సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో బురఖాను నిషేధించాలన్న శివసేన డిమాండ్‌ను కేంద్ర మంత్రి రాందాస్ అథవలే తోసిపుచ్చారు. బురఖా ధరించే మహిళలంతా ఉగ్రవాదులు కారని, వారి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బురఖా ధరించే హక్కు వారికుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వారిలో ఎవరినైనా ఉగ్రవాదులుగా గుర్తిస్తే వారి బురఖాలను తొలగించాలని వ్యాఖ్యానించారు. కాగా దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీలంక తరహాలో బహిరంగ ప్రదేశాల్లో బురఖా వాడకాన్ని నిషేధించాలని శివసేన పత్రిక సామ్నా డిమాండ్ చేసింది.
గతంలో బీజేపీ మొగ్గుచూపిన ప్రతిపాదనను రావణ రాజ్యం (శ్రీలంక)లో అమలు చేస్తున్నారని దీన్ని అయోధ్య (భారత్)లో ఎప్పుడు అమలు చేస్తారని తాము ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నామని సామ్నాలో శివసేన పేర్కొంది. భద్రతా దళాలు ఎవరినైనా గుర్తించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు బురఖాలను తొలగించడం అనివార్యమని సూచించింది. ముఖానికి మాస్కులు, బురఖాలు వేసుకోవడం దేశ భద్రతకు పెను ముప్పని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. మరోవైపు శివసేన డిమాండ్‌ను షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వాసిం రజ్వీ సైతం వ్యతిరేకించారు. ఇది బాధ్యతారాహిత్య, రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్ అని అభివర్ణించారు. బురఖా ధరించాలా లేదా అనేది ముస్లిం మహిళల నిర్ణయానికే వదిలివేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment