రోడ్డుపై చెత్త వేసి మరీ ‘స్వచ్ఛభారత్’!
ఢిల్లీలో బీజేపీ నేతల నిర్వాకం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో నవ్వులపాలైంది. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ సమక్షంలో జరిగిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం ఇందుకు వేదికైంది. బుధవారం ఢిల్లీలో శుభ్రంగా ఉన్న లోధీ రోడ్డులోని ఇండియా ఇస్లామిక్ సెంటర్ వద్ద పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు చెత్త, వ్యర్థాలను తెచ్చి పడేశారు. ఆ ప్రాంతమంతా పరుచుకునేలా కాళ్లతో చెత్తను నెట్టేశారు.
అనంతరం సెంటర్ నుంచి బయటికొచ్చిన బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్(కాషాయం రంగు కుర్తా ధరించిన వ్యక్తి), మాజీ ‘ఆప్’ నాయకురాలు షాజియా ఇల్మీ, ఇంకొందరు నేతలు ఎంచక్కా చీపుర్లు చేతబట్టి అదే స్థలాన్ని ఊడ్చేశారు. అపరిశుభ్ర ప్రాంతాలను గాలికి వదిలేసి శుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ నేతలు ‘స్వచ్ఛభారత్’ నిర్వహించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్వచ్ఛభారత్ పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ చిత్తశుద్ధి, ద్వంద్వ వైఖరి ఈ ఘటనతో తేటతెల్లమైందని కాంగ్రెస్, ఆప్ పార్టీలు దుమ్మెత్తిపోశాయి. చెత్త వేసిన సంగతే తనకు తెలియదని ఉపాధ్యాయ్ వివరణ ఇచ్చారు.