చిన్నారుల సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది | Vice President Venkaiah Naidu Releases State Of Young Child In India Book | Sakshi
Sakshi News home page

చిన్నారుల సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది

Published Fri, Sep 4 2020 8:26 PM | Last Updated on Fri, Sep 4 2020 8:28 PM

Vice President Venkaiah Naidu Releases State Of Young Child In India Book - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివృద్ధికి పునాది పండుతుందన్న ఆయన, ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

శుక్రవారం ఉప రాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో.. ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని అంతర్జాల వేదిక ద్వారా ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పౌష్టికాహార లోపం ఓ సవాల్‌గా మారిందని, దీన్ని అధిగమించడం ద్వారానే దేశ భవిష్యత్ అయిన చిన్నారులను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని తెలిపారు. సరైన పోషకాహారం అందకపోవడం ద్వారా చిన్నారుల శారీరక, మేధో వికాసానికి ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో పౌష్టికాహార సమస్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయన్న ఉప రాష్ట్రపతి.. ఈ మహత్కార్యంలో స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సహా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.భారతదేశ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే దేశ భవిష్యత్ అయిన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఇందుకోసం వ్యూహాత్మక, సమష్టి కార్యాచరణ అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్నారులకు ఆరోగ్యం మీద దృష్టి పెట్టడమే గాక, ఆనందంగా, ఉల్లాసంగా ఉండేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం కూడా వారి సర్వతోముఖాభివృద్ధికి కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఇందుకోసం చిన్నారులకు మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమైన, విలువైన సమయమన్న ఉప రాష్ట్రపతి.. ఈ సమయంలో వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ సామాజిక, విద్యావిషయక అవసరాలను తీర్చాల్సిన అవసరాన్ని విస్మరించరాదన్నారు. బాల్యంలోనే ఆరోగ్యకరమైన జీవితాన్ని, నాణ్యమైన విద్యను అందుకున్న చిన్నారులు బలమైన పునాదిని వేసుకుని.. భవిష్యత్తులో సమాజాభివృద్ధిలో తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఆయన పేర్కొన్నారు.పుస్తకంలో ప్రస్తావించిన పలు అంశాలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. ‘భారతదేశంలో 15.9 కోట్ల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఇందులో 21శాతం మందిలో పోషకాహారలోపం, 36శాతం మంది తక్కువ బరువుతో ఉండగా.. 38 శాతం మందికి టీకాలు అందడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ అంకెలు.. చిన్నారులతోపాటు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం మరింత కృషిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌష్టికాహార సమస్య నిర్మూలనకు జరుగుతున్న సమగ్ర శిశు సంరక్షణ పథకం (ఐసీడీఎస్) ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సు సూచించిన లక్ష్యాల దిశగా భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.  సమాజంలో అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని మహాత్మాగాంధీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కలలుగన్న అంత్యోదయ నినాదాన్ని సాకారం చేయడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. విస్తృత అధ్యయనంతో ఈ పుస్తకాన్ని రూపొందించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మొబైల్ క్రచెస్ సంస్థ చైర్‌పర్సన్ అమృతాజైన్, సహ వ్యవస్థాపకురాలు దేవికా సింగ్, కార్యనిర్వాహక నిర్దేశకురాలు సుమిత్ర మిశ్రా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సంజయ్ కౌల్, డాక్టర్ అనురాధా రాజీవన్.. టేలర్ అండ్ ఫ్రాన్సిస్ గ్రూప్ (ప్రచురణ సంస్థ) డైరెక్టర్ డాక్టర్ శశాంక్ సిన్హా, ద హిందూ పత్రిక మాజీ ప్రధాన సంపాదకుడు రామ్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement