కీలక బిల్లులకు మద్దతిస్తాం.. కానీ!
రాజ్యసభలో జేఎన్‌యూపై చర్చించాల్సిందే: విపక్షాలు
అంగీకరించిన సర్కారు
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన జేఎన్‌యూ వివాదంతోపాటు దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనలపై రాజ్యసభలో చర్చించాలని.. అలాంటప్పుడే కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు అంగీకరిస్తామని విపక్షాలు స్పష్టం చేశాయి. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. రాజ్యసభలో చర్చించాల్సిన అంశాలు, సభ జరిగే తీరుపై శనివారం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, రాజ్యసభ పక్షనేత అరుణ్‌జైట్లీ, డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్‌తోపాటు విపక్షనేతలు హాజరయ్యారు.
సభ సజావుగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా అన్సారీ కోరారు. అయితే.. దేశవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లో విద్యార్థుల ఆందోళనలు, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, జేఎన్‌యూలో గొడవ తదితర అంశాలపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ పక్షనేత అరుణ్‌జైట్లీ.. ప్రభుత్వం ఈ ఆందోళనలతోపాటు.. విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ‘అన్ని పార్టీలు సభను సజావుగా నడిచేలా సహకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ముఖ్యమైన బిల్లులన్నీ ఆమోదం పొందేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపాయి’ అని పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ భేటీ అనంతరం తెలిపారు.
రాష్ట్రాలకు 4లక్షల కోట్లు
రాష్ట్రాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా సంక్రమించాల్సిన మొత్తంలో మొదటి విడతగా.. 4 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. మిగిలిన నిధులను మార్చి చివరి వరకు మూడు విడతల్లో చెల్లించనున్నట్లు వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి రతన్ వతల్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాలకిచ్చే పన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా.. ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.