PPAC
-
చమురు బిల్లు తడిసి మోపెడు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్ – 2022 మార్చి) ముడి చమురు దిగుమతుల బిల్లు 125 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) దాటిపోనుంది. క్రితం ఆర్థిక సంవత్సరం బిల్లుతో పోలిస్తే ఇది రెట్టింపు పరిమాణం. అంతర్జాతీయంగా చమురు ధరలు ఏడేళ్ల గరిష్టాలకు చేరడంతో దిగుమతులపై మరింత మొత్తం వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు 11 నెలల్లో చమురు దిగుమతుల కోసం వెచ్చించిన మొత్తం 110 బిలియన్ డాలర్లుగా ఉంది. పెట్రోలియం శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనలైసిస్ సెల్ (పీపీఏసీ) ఈ గణాంకాలను విడుదల చేసింది. ఒక్క జనవరిలోనే ముడి చమురు కోసం 11.6 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 2021 జనవరిలో ఈ మొత్తం 7.7 బిలియన్ డాలర్లుగానే ఉంది. చమురు ధరలు పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. ఉక్రెయిన్–రష్యా సంక్షోభంతో చమరు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 110 డాలర్ల వరకు వెళ్లడం తెలిసిందే. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. దిగుమతి చేసుకున్న చమురును ఆయిల్ కంపెనీలు రిఫైనింగ్ ప్రక్రియ ద్వారా పెట్రోల్, డీజిల్‌గా మారుస్తాయి. మన దేశానికి సంబంధించి రిఫైనింగ్ సామర్థ్యం మిగులు ఉంది. కొన్ని పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తున్నాం. ఎల్పీజీని సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పెట్రోలియం ఉత్పత్తులదీ అదే పరిస్థితి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 33.6 మిలియన్ టన్నులుగా ఉంది. వీటి విలువ 19.9 బిలియన్ డాలర్లు. అదే కాలంలో 33.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 51.1 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు నమోదయ్యాయి. భారత్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు కోసం 62.2 బిలియన్ డాలర్లను (196.5 మిలియన్ టన్నులు) ఖర్చు చేసింది. కరోనా కారణంగా చమురు ధరలు స్థిరంగా ఉండడం లాభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతులు జనవరి చివరికి 175.9 మిలియన్ టన్నులు దాటిపోవడం గమనార్హం. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో 227 మిలియన్ టన్నుల ముడి చమురును నికరంగా దిగుమతి చేసుకున్నాం. ఇందుకోసం చేసిన ఖర్చు 101.4 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతుల బిల్లు పెరిగిపోతే అది స్థూల ఆర్థిక అంశాలపై ప్రభావం చూపిస్తుంది. దేశీయంగా తగ్గిన చమురు ఉత్పత్తి దేశీయంగా చమురు ఉత్పత్తి పెరగకపోగా, ఏటా క్షీణిస్తూ వస్తోంది. ఇది కూడా దిగుమతులు పెరిగేందుకు దారితీస్తోంది. 2019–20లో 30.5 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి అయింది. 2020–21లో ఇది 29.1 మిలియన్ టన్నులకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు చేసిన ఉత్పత్తి 23.8 మిలియన్ టన్నులుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఉత్పత్తి 24.4 మిలియన్ టన్నులుగా ఉండడం గమనించాలి. ఎల్ఎన్జీ దిగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో 6.