న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఎంపీలను అప్రతిష్టపాలు చేయడంతోపాటు తప్పుడు పనుల్లో వారిని ఇరికించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చివరి రోజు రాజ్యసభలో చోటుచేసుకున్న రగడపై ఆయన స్పందించారు. సభలో ప్రతిపక్ష ఎంపీలపై ప్రభుత్వం మహిళా మార్షల్స్‌ను ఉసిగొల్పిందని మండిపడ్డారు. ఖర్గే మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. కేవలం ఒక పార్టీని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించడం దారుణమని విమర్శించారు.
రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడిపై తమకు విశ్వాసం ఉందని, సభలో చివరి రోజు జరిగిన అలజడి విషయంలో ఆయన నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీకి దాదాపు పూర్తి మెజారిటీ వచ్చిందని, ఇప్పుడే ఆ పార్టీ అసలు రంగు బయటపడుతోందని దుయ్యబట్టారు. కీలకమైన బిల్లులను చర్చ లేకుండానే పార్లమెంట్‌లో ఆమోదించడం ఏమిటని నిలదీశారు. బీజేపీ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఇష్టారాజ్యంగా సభను నడిపించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష సభ్యుల ప్రతిష్టను దెబ్బతీయడమే ప్రభుత్వం పని పెట్టుకుందని నిప్పులు చెరిగారు.
ఇన్సూరెన్స్ బిల్లును బలవంతంగా ప్రవేశపెట్టారు
ప్రభుత్వ పరిధిలో కొనసాగుతున్న బీమా సంస్థలను సంపన్న వ్యాపారవేత్తలైన వారి మిత్రులకు కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారని మల్లికార్జున ఖర్గే చెప్పారు. అందుకే ఆగస్టు 11న రాజ్యసభలో మార్షల్స్‌తో కోట కట్టి, ఇన్సూరెన్స్ సవరణ బిల్లును బలవంతంగా ప్రవేశపెట్టారని తెలిపారు. పురుష మార్షల్స్ కంటే ముందే మహిళా మార్షల్స్‌ను రంగంలోకి దించారని, ఒకవేళ ప్రతిపక్ష ఎంపీలు పొరపాటున వారిని తాకితే రాద్ధాంతం చేయాలన్నదే సర్కారు పన్నాగమని విమర్శించారు. సభలో అనుచితంగా ప్రవర్తించిన ప్రతిపక్ష సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని గుర్తుచేయగా.. ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామని, సభలో జరిగిన ఘర్షణలో తమ సభ్యులు గాయపడ్డారని ఖర్గే బదులిచ్చారు.
ఈ విషయంలో చైర్మన్ వెంకయ్య నాయుడిపై నమ్మకం ఉంచామని అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాఫీగా సాగకపోవడానికి ప్రతిపక్షాలే కారణమంటూ కేంద్రం నిందించడం సరి కాదని హితవు పలికారు. వాస్తవానికి ప్రతిపక్షాల సహకారం వల్లే ఈసారి ఎక్కువ సమయం పార్లమెంట్ వ్యవహారాలు కొనసాగాయని వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష బీజేపీ కారణంగా పార్లమెంట్ సమావేశాలు ఏనాడూ సజావుగా సాగలేదని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment