న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌లను సడలించే కొద్దీ దేశీయంగా ఇంధనానికి డిమాండ్ మళ్లీ మెరుగుపడుతోంది. మేలో తొమ్మిది నెలల కనిష్టానికి పడిపోయిన వినియోగం .. ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలు మెరుగుపడే కొద్దీ జూన్‌లో మళ్లీ పుంజుకుంది. గతేడాది జూన్‌తో పోలిస్తే గత నెల ఇంధన వినియోగం 1.5 శాతం పెరిగి 16.33 మిలియన్ టన్నులుగా నమోదైంది. మే నెలతో పోలిస్తే 8 శాతం వృద్ధి చెందింది. పెట్రోలియం, సహజ వాయువు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
విభాగాలవారీగా చూస్తే పెట్రోల్ వినియోగం వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం పెరిగి 2.4 మిలియన్ టన్నులకు చేరింది. మే నెలలో నమోదైన 1.99 మిలియన్ టన్నులతో పోలిస్తే 21 శాతం పెరిగింది. అటు దేశీయంగా అత్యధికంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు మే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగి 6.2 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. అయితే, గతేడాది జూన్‌తో పోలిస్తే మాత్రం 1.5 శాతం తగ్గాయి. ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే జూన్‌లో తొలిసారిగా ఇంధనాలకు డిమాండ్ పెరిగింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ రావడానికి ముందు మార్చిలో .. ఇంధనాలకు డిమాండ్ కోవిడ్ పూర్వ స్థాయికి దాదాపుగా చేరింది. కానీ ఇంతలోనే సెకండ్‌వేవ్ రావడంతో వినియోగం క్షీణించింది.
పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, ఆంక్షలు విధించడంతో మేలో తొమ్మిది నెలల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు, తాజా జూన్‌లో వంట గ్యాస్ వినియోగం వార్షికంగా చూస్తే 9.7 శాతం పెరిగి 2.26 మిలియన్ టన్నులకు చేరింది. విమానయాన సంస్థలు ఇంకా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో.. విమా న ఇంధన (ఏటీఎఫ్) అమ్మకాలు వార్షికంగా చూస్తే 16.2 శాతం పెరిగినప్పటికీ కోవిడ్ పూర్వం నాటి 2019 జూన్‌తో పోలిస్తే 61.7 శాతం క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment