వెనక్కితగ్గిన డీఈఆర్‌సీ
విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం ఉపసంహరణ
సాక్షి, న్యూఢిల్లీ : విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్‌సీ) శుక్రవారం ఉపసంహరించుకుంది. విద్యుత్ చార్జీలను ఏడు శాతం మేర పెంచుతున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి విదితమే. అయితే వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెనక్కితగ్గింది. ఆయా విద్యుత్ సంస్థల డిