సాక్షి, న్యూఢిల్లీ: నీటి చార్జీలను 10 శాతం మేర పెంచాలని ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) నిర్ణయించింది. కానీ, ఈ చార్జీల పెంపును అందరికీ కాకుండా నెలకు 20 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగించే కుటుంబాలకు వర్తింపు చేయాలని డీజేబీ భావిస్తోంది. కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తామన్న హామీతో ఆప్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఆప్ సర్కారు ఏర్పాటు కాగానే ఉచిత నీటి హామీని నిలబెట్టుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని, అంతకు మించి ఒక్క లీటరును ఎక్కువగా వినియోగించినా పూర్తి చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే ఇప్పుడు ఉచిత నీటి సరఫరా వల్ల తగ్గిన ఆదాయన్ని పూడ్చుకోవడం కోసం నీటి చార్జీలను పది శాతం పెంచాలని డీజేబీ నిర్ణయించింది. గురువారం జరిగిన ఢిల్లీ జల్ బోర్డు సమావేశంలో 20 వేల లీటర్లకు పైగా వినియోగించే కుటుంబాల నీటి చార్జీలను 10 శాతం పెంచడంతోపాటు, 250 వాటర ట్యాంకర్లను కొనాలని నిర్ణయించారు. సమావేశంలో ఇతర అంశాలతో పాటు అనధికార కనెక్షన్లను క్రమబద్ధీకరించడంపై కూడా చర్చ జరిగింది. నగరంలోని అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని సమావేశం నిర్ణయించింది. రాజధానిలో 23 వేల అక్రమ కనెక్షన్లు ఉన్నాయనేది డీజేబీ అంచనా. కొత్త కనెక్షన్ కోసం డెవలప్‌మెంట్ చార్జీ వసూలు చేయరాదని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. నీటి కనెక్షన్ల కోసం ప్రభుత్వం త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానుంది. దీని కింద రూ. 3,500 కొత్త కనెక్షన్ ఇస్తారు.
నీటి చార్జీలను 10 శాతం పెంచనున్న డీజేబీ
Published Thu, Mar 19 2015 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement