
న్యూఢిల్లీ: వివిధ ప్రైవేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో భాగంగా చేసిన ఎంపికలను లాక్‌డౌన్ కారణంగా రద్దు చేయరాదని కేంద్రం కోరింది. లాక్‌డౌన్ కారణంగా దేశంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎంపికయిన అభ్యర్థుల్లో ఉన్న ఆందోళనను తొలగించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆయా సంస్థలకు సూచించింది. ఎంపికయిన అభ్యర్థులను యథా ప్రకారం ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పేర్కొంది. లాక్‌డౌన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ కాలం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం క్యాంపస్ ఎంపికలపై పడకుండా చూసుకోవాలని గతవారం 23 ఐఐటీల డైరెక్టర్లను మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో క్యాంపస్ ఎంపికలను రద్దు చేసుకోవద్దని రిక్రూటర్లను కోరినట్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్‌రావు తెలిపారు.