సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ కార్యకలాపాలను నిర్వహించడంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించకపోకుండా సభ్యుల మధ్య వాగ్వావాదాలను సర్దుబాటు చేయడంలో విజయం సాధిస్తున్నారని కూడా చెప్పవచ్చు. వ్యంగ్యంగా మాట్లాడడం, పదాలను ఫన్ చేయడం ఆయనకు మొదటి నుంచి అలవాటు. ఎదుటి వారిని అవమానించనంత వరకు, కించ పర్చనంత వరకు వ్యంగ్యోక్తులనైనా చలోక్తులుగానే ఎవరైనా తీసుకుంటారు. ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
భారత ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి గురించి, అందులో ఆమె వీడ్కోలు సమావేశంలో అంతమాట అనేస్తారా? అంటూ మహిళా సంఘాల నేతలు, నెటిజన్లు విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇదే రేణుకా చౌదరిని ‘శూర్పణఖ’గా వర్ణించడం కూడా మగ దురహంకారం నుంచి వచ్చిందేనన వారు ఆరోపిస్తున్నారు. చమత్కారానికి, వెటకారానికి ఉన్న తేడాని గుర్తించాలని వారు అంటున్నారు.
రాజ్యసభలో బుధవారం నాడు రేణుకా చౌదరిని ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘మీకు నాదో చిన్న సలహా! మీరు బరువు తగ్గించుకోండి, మీ పార్టీ బరువు పెంచేందుకు కృషి చేయండి’ అని వ్యంగ్యోక్తి విసిరిన విషయం తెల్సిందే. ‘రాజ్యసభ చైర్మన్‌గా మీకున్న బరువును ఉపయోగించి మీ చుట్టున్న వారికి నచ్చ చెప్పండి’ అని రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా వెంకయ్య ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బరువన్న పదాన్ని రేణుకా చౌదరి అధికారానికి చిహ్నంగా వాడారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే రాజ్యసభలో మాట్లాడుతున్నప్పుడు రేణుకా చౌదరి గట్టిగా నవ్యుతూ కనిపించారు. ‘ఏంటి శూర్పణఖలా ఆ నవ్వు!’ అని మోదీ చలోక్తి విసిరారు. మహిళావాది ‘శూర్పణఖ’తో పోల్చినందుకు ‘థ్యాంక్స్’ అంటూ రేణుకా చౌదరి సర్దుకున్నారు. పార్లమెంట్‌లో మహిళలకు 38 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించడంలో తాత్సారం చేసే మగ దురహంకారుల మాటలు ఇలాగే ఉంటాయని కొంత మంది మహిళావాదులు విమర్శిస్తున్నారు.
వెంకయ్య నాయుడు తన చమత్కారంలో భాగంగానే ఇటీవల కాంగ్రెస్‌ను ఉద్దేశించి ‘డైనాస్టీ ఇన్ డెమోక్రసీ ఈజ్ నాస్టీ, టేస్టీ టూ సమ్ పీపుల్’ అన్నారు. భారత ఉపరాష్ట్రపతి అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, ఇంకా బీజేపీ నాయకుడిగా మాట్లాడితే ఎలా? ఆయన వ్యాఖ్యలపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. జార్ఖండ్ గురించి ‘స్టేట్ ఈజ్ బ్యూటిఫుల్, పీపుల్ ఆర్ డ్యూటీఫుల్, రిసోర్సెస్ ఆర్ ఫ్లెంటీఫుల్’ అంటూ గతంలో వ్యాఖ్యానించిన వెంకయ్య, దేశంలో మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ‘టేక్ టెంపరరీ పెయిన్, ఫర్ లాంగ్ టెర్మ్ గెయిన్’ అని చమత్కరించారు. ఆయన సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉండడం వల్ల ఆ బంధాన్ని మరచిపోలేక పోతున్నారు. నేటికి కూడా బీజేపీ నినాదమైన ‘న్యూ ఇండియా’ అనే ఆయన మాట్లాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment