖానికి మాస్కులు, బురఖాలు వేసుకోవడం దేశ భద్రతకు పెను ముప్పని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. మరోవైపు శివసేన డిమాండ్‌ను షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వాసిం రజ్వీ సైతం వ్యతిరేకించారు. ఇది బాధ్యతారాహిత్య, రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్ అని అభివర్ణించారు. బురఖా ధరించాలా లేదా అనేది ముస్లిం మహిళల నిర్ణయానికే వదిలివేయాలని అన్నారు. -
కేంద్ర మంత్రికి అనంతపురం విద్యార్థి ఫిర్యాదు!
న్యూఢిల్లీ : అనంతపురం కేంద్రీయ విద్యాలయం తొమ్మిదో తరగతి విద్యార్థి మోహన్ బాబు స్కూలు యాజమాన్యం తనను వేధింపులకు గురిచేస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్‌కు లేఖ రాశాడు. ‘పీఈటీ టీచర్లు నన్ను, నా సోదరున్ని కాళ్లపై కొట్టడంతో నా తండ్రి స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై టీచర్‌పై చర్యలు తీసుకోకుండా మమ్మల్ని సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లిపోవాలని బెదిరించారు. వారు ఈవిధంగా వేధింపులకు పాల్పడటానికి కారణం.. స్కూల్లో జరిగిన సెక్యూరిటీ గార్డుల నియామకం గురించిన వివరాలు తెలియజేయాలంటూ ఆర్టీఐలో దరఖాస్తు చేయడమే’ అని మోహన్ బాబు లేఖలో ఆరోపించాడు. మోహన్ బాబు తండ్రి నాగరాజు కూడా కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్నాడు. 2013లో కేంద్రీయ విద్యాలయ సెక్యూరిటీ గార్డుల నియామకం గురించిన వివరాలు తెలియజేయాలంటూ ఆర్టీఐలో అతను దరఖాస్తు చేశాడు. అయితే అప్పటినుంచి స్కూలు యాజమాన్యం తనను, తన కుటుంబాన్ని వేధిస్తోందని మోహన్ బాబు ఈ నెల 3న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి లేఖ రాశాడు. మోహన్ బాబు అతని కుటుంబంతోపాటు ఢిల్లీ వెళ్లగా మంగళవారం అతని తండ్రి మంత్రి జవదేకర్‌ను కలిసి ఫిర్యాదు లేఖ అందజేశాడు. అదే రోజు సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలేను కూడా కలిసి దళితులమైన తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పామని విద్యార్ధి తండ్రి తెలిపాడు. విద్యార్థి ఆరోపణలను ప్రిన్సిపాల్ భారతీదేవి ఖండించారు. 2010 నుంచి నాగరాజు అతడిని, అతని పిల్లలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె తెలిపారు. స్కూలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామని, ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని ఆమె పేర్కొన్నారు. -
మా సీట్లు మాకు కావాలే..
సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాషాయ కూటమి తమ పార్టీకి 20 స్థానాలు కేటాయించాల్సిందేనని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. బాంద్రాలోని రంగశారద సభాగృహంలో జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి చిహ్నంపై తమ అభ్యర్థులు పోటీ చేయబోరని, తమ పార్టీ గుర్తుపైనే పోటీచేస్తారని కుండబద్దలు కొట్టారు. ఇంతకుముందు తమ పార్టీకి 40 స్థానాలు కావాలని అడిగినా ప్రస్తుత వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం 20 స్థానాలు కావాలని అడుగుతున్నామని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ అభ్యర్థులకు ఆర్పీఐ ఓట్లు గంపగుత్తగా పడ్డాయని ఆయన చెప్పారు. అయితే ఆమేరకు ఆర్పీఐ అభ్యర్థులకు కూటమి పార్టీల ఓట్లు రావడంలేదని రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాసన సభ ఎన్నికల్లో పరిస్థితుల మారాలంటే ఆ ఓట్లన్నీ ఆర్పీఐ అభ్యర్థులకు పోలయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని ఇరు పార్టీల నాయకులకు ఆఠవలే సూచించారు. ఒక కులానికి రిజర్వేషన్ అమలుచేసే ముందు మరో కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. కొద్ది రోజులుగా ధన్గర్ సమాజ ప్రజలు రిజర్వేషన్ కోసం తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికి సమాన న్యాయం జరిగే తీరులో తుది నిర్ణయం తీసుకోవాలని రాందాస్ విజ్ఞప్తి చేశారు. అది మా లిస్ట్ కాదు.. బీడ్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తమ పార్టీ ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. ఇటీవల ఆర్పీఐ అభ్యర్థుల జాబితా అంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. ఎవరో కూటమిని తప్పుదోవ పట్టించేందుకు ఇలా అసత్యాలను ప్రచారంచేస్తున్నారని ఆరోపించారు. తాము అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత మీడియా ద్వారానే బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు కథనాల వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొందన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. బీజేపీ,శివసేన కూటమికి తాము 57 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితాను అందజేశామని, వాటిలో 20 సీట్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని రాందాస్ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రవర్తించినట్లు ఇప్పుడు కాషాయ కూటమి ప్రవర్తిస్తుందని అనుకోవడంలేదని, ఆర్పీఐ అండ లేకుండా దళితుల ఓట్లను సాధించడం కూటమి వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీలో ఇప్పటికే నటి రాఖీ సావంత్ చేరగా, ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ త్వరలో చేరనున్నట్లు వివరించారు. కాగా, బీడ్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాందాస్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.