సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ కోతలతో సతమతమవుతోన్న ఢిల్లీవాసులపై మరోసారి విద్యుత్తు చార్జీల భారం పడింది. విద్యుత్ చార్జీలను 8.32 శాతం పెంచుతున్నట్లు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్(డీఈఆర్‌సీ) ప్రకటించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని ప్రాంతాల్లోని వినియోగదారులు మరింత ఎక్కువ పెంపు భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యుత్తు చార్జీలను 9.52 శాతం పెంచారు. డీఈఆర్‌సీ చైర్మన్ పి.డి. సుధాకరం గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. విద్యుత్తు చార్జీలను స్వల్పంగా పెంచుతున్నామని, పవర్ పర్చేజ్ అగ్రీమెంట్ చార్జీలను(పీపీఏసీ) తొలగిస్తున్నందువల్ల విద్యుత్తు చార్జీల పెంపు భారం వినియోగదారులపై అంతగా ఉండదని ఆయన చెప్పారు.
విద్యుత్తును తక్కువ ఖరీదుకు కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. గృహవినియోగదారులతోపాటు వ్యాపార, వాణిజ్య కార్యాకలాపాలకు వినియోగించే విద్యుత్ చార్జీలను కూడా పెంచారు. ఢిల్లీ మెట్రో విద్యుత్తు చార్జీలు 11 శాతం పెరిగాయి. ఢిల్లీకి సరఫరా అయ్యే విద్యుత్ ఎక్కువగా థర్మల్ ఆధారిత విద్యుత్తు కావడంతో బొగ్గు ధరలు పెరిగినందువల్ల విద్యుత్తు చార్జీలను పెంచాలని మూడు డిస్కంలు - బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కంపెనీలు చేసిన డిమాండ్ మేరకు విద్యుత్తు చార్జీలను పెంచినట్లు సుధాకర్ చెప్పారు.
800 పై యూనిట్ల వారికే భారం..
విద్యుత్తు చార్జీల పెంపు భారం 800 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే వినియోగదారులపై పడింది. 0- 200 యూనిట్ల స్లాబ్‌కు విద్యుత్తు చార్జీలను యూనిట్‌కు 10 పైసల చొప్పున, 201-400 యూనిట్ల స్లాబ్ కు చార్జీలను యూనిట్‌కు 15 పైసల చొప్పున, 401-800 యూనిట్ల వరకున్న స్లాబ్‌కు యూనిట్‌కు 50 పైసల చొప్పున, 801- 1,200 యూనిట్ల వరకున్న స్లాబ్‌కు యూనిట్‌కు రూ.1.10 చొప్పున చార్జీలను పెంచినట్లు సుధాకర్ ప్రకటించారు. 1,200 పైగా యూనిట్ల స్లాబ్‌కు కొత్తగా ప్రవేశపెట్టారు.1,200 పైనున్న విద్యుత్తు స్లాబ్‌కు యూనిట్‌కు రూ.1.75 చొప్పున చార్జీల పెంపు వర్తిస్తుంది. ఎన్డీఎమ్సీ ప్రాంతాలలో 200 -400 యూనిట్లకు యూనిట్‌కు 25 పైసల చొప్పున చార్జీలు పెరిగాయి.
పీపీఏసీల తొలగింపుతో తగ్గిన భారం..
విద్యుత్తు చార్జీలను పెంచినప్పటికీ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ చార్జీలను(పీపీఏసీ) తొలగించారు. దీంతో నెలవారీ బిల్లులో సర్‌చార్జీల మోత ఉండదు. ప్రస్తుతం సర్‌చార్జీ పేరుతో ఆరు నుంచి ఎనమిది శాతం వసూలు చేస్తున్నారు. పీపీఏసీ తొలగించడం వల్ల 400 యూనిట్ల లోపు విద్యుత్తు వాడేవారికి నెలసరి బిల్లు మరింత తగ్గుతుందని సుధాకర్ చెప్పారు. గతంలో 70 శాతం వినియోగదారులు 400 యూనిట్ల వరకు ఉపయోగించేవారని ఆయన చెప్పారు. 800 యూనిట్ల కన్నాఎక్కువగా విద్యుత్తు వాడేవారికి నెలవారీ బిల్లు మాత్రం పెరగనుందన్నారు.
పవర్ పర్చేజ్ కాస్ట్ అగ్రీమెంట్ చార్జీలను తొలగించడం వల్ల పెంచిన విద్యుత్తు చార్జీల పెంపుప్రభావం పెద్దగా ఉండదని, పీపీఏసీని మూడు నెలల వరకు తొలగిస్తున్నామని, దానిని అమలుచేయాలా వద్దా అనేదానిపై అక్టోబర్‌లో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని సుధాకర్ తెలిపారు. పీపీఏసీ అవసరమని డీఈఆర్‌సీ అభిప్రాయపడితే మూడు నెలల తరువాత దానిని అమలుచేస్తామని, అలా జరిగినట్లయితే విద్యుత్తు చార్జీల పెంపు ప్రభావం నవంబర్‌లో కనిస్తుందని డీఈఆర్‌సీ అధికారులు తెలిపారు. విద్యుత్తు చార్జీల పెంపు వల్ల రూ.1,245 కోట్ల ఆదాయం లభిస్తుందని డీఈఆర్‌సీ అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని ససాన్‌లో అల్ట్రామెగాపవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్తును చౌకగా కొనే ప్రయత్నం చేస్తున్నట్లు డీఈఆర్‌సీ చైర్మన్ సుధాకర్ తెలిపారు. ప్రజల డిమాండ్ మేరకు సీజీహెచ్‌ఎస్, డీడీఏ కాలనీలలో పార్కింగ్ వంటి కామన్ ఏరియాలలో సాధారణ డొమెస్టిక్ స్లాబ్‌ల ప్రకారం విద్యుత్తు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఈ కామన్ ఏరియాలకు అత్యధిక డొమెస్టిక్ స్లాబ్‌ను వర్తింపచేస్తున్నారని చెప్పారు. అలాగే పార్కులలో గృహేతర స్లాబ్‌ల ప్రకారం కాకుండా డొమెస్టిక్ స్లాబ్ ప్రకారం విద్యుత్తు చార్జీలను వసూలుచేస్తారు.
తీవ్రంగా వ్యతిరేకించిన ఆప్, కాంగ్రెస్
విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ ప్రభుత్వం ఇచ్చిన సబ్సీడీని ఎత్తివేశారని, 50 శాతం సబ్సీడీ ఇస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ నెలరోజులకే సబ్సీడీ ఇచ్చి పారిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ విమర్శించారు. ఎన్నికల సమయంలో 30 శాతం విద్యుత్తు సబ్సీడీ ఇస్తామని ప్రకటించిన బీజేపీ తన హామీని మరిచిపోయిందని ఆయన ఆరోపించారు. కేంద్రం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని చార్జీలను త గ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గించవచ్చని, అయినా చార్జీలను పెంచుతున్నారని ఆప్ ఆరోపించింది. విద్యుత్తు చార్జీలను పెంచడం ప్రజలపై అదనపు భారం మోపడమేనని బీజేపీ నేత జగ్‌దీశ్ ముఖీ పేర్కొన్నారు.
విద్యుత్ చార్జీల మోత
Published Thu, Jul 17 2014 11:00 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM
Advertisement
Advertisement