న్యూఢిల్లీ: విద్యార్థులకు అతి తక్కువ ధరకే టాబ్లెట్ పీసీని అందించాలన్న కేంద్ర మానవ వనరుల శాఖ ప్రణాళిక ఫలించనుంది. చవకైన టాబ్లెట్ పీసీల ఉత్పత్తిపై వివిధ దశల్లో జరిగిన చర్చల అనంతరం ఆకాశ్-4 ప్రాజెక్టుకు ఆ శాఖ పచ్చజెండా ఊపినట్టు కేంద్ర ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ఒక్కొక్క టాబ్లెట్ ధర రూ. 2150 ఉండే ఈ టాబ్లెట్‌లను దాదాపు 22 లక్షలకు పైగా సేకరించి తొలి దశలో ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు సబ్సిడీపై అందించనున్నట్టు వివరించాయి. ఈ ప్రాజెక్టుకు రూ. 330 కోట్లు ఖర్చు కానుందని, వచ్చే ఏడాది జనవరి నాటికి టాబ్లెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నాయి.
ఆకాశ్-4 టాబ్లెట్‌లో ఆడియో, వీడియో సహా హిందీ, వివిధ ప్రాంతీయ భాషలను చదివేందుకు, కంపోజ్ చేసేందుకు అవకాశముంది. ఇదిలావుంటే, ఆకాశ్-4 ప్రాజెక్టును ఐఐటీ రాజస్థాన్‌కు ఇవ్వాలని మానవ వనరుల శాఖ సిద్ధమైంది. అయితే, కాగ్ జోక్యంతో దీనిని ఐఐటీ బాంబేకు అప్పగించారు.