ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంవద్ద ఆందోళన చేస్తున్న వందలాదిమంది పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు మునుపెన్నడూ లేనివిధంగా ధిక్కార స్వరం వినిపించారు. మూడు రోజుల క్రితం తీస్‌హజారీ కోర్టు ఆవరణలో జరిగిన గొడవతోపాటు మరోసారి సోమవారం లాయర్లు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవార ఉదయం ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. దాడులకు బాధ్యులైన లాయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయం ప్రారంభమైన ఆందోళనను దాదాపు 11 గంటల అనంతరం అధికారుల హామీ అనంతరం విరమించారు. సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళ, పురుష సిబ్బంది, అధికారులు పోలీసు ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టారు.‘వుయ్ వాంట్ జస్టిస్’అంటూ నినాదాలు చేశారు.
ప్రశాంతంగా ఉండాలని, విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు చేసిన విజ్ఞప్తులకు ‘గో బ్యాక్..గో బ్యాక్’అంటూ బదులిచ్చారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ తమ సిబ్బందిని ఆందోళన విరమించాలని కోరినా వారు వెనక్కి తగ్గలేదు. సాయంత్రం స్పెషల్ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా..తీస్‌హజారీ కోర్టు ఆవరణలో శనివారం జరిగిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని, క్షతగాత్రులైన పోలీసులకు రూ.25 వేల పరిహారం అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన లాయర్లను గుర్తించి పేర్లు తెలపాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా కోరారు. కొందరి దౌర్జన్యపూరిత ప్రవర్తన కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment