సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ బంధనం లో చిక్కుకుని గత కొన్ని నెలల కాలం లో మనం గడిపిన జీవితంపై ప్రజలం తా ఆత్మశోధన చేసుకోవాలని, ఈ సమయంలో సరైన జీవిత పాఠాలు నేర్చుకున్నామో లేదో తమకు తాముగా అం చనా వేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. అనూహ్య అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన సన్నద్ధతతో ఉన్నామా అన్నది తరచి చూసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. కోవిడ్–19కు కారణాలు, పర్యవసానాలపై ప్రజలతో తన భావనలు పంచుకునేందుకు వెంకయ్య నాయుడు ఫేస్‌బుక్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.
‘కరోనా కాలంలో జీవిత భావనలు’అన్న శీర్షికతో ఆయన తన అభిప్రాయాలను సంభాషణా శైలిలో వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పది ప్రశ్నలను సంధించారు. ‘ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలే పలు జీవిత పాఠాలను నేర్పుతాయి. కోవిడ్–19 సంక్షోభంతో ఇళ్లకే పరిమితమై గత 4 నెలల్లో నేర్చుకున్న జీవిత పాఠాలను, జీవితంలో మార్పులను మదింపు చేసుకునేందుకు ఈ ప్రశ్నలు దోహదపడతాయి. కరోనా మహమ్మారిని కేవలం ఒక వైపరీత్యంగా మాత్రమే పరిగణించరాదు, మన జీవనశైలిని సంస్కరించే ‘దిద్దుబాటుదారు’గా, ‘సంస్కరణ కర్త’గా చూడాల్సిన అవసరం ఉంది’అని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
ఆతృతకు తావులేకుండా..
ఎలాంటి ఆతృతకు తావులేని జీవనవిధానానికి ఆయన పలు సూచనలు చేశారు. సరైన ఆలోచన, జీవన విధానం, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ఆహారాన్ని ఔషధంగా పరిగణించడం, సామాజిక బంధంతో ఒక అర్థవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవడం వంటి సూచనలను పొందుపరిచారు. వైపరీత్యాలకు గల కారణాలను గురించి ప్రస్తావించారు. ‘మొత్తం భూగోళం మానవులకోసమే అన్నట్టుగా మనుషులు పెత్తనం చెలాయించడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది’ అని అన్నారు.
తల్లిదండ్రుల, పెద్దల సంరక్షణలో తాము చేస్తున్న తప్పులేమిటో గుర్తించారని, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనడానికి సన్నద్ధమయ్యారని, ఇన్నాళ్లూ కోల్పోయిందేమిటో తాము ఇళ్లకే పరిమితమైనపుడు గుర్తించారన్నారు. ‘మనమంతా సమానులుగా పుట్టాం. కాలం గడుస్తున్న కొద్దీ చివరకు సమా నత్వంలో భేదాలు తలెత్తాయి. కొన్ని వర్గాల కష్టాలను, కడగండ్ల తీవ్రతను ఈ మహమ్మారి ఎత్తిచూపింది’అని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment