కేజ్రీవాల్ డిగ్రీని తవ్వేందుకు ఐపీఎస్ బస్సీ
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యుడిగా ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీని కేంద్రం నియమించడం పట్ల సోషల్ మీడియా మంగళవారం తనదైన శైలిలో తీవ్రంగా మండిపడింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమారు అరెస్టు వ్యవహారంలో బస్సీ వ్యవహరించిన తీరు ప్రధానంగా వివాదాస్పదమైన విషయం తెల్సిందే. కేంద్రంలోని బీజేపీ నాయకులకు ఒత్తాసు పలికే బస్సీ పాటియాల కోర్టులో కన్హయ్య కుమార్పై జరిగిన దాడిని కూడా అడ్డుకోలేకపోయారు.
పైగా యూనివ ర్శిటీలో జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చిన విద్యార్ధులకు పాకిస్తాన్ టైస్టు హఫీజ్ సయాద్ మద్దతు కూడా ఉందంటూ ఓ నకిలీ మెయిల్ను సృష్టించి అభాసుపాలు కూడా అయ్యారు. అలాంటి వ్యక్తిని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీసు సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు తదితర ముఖ్యమైన సర్వీసులకు అభ్యర్థులను ఎంపికచేసే యూపీఎస్సీ సభ్యుడిగా నియమించడం ఏమిటంటూ ట్విట్టర్లో పలువురు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో విభేదిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిజంగా ఐఆర్ఎస్ చదివారా? లేదా తెలుసుకునేందుకుగాను పాత ఫైళ్లను వెతికించడం కోసమే ఆయన్ని యూపీఎస్సీ సభ్యుడిగా నియమించారు అని ఒకరు....చేతకాని చెత్త బ్యూరోక్రట్లను ఎంపిక చేయడం కోసమే నియమించారని కొందరు వ్యాఖ్యానించారు. యూపీఎస్సీలో కూడా హిందూత్వ ఎజెండాను అమలు చేయడం కోసమని కొందరు, 2016కు యూపీఎస్సీ టాపర్ బస్సీయేనని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు. తిమ్మిని బమ్మి చేయడం కోసం బస్సీ రాకను పురస్కరించుకొని అప్పుడే యూపీఎస్సీలో ఫొటోషాప్, వీడియో టేప్ల ఎడిటింగ్ తరగతులను ప్రారంభించారని మరొకరు వ్యంగ్యోక్తులు విసిరారు.
ఒక చైర్మన్ పది మంది సభ్యులుండే యూపీఎస్సీలో సభ్యుడి పదవి కాలం ఆరేళ్లయినప్పటికీ 60 ఏళ్ల బస్సీ ఐదేళ్ల పాటే ఆ పదవిలో కొనసాగుతారు. ఎందుకంటే అందులో పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు. అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం 1977 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ బస్సీ.