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి చివరకు 9.9 బిలియన్ డాలర్లకు పెరిగిపోయాయి. స్టోరేజీ నుంచి సరఫరాలు.. ధరలు తగ్గేందుకు కేంద్రం చర్యలు ప్రపంచ ఇంధన మార్కెట్లలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు చమురు శాఖ తాజాగా పేర్కొంది. రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ భయాల నేపథ్యంలో సరఫరా అవాంతరాలు, తదితర సవాళ్లను పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో అవసరమైతే ధరలు తగ్గేందుకు వీలుగా వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఇటీవల అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్‌కు దాదాపు 110 డాలర్లవరకూ ఎగసిన విషయం విదితమే. ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ దాడుల కారణంగా సరఫరాలకు విఘాతం కలగవచ్చన్న అంచనాలు ప్రభావం చూపాయి. రష్యాపై పశ్చిమ దేశాల తీవ్ర ఆంక్షలతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రపంచ దేశాలలో సరఫరా మార్గాలకు అవాంతరాలు లేకుంటే æచమురు ధరల తీవ్రత నెమ్మదించే వీలుంది. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను నిరోధించేందుకు భారత్ తగిన చర్యలు సైతం చేపడుతోంది. ఇందుకు అనుగుణంగా అమెరికా, జపాన్ బాటలో గతేడాది నవంబర్‌లో వ్యూహాత్మక నిల్వల నుంచి భారత్ 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేసేందుకు అంగీకరించింది. తీవ్ర ధరల నేపథ్యంలో ఎన్నికలు పూర్తవడంతోనే ధరలు రూ.10 వరకూ పెంచే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నిరాటంకంగా రష్యన్ వజ్రాల సరఫరా: జీజేఈపీసీ యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లు అందరికీ వజ్రాలను నిరాటంకంగా సరఫరా చేస్తామని రష్యాకు చెందిన డైమండ్ మైనింగ్ సంస్థ అల్రోసా భరోసా ఇచ్చింది. రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా ఈ విషయం తెలిపారు. అల్రోసా ఉత్పత్తి చేసే మొత్తం రఫ్ డైమండ్‌లో దాదాపు 10 శాతాన్ని భారత్ దిగుమతి చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాపారం యథాప్రకారంగానే కొనసాగుతోందని, రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫిబ్రవరి 28న జీజేఈపీసీకి అల్రోసా నుంచి లేఖ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఇంధనానికి మళ్లీ డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్డౌన్లను సడలించే కొద్దీ దేశీయంగా ఇంధనానికి డిమాండ్ మళ్లీ మెరుగుపడుతోంది. మేలో తొమ్మిది నెలల కనిష్టానికి పడిపోయిన వినియోగం .. ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలు మెరుగుపడే కొద్దీ జూన్‌లో మళ్లీ పుంజుకుంది. గతేడాది జూన్‌తో పోలిస్తే గత నెల ఇంధన వినియోగం 1.5 శాతం పెరిగి 16.33 మిలియన్ టన్నులుగా నమోదైంది. మే నెలతో పోలిస్తే 8 శాతం వృద్ధి చెందింది. పెట్రోలియం, సహజ వాయువు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. విభాగాలవారీగా చూస్తే పెట్రోల్ వినియోగం వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం పెరిగి 2.4 మిలియన్ టన్నులకు చేరింది. మే నెలలో నమోదైన 1.99 మిలియన్ టన్నులతో పోలిస్తే 21 శాతం పెరిగింది. అటు దేశీయంగా అత్యధికంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు మే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగి 6.2 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. అయితే, గతేడాది జూన్‌తో పోలిస్తే మాత్రం 1.5 శాతం తగ్గాయి. ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే జూన్‌లో తొలిసారిగా ఇంధనాలకు డిమాండ్ పెరిగింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ రావడానికి ముందు మార్చిలో .. ఇంధనాలకు డిమాండ్ కోవిడ్ పూర్వ స్థాయికి దాదాపుగా చేరింది. కానీ ఇంతలోనే సెకండ్‌వేవ్ రావడంతో వినియోగం క్షీణించింది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు విధించడంతో మేలో తొమ్మిది నెలల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు, తాజా జూన్‌లో వంట గ్యాస్ వినియోగం వార్షికంగా చూస్తే 9.7 శాతం పెరిగి 2.26 మిలియన్ టన్నులకు చేరింది. విమానయాన సంస్థలు ఇంకా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో.. విమా న ఇంధన (ఏటీఎఫ్) అమ్మకాలు వార్షికంగా చూస్తే 16.2 శాతం పెరిగినప్పటికీ కోవిడ్ పూర్వం నాటి 2019 జూన్‌తో పోలిస్తే 61.7 శాతం క్షీణించాయి. -
8 శాతం తగ్గిన సహజవాయువు ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు (గ్యాస్) ధరలను 8% మేర తగ్గిస్తూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానిం గ్ అండ్ అనాలిసిస్ సెల్(పీపీఏసీ) మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 5.05 డాలర్లుగా ఉన్న మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) గ్యాస్ ధర ఇకపై 4.66 డాలర్లకు తగ్గుతుంది. విద్యుత్, ఎరువుల ఉత్పత్తికి ప్రయోజనకరంగా ఉండనున్న ఈ రేటు ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 దాకా అమల్లో ఉంటుంది. గ్యాస్ నాణ్యతకు కొలమానమైన స్థూల కెలోరిఫిక్ విలువ (జీసీవీ) ఆధారంగా ఈ ధర నిర్ణయించారు. గ్యాస్ ఉత్పత్తి చేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆర్ఐఎల్ వంటి సంస్థల ఆదాయాలపై ప్రతికూల ప్రభా వం పడనుంది. ఈ విధంగా గ్యాస్ రేట్లు తగ్గిం చడం ఇదే తొలిసారి కానుంది. గతేడాది అక్టోబర్‌లో రూపొందించిన ఫార్ములా ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి ధరలను సవరిస్తున్నారు. -
విద్యుత్ చార్జీల మోత
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ కోతలతో సతమతమవుతోన్న ఢిల్లీవాసులపై మరోసారి విద్యుత్తు చార్జీల భారం పడింది. విద్యుత్ చార్జీలను 8.32 శాతం పెంచుతున్నట్లు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్(డీఈఆర్సీ) ప్రకటించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని ప్రాంతాల్లోని వినియోగదారులు మరింత ఎక్కువ పెంపు భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యుత్తు చార్జీలను 9.52 శాతం పెంచారు. డీఈఆర్సీ చైర్మన్ పి.డి. సుధాకరం గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. విద్యుత్తు చార్జీలను స్వల్పంగా పెంచుతున్నామని, పవర్ పర్చేజ్ అగ్రీమెంట్ చార్జీలను(పీపీఏసీ) తొలగిస్తున్నందువల్ల విద్యుత్తు చార్జీల పెంపు భారం వినియోగదారులపై అంతగా ఉండదని ఆయన చెప్పారు. విద్యుత్తును తక్కువ ఖరీదుకు కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. గృహవినియోగదారులతోపాటు వ్యాపార, వాణిజ్య కార్యాకలాపాలకు వినియోగించే విద్యుత్ చార్జీలను కూడా పెంచారు. ఢిల్లీ మెట్రో విద్యుత్తు చార్జీలు 11 శాతం పెరిగాయి. ఢిల్లీకి సరఫరా అయ్యే విద్యుత్ ఎక్కువగా థర్మల్ ఆధారిత విద్యుత్తు కావడంతో బొగ్గు ధరలు పెరిగినందువల్ల విద్యుత్తు చార్జీలను పెంచాలని మూడు డిస్కంలు - బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కంపెనీలు చేసిన డిమాండ్ మేరకు విద్యుత్తు చార్జీలను పెంచినట్లు సుధాకర్ చెప్పారు. 800 పై యూనిట్ల వారికే భారం.. విద్యుత్తు చార్జీల పెంపు భారం 800 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే వినియోగదారులపై పడింది. 0- 200 యూనిట్ల స్లాబ్‌కు విద్యుత్తు చార్జీలను యూనిట్‌కు 10 పైసల చొప్పున, 201-400 యూనిట్ల స్లాబ్ కు చార్జీలను యూనిట్‌కు 15 పైసల చొప్పున, 401-800 యూనిట్ల వరకున్న స్లాబ్‌కు యూనిట్‌కు 50 పైసల చొప్పున, 801- 1,200 యూనిట్ల వరకున్న స్లాబ్‌కు యూనిట్‌కు రూ.1.10 చొప్పున చార్జీలను పెంచినట్లు సుధాకర్ ప్రకటించారు. 1,200 పైగా యూనిట్ల స్లాబ్‌కు కొత్తగా ప్రవేశపెట్టారు.1,200 పైనున్న విద్యుత్తు స్లాబ్‌కు యూనిట్‌కు రూ.1.75 చొప్పున చార్జీల పెంపు వర్తిస్తుంది. ఎన్డీఎమ్సీ ప్రాంతాలలో 200 -400 యూనిట్లకు యూనిట్‌కు 25 పైసల చొప్పున చార్జీలు పెరిగాయి. పీపీఏసీల తొలగింపుతో తగ్గిన భారం.. విద్యుత్తు చార్జీలను పెంచినప్పటికీ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ చార్జీలను(పీపీఏసీ) తొలగించారు. దీంతో నెలవారీ బిల్లులో సర్‌చార్జీల మోత ఉండదు. ప్రస్తుతం సర్‌చార్జీ పేరుతో ఆరు నుంచి ఎనమిది శాతం వసూలు చేస్తున్నారు. పీపీఏసీ తొలగించడం వల్ల 400 యూనిట్ల లోపు విద్యుత్తు వాడేవారికి నెలసరి బిల్లు మరింత తగ్గుతుందని సుధాకర్ చెప్పారు. గతంలో 70 శాతం వినియోగదారులు 400 యూనిట్ల వరకు ఉపయోగించేవారని ఆయన చెప్పారు. 800 యూనిట్ల కన్నాఎక్కువగా విద్యుత్తు వాడేవారికి నెలవారీ బిల్లు మాత్రం పెరగనుందన్నారు. పవర్ పర్చేజ్ కాస్ట్ అగ్రీమెంట్ చార్జీలను తొలగించడం వల్ల పెంచిన విద్యుత్తు చార్జీల పెంపుప్రభావం పెద్దగా ఉండదని, పీపీఏసీని మూడు నెలల వరకు తొలగిస్తున్నామని, దానిని అమలుచేయాలా వద్దా అనేదానిపై అక్టోబర్‌లో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని సుధాకర్ తెలిపారు. పీపీఏసీ అవసరమని డీఈఆర్సీ అభిప్రాయపడితే మూడు నెలల తరువాత దానిని అమలుచేస్తామని, అలా జరిగినట్లయితే విద్యుత్తు చార్జీల పెంపు ప్రభావం నవంబర్‌లో కనిస్తుందని డీఈఆర్సీ అధికారులు తెలిపారు. విద్యుత్తు చార్జీల పెంపు వల్ల రూ.1,245 కోట్ల ఆదాయం లభిస్తుందని డీఈఆర్సీ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ససాన్‌లో అల్ట్రామెగాపవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్తును చౌకగా కొనే ప్రయత్నం చేస్తున్నట్లు డీఈఆర్సీ చైర్మన్ సుధాకర్ తెలిపారు. ప్రజల డిమాండ్ మేరకు సీజీహెచ్ఎస్, డీడీఏ కాలనీలలో పార్కింగ్ వంటి కామన్ ఏరియాలలో సాధారణ డొమెస్టిక్ స్లాబ్‌ల ప్రకారం విద్యుత్తు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఈ కామన్ ఏరియాలకు అత్యధిక డొమెస్టిక్ స్లాబ్‌ను వర్తింపచేస్తున్నారని చెప్పారు. అలాగే పార్కులలో గృహేతర స్లాబ్‌ల ప్రకారం కాకుండా డొమెస్టిక్ స్లాబ్ ప్రకారం విద్యుత్తు చార్జీలను వసూలుచేస్తారు. తీవ్రంగా వ్యతిరేకించిన ఆప్, కాంగ్రెస్ విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ ప్రభుత్వం ఇచ్చిన సబ్సీడీని ఎత్తివేశారని, 50 శాతం సబ్సీడీ ఇస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ నెలరోజులకే సబ్సీడీ ఇచ్చి పారిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ విమర్శించారు. ఎన్నికల సమయంలో 30 శాతం విద్యుత్తు సబ్సీడీ ఇస్తామని ప్రకటించిన బీజేపీ తన హామీని మరిచిపోయిందని ఆయన ఆరోపించారు. కేంద్రం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని చార్జీలను త గ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గించవచ్చని, అయినా చార్జీలను పెంచుతున్నారని ఆప్ ఆరోపించింది. విద్యుత్తు చార్జీలను పెంచడం ప్రజలపై అదనపు భారం మోపడమేనని బీజేపీ నేత జగ్దీశ్ ముఖీ పేర్కొన్నారు.