పోలీసులపై ఫైర్
Published Thu, Jan 16 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
సాక్షి, న్యూఢిలీ:ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల మధ్య విభేదాలు మరోసారి వార్తల్లోకెక్కాయి. ఢిల్లీ పోలీసులు తమ మాట వినడం లేదన్న మాజీ సీఎం షీలాదీక్షిత్ మాటలనే కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. డెన్మార్క్‌కు చెందిన 51 ఏళ్ల పర్యాటకురాలిపై మంగళవారం జరిగిన గ్యాంగ్‌రేప్ సహా ఇటీవల కాలంలో మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుల వైఖరిని కేజ్రీవాల్ ఎండగట్టారు. ప్రజాభద్రత విషయంలో పోలీసులు బాగా రాజీపడ్డారని ఘాటుగా విమర్శించారు. నగరంలో చిన్నాచితక నేరాలేమైనా జరగట్లేదంటే అందుకు దేవుడి దయే కారణమన్నారు. సీఎం కేజ్రీవాల్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి ఢిల్లీ పోలీసులు ఏ విధంగా సహకరించడం లేదో మంత్రులతోనే చెప్పించారు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చున్న మంత్రులు సోమనాథ్ భారతి, రాఖీ బిర్లా... ఢిల్లీ పోలీసులు తమ ఆదేశాలను పాటించడం లేదంటూ తమ అనుభవాలను వివరించారు.
హౌజ్‌రాణి, ఖిడ్కీలలో మాదక ద్రవ్యాల రాకెట్, సెక్స్ రాకెట్ నడుపుతున్న విదేశీయులపై చర్య తీసుకోవడానికి మాలవీయనగర్ పోలీసులు నిరాకరించారని న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి చెప్పారు. పీసీఆర్ వ్యాన్ తనవెంట తీసుకెళ్లి గాలించాలని కోరినప్పటికీ, వారు ఆ పని చేయలేదని తెలిపారు. అవసరమైతే తనను బదిలీ చేసుకోవచ్చని స్థానిక ఎస్‌హెచ్‌ఓ సవాలు చేశారని సోమనాథ్ చెప్పారు. ఇందిరాపుర్‌లో కోడల్ని సజీవ దహనం చేయబోయిన అత్తింటివారిని అరెస్టు చేయడానికి సాగర్‌పుర్ పోలీస్ స్టేషన్ అధికారులు నిరాకరించిన ైవె నాన్ని రాఖీ బిర్లా వివరించారు. ఈ రెండు ఘటనలు బుధవారం రాత్రి జరిగాయి. డెన్మార్క్ మహిళపై గ్యాంగ్‌రేప్ ఘటనపై మౌనం వహించినందుకు అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ విధి నిర్వహణలో ఢిల్లీ పోలీసుల అలసత్వమే నగరంలో భద్రతా వైఫల్యానికి కారణమని చెప్పారు. మాదక ద్రవ్యాలు, సెక్స్ రాకెట్లను నడిపే ముఠాలను పోలీసులు పట్టుకోవడం లేదని, ఇటువంటి నేరాలే అత్యాచారాలకు పాల్పడే ధోరణులకు దారితీస్తాయన్నారు.
మాదక ద్రవ్యాల వ్యాపారులను శిక్షించి, రోడ్డుపై మహిళలను రక్షించాల్సిన బాధ్యత పోలీసులది కాదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి ఆదేశించినా వ్యభిచార రాకెట్ నడిచే ఇంటిపై దాడి చేయడానికి పోలీసులు నిరాకరించారని చెప్పారు. కేజ్రీవాల్ తన మంత్రుల చర్యలను సమర్థించారు. మంత్రులు తమ విధులలో జోక్యం చేసుకున్నారన్న పోలీసుల ఆరోపణలను ఆయన ఖండిం చారు. మంత్రులు తమ పని చేశారని ఆయన చెప్పారు. ఢిల్లీ పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఈ ఘటనలు చెబుతున్నాయన్నారు. ఢిల్లీ పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలు పోలీసుల నిర్లక్ష్యాన్ని చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. సెక్స్, మాదక ద్రవ్యా ల ముఠాలపై చర్యలు చేపట్టడానికి, మహిళను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవడానికి నిరాకరించిన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ విషయమై లెఫ్టినెంట్ గవర్నర్, పోలీసు కమిషనర్‌ను కలవనున్నట్లు ఆయన చెప్పారు.
బాగానే పనిచేస్తున్నాం: బస్సీ
నగరవాసుల భద్రత కోసం పోలీసు వ్యవస్థ సమర్ధంగా పనిచేస్తోందని పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. నగరం సురక్షితంగా లేదని, పోలీసులు పట్టించుకోవడం లేదన్న కేజ్రీవాల్ విమర్శలను బస్సీ వద్ద మీడియా ప్రస్తావించగా ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. అయితే తాము చెప్పిన పోలీసులు పట్టించుకోలేదని ఇద్దరు ఆప్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇంకా తనకు తెలియదన్నారు. మంత్రులు చెప్పినా వినని పోలీసులు విషయంలో పూర్తి సమాచారం లేదని, తగిన సమయంలో చర్య తీసుకుంటామన్నారు. కాగా, ఆప్ మంత్రులపై ఎల్‌జీని కలిసి ఫిర్యాదుచేస్తామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement