కరెంటు మంటలు
Published Sat, Feb 1 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి.. చార్జీలను ఎనిమిది శాతం పెంచుతున్నట్టు ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్‌సీ) చేసిన ప్రకటన తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇంధన వ్యయాల సర్దుబాటు చార్జీల పెంపునకు అనుగుణంగా విద్యుత్ సర్‌చార్జ్‌లను 6-8 శాతం పెంచవలసి వచ్చిందని డీఈఆర్‌సీ పేర్కొంది. చార్జీల పెంపును అరవింద్ కేజ్రీవాల్ సర్కారు ఖండించింది. ఓ పక్క విద్యుత్ కంపెనీల ఖాతాలను సీఏజీ (కాగ్) ఆడిట్ చేస్తుండగా మరోపక్క విద్యుత్ సర్‌చార్జీలను పెంచడం అనవసర చర్య అని ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని ఆప్ ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం చేసింది.
అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని స్లాబ్‌లపై విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గించింది. ఇంధన వ్యయ సర్దుబాటు చార్జీలు పెరగడం వల్లే టారిఫ్‌ను పెంచాల్సి వచ్చిందని డీఈఆర్సీ చైర్మన్ పీడీ సుధాకర్ పేర్కొన్నారు.యమునాపవర్‌కు ఎనిమిది శాతం చొప్పున, రాజధాని పవర్‌కు ఆరుశాతం చొప్పున, టాటాపవర్‌కు ఏడుశాతం చొప్పున సర్దుబాటు చార్జీలు పెంచారు. డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని సుధాకర్ అన్నారు. డిస్కమ్‌ల విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని సర్దుబాటు చేయడం కోసం డీఈఆర్‌సీ 2012లో విద్యుత్ సర్‌చార్జిని ప్రవేశపెట్టింది. కాగ్ ఆడిట్ నివేదిక వచ్చేంతవరకు డీఈఆర్‌సీ వేచి ఉండాల్సిందని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. డిస్కమ్‌ల పనితీరుపై అనేక అనుమానాలు తలెత్తిన సమయంలో సర్‌చార్జీని పెంచి ప్రజలపై అదనపు భారం వేయడం సరైన చర్య కాదని ప్రభుత్వం పేర్కొంది.
నిధుల లేమే కారణమంటున్న డిస్కమ్‌లు
విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించడానికి తన దగ్గర నిధులు లేవని బీఎస్‌ఈఎస్ ఢిల్లీ విద్యుత్‌శాఖ కార్యదర్శి పునీత్ గోయల్‌కు లేఖ రాసింది. బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకులు కూడా రుణాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని వివరణ ఇచ్చింది. ఈ క్లిష్టపరిస్థితి నుంచి గట్టెక్కడానికి తక్షణం ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. అందుకే కోతలు విధిస్తున్నట్టు వివరణ ఇచ్చింది. కరెంటు ఉత్పత్తి కంపెనీలు ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, విద్యుత్ మంత్రిత్వశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖతో ఈ సమస్యపై చర్చలు జరపాలని కోరింది.
డిస్కమ్‌లతో కేజ్రీవాల్ కుమ్మక్కు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విద్యుత్ పంపిణీ కంపెనీల (డిస్కమ్‌లు)తో కుమ్మక్కై చార్జీలను పెంచారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ పరిణామానికి ముఖ్యమంత్రే పూర్తి బాధ్యుడని, ప్రజలను ఆయన వంచించారని కాంగ్రెస్ నాయకుడు హరూన్ యూసుఫ్ శనివారం ఆరోపించారు. టారిఫ్ పెంపు గురించి డీఈఆర్సీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముందస్తుగానే సమాచారం ఇస్తుందని, పెంపు గురించి తనకు తెలియదన్న కేజ్రీవాల్ ప్రకటన అసత్యమని స్పష్టం చేశారు.
కోతలు 11వ తేదీకి వాయిదా
బకాయిలు చెల్లింపునకు పది రోజుల గడువు
సాక్షి, న్యూఢిల్లీ: పదిగంటల విద్యుత్ కోతల నుంచి ఢిల్లీవాసులకు తాత్కాలికంగా ఊరట లభించింది. బకాయిలు చెల్లించడానికి విద్యుత్ ఉత్పాదన కంపెనీ ఎన్టీపీసీ డిస్కమ్‌లకు ఈనెల 11 వరకు గడువిచ్చింది. ఆలోపు బకాయిలు చెల్లించాలని బీఎస్‌ఈఎస్ రాజ ధాని, బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివే స్తామని హెచ్చరించింది. బీఆర్‌పీఎల్ రాజధాని పవర్ లిమిటెడ్ 271 కోట్ల రూపాయలు, బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ 204 కోట్ల రూపాయలు ఎన్టీపీసీకి బకాయిపడ్డాయి. బీఎస్‌ఈఎస్ రాజధాని సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఎన్టీపీసీ పేర్కొంది. దక్షిణ, పశ్చిమ ఢిల్లీలోని 18.5 లక్షల కుటుంబాలకు బీఎస్‌ఈఎస్ విద్యుత్ సరఫరా చేస్తోంది.
Advertisement
Advertisement