న్యూఢిల్లీ: డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార ఘటన అనంరతం మహిళలపై నేరాల విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి పేర్కొన్నారు. మహిళా సాధికారత అంశంపై స్థానిక ఫిక్కి హౌస్‌లో ఫిక్కి మహిళా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార కేసు నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామన్నారు. అంతకుముందు బాధితురాలు అయిష్టత వ్యక్తం చేస్తే తమ సిబ్బంది కేసులు నమోదు చేసేవారు కాదని, అయితే 2013లో చట్టంలో చేసిన సవరణల కారణంగా ఇప్పుడు విధిగా కేసు నమోదు చేయాల్సిందేనన్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించకూడదని అన్నారు. దీంతో కేసుల నమోదు దాదాపు 500 శాతం మేర పెరిగిందన్నారు. 2012లో నగరంలో మొత్తం 706 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు. 2013లో వీటి సంఖ్య 1,636కు చేరుకుందన్నారు. 2014 సంవత్సరంలో ఇప్పటిదాకా దాదాపు 984 కేసులు నమోదయ్యాయన్నారు. జూన్ నాటికి ఇందులో 759 కేసులను పరిష్కరించామన్నారు. అనేక కేసులపై తాను కూడా స్వయంగా దృష్టి సారిస్తూనే ఉన్నానన్నారు. బాధితురాలు, నిందితుడి మధ్య పరిచయమున్న కేసులు కూడా తమ వద్దకు వస్తున్నాయని, వీటి సంఖ్య కూడా బాగా పెరిగిపోయిందన్నారు.
మరింత మంది మహిళా సిబ్బంది అవసరం
తమ శాఖలో మహిళా సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా ఉందని బస్సి పేర్కొన్నారు. డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార ఘటన అనంతరం మహిళా సిబ్బంది ప్రాధాన్యం తెలిసొచ్చిందన్నారు. అందువల్లనే వివిధ ర్యాంకుల్లో మొత్తం రెండు వేల మంది మహిళా సిబ్బందిని నియమించుకున్నామన్నారు.
మరింత శ్రద్ధ వహిస్తున్నాం
Published Sat, Jul 12 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement