సాక్షి, హైదరాబాద్: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 85 సీట్ల దాకా గెలుపొంది బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు గెలుచుకుని బీజేపీ సంచలనం సృష్టించబోతోందన్నారు. రాబోయే 50, 55 రోజుల్లో ఇది వాస్తవరూపం దాల్చడాన్ని అందరూ చూస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, త్యాగాలను కేసీఆర్ సర్కార్ విస్మరించి విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు.
సకల జనులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అవినీతి మయం చేయడంతో పాటు, పూర్తిగా కుటుంబ స్వామ్యంగా మార్చివేయడాన్ని ఇక్కడి ప్రజలు అస్సలు ఊహించలేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ సరిగా లేదని, తెలంగాణ ఏర్పడ్డాక మండలి చైర్మన్‌తో సహా ఎమ్మెల్సీలందరూ టీఆర్‌ఎస్‌లో విలీనం కావడం, 2014లో ఆరుగురు ఎమ్మెల్యేలు, 2018లో 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం ద్వారా ఆ రెండు పార్టీలూ ఒక్కటే అన్న విషయం స్పష్టమైందని చెప్పారు. దీనికి పూర్తి భిన్నంగా బీజేపీ ఎమ్మెల్యేలెవరూ బీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేదని, ఇతర పార్టీల్లోంచే బీజేపీలోకి వస్తున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు నిర్వహించకపోవడం గర్హనీయమన్నారు. ఈ విషయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే తమకు న్యాయం జరుగుతుందని వారు నమ్ముతున్నారని చెప్పారు. జవదేకర్ గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
వైఎస్ విజయం సాధిస్తారని ముందే చెప్పా
2004 ఎన్నికలకు ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్రను, దానికి వచ్చిన స్పందనను నేను స్వయంగా గమనించా. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పా. నేను చెప్పినట్టే ఆయన అధికారంలోకి వచ్చారు. అదే విధంగా ఇప్పుడు కూడా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వస్తుందనే నా జోస్యం నిజం అవుతుంది.
అది పూర్తిగా అబద్ధం
బీఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని అ న్నారన్నది పూర్తిగా అబద్ధం. ఈ వార్త మీడియాలో వచ్చాక కూడా దానిని ఖండిం చకపోవడంపై నేను పార్టీ అధికార ప్రతినిధులను మందలించా. తెలంగాణలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని ఆ అంతర్గత సమావేశంలో సంతోష్ చెప్పారు. అయితే హంగ్ అని అన్నట్టుగా వార్త వచ్చినందుకు నేను జర్నలిస్టులను కూడా తప్పుబట్టను. ఎందుకంటే ఇందుకు సంబంధించి ఎలాంటి వీడియో, ఆడియో రికార్డ్ లేదు.
ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు
కాంగ్రెస్‌లో ప్రస్తుతం అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల అది అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కర్ణాటకలో గెలుపు ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశముంది. అయితే కాంగ్రెస్ తమను మోసం చేసిందనే భావనలో ఉన్న తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ వేరు, రాహుల్‌గాంధీ కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ నేత రాహుల్ జేఎన్‌యూ గాంధీ. ఆయన లెఫ్టిస్ట్‌ల భాష మాట్లాడుతున్నారు. అందువల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయింది.
మోదీ మ్యాజిక్ పనిచేస్తుంది
తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ పాపులారిటీ అత్యు న్నత స్థాయికి చేరుకుంది. ఒక్క అవినీతి మర కలేదు. పదేళ్ల యూపీఏ పాలనలో లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగు చూడగా, తొమ్మిదేళ్ల ఎన్డీఏ ఆధ్వర్యంలోని మోదీ పాలనలో ప్రధాని మోదీ లేదా మంత్రులపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం ముఖ్య మైన సానుకూల అంశం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాజకీయాలు, కులం, మతం, వర్గాలకు అతీతంగా ప్రజలకు చేరవేయడంతో ..మోదీని వారు పూర్తి స్థాయిలో విశ్వసించే పరిస్థితి ఏర్పడింది. ఆ మ్యాజిక్ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్పష్టంగా పనిచేయబోతోంది. బీజేపీని గెలిపించబోతోంది.
బీఆర్‌ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత
రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల్లో బీఆర్‌ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ప్రభుత్వంపై విశ్వసనీయత అనేది అత్యంత అధమ స్థాయిలో ఉంది. ఓటమిపై భయంతోనే కొన్ని మినహా అన్ని సీట్లకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే నామినేషన్ల చివరినాటికి ఆ అభ్యర్థుల్లో కనీసం 20 మందిని మార్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరే కతను మాకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే ప్రజల వద్దకు వెళుతున్నాం.
మా వద్ద ఉన్న ఏకైక మార్గం ప్రజలను కలుసుకోవడం, బీఆర్‌ఎస్ అవినీతి, అక్రమాలు తెలియజేసి వారి మద్దతు సాధించడం. మేం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలుస్తోంది. మరోవైపు ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment