న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఈసీ) కార్యాలయానికి వచ్చారు. యుమునా నదీ జలాల్లో విషం కలిసిందంటూ చేసిన వ్యాఖ్యలపై అధికారులు జారీ చేసిన నోటీసుకు ఆయన సమాధానం ఇచ్చారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి సరఫరా చేసే యమునా జలాల్లో అమోనియాను కలిపి విషపూరితం చేసిందని ఈ నెల 27న కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే, ఢిల్లీ జల్ బోర్డు ఇంజనీర్లు ఆ విషయం తెలిసి, వెంటనే ఢిల్లీకి ఆ నీరు రాకుండా ఆపేశారు. ఆ నీరే తాగు నీటిలో కలిసినట్లయితే ఎంతో పెద్ద విపత్తు జరిగి ఉండేది’అని అన్నారు. దీనిపై ఈసీ కేజ్రీవాల్‌కు రెండుసార్లు నోటీసులు పంపించింది. దీనిపై శుక్రవారం కేజ్రీవాల్ ఈసీ అధికారుల ఎదుట తన వాదనను వివరించారు.
జనవరి 15న 3.2 పీపీఎం ఉన్న అమోనియా స్థాయిలు జనవరి 27వ తేదీ నాటికి 7 పీపీఎంకు పెరిగినట్లు తెలిపే నివేదికను అందజేశారు. ఆయన వెంట సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఉన్నారు. ఈసీని కలిసేందుకు ఆయన ముందుగా ఎలాంటి అపాయింట్‌మెంట్ తీసుకోలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తుది గడువు సమీపిస్తున్నందున కేజ్రీవాల్‌తో సమావేశమై ఆయన వాదనను సావధానంగా విన్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ వాసులకు విష జలాలను సరఫరా చేసేందుకు బీజేపీ పన్నిన కుట్రను కేజ్రీవాల్ ఈసీ అధికారులకు వివరించారని అనంతరం ఆప్ తెలిపింది. అమోనియా కలుషితాలున్న విషయం తెలిపేందుకు మూడు బాటిళ్లలో యమునా నీటిని కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించింది. దీనిపై తాము దర్యాప్తు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment