న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా లేకపోతే తాజాగా ప్రజల తీర్పు కోరాలా అనే విషయమై త్వరలో ఓ నిర్ణయానికొస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు సీనియర్లతో సమావేశమై వారి సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సతీష్ ఆదివారం మీడియాతో తన మనోభావాలను పంచుకున్నారు. ఒకవేళ తాజాగా ఎన్నికలు జరిగితే తమకు అత్యధిక స్థానాలు వస్తాయని ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో సత్సంబంధాలు కలిగిన 52 ఏళ్ల సతీష్ చెప్పారు. కాగా తాజా ఎన్నికలకు కొంతమంది ఎమ్మెల్యేలు సుముఖంగా ఉండగా, మరికొందరు అయిష్టంగా ఉన్నారు. తాజా రాజకీయ స్థితిగతులను మరికొంతమంది ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధిష్టానం ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదు.
ఆ ఆరోపణలు సరికాదు
తమ పార్టీ ఎమ్మెల్యేలను వారివైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకులు యత్నిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేసిన ఆరోపణలను సతీష్ ఖండించారు. ఆప్ లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో తాను సంప్రదింపులు జరపలేదన్నారు. ఢిల్లీలో తాము కనుక అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను 30 శాతం మేర తగ్గిస్తామన్నారు. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఇదే ఉందన్నారు. మేనిఫెస్టో తమకు బైబిల్‌తో సమానమన్నారు. అందులో తాము ఏదిచెబితే అది చేయాల్సిందేనన్నారు. కాగా 2014-15కు సంబంధించి చార్జీల వివరాలను ప్రకటించేందుకు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్‌సీ) అన్నివిధాలుగా సన్నద్ధమైంది. పెరిగే అవకాశాలున్నాయంటూ సంబంధిత అధికారులు ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ విషయమై మీడియా సతీష్‌ను ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం లేనికారణంగా స్థానికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అందువల్ల ఎన్నికలు జరిగితేనే బాగుంటుందన్నారు.
ఢిల్లీకి స్వతంత్ర రాష్ట్ర ప్రతిపత్తి కోసం కృషి చేస్తానన్నారు. ఈ దిశగానే ముందుకు సాగుతున్నా మన్నారు. ఇదిలాఉంచితే కొద్దినెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీకి స్వయంప్రతిపత్తి కల్పిస్తామంటూ బీజేపీ నాయకులు హామీ ఇచ్చిన సంగతి విదితమే. మరోవైపు రాష్ర్టంలో తాజా రాజకీయ స్థితిగతులపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక పంపించే అవకాశముంది. దీని ఆధారంగా చేసుకుని రాష్ర్టపతి పాలనను కొనసాగించాలా లేక ఎన్నికలు నిర్వహించాలా అనే విషయమై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.
త్వరలో నిర్ణయం తీసుకుంటాం
Published Sun, Jul 13 2014 11:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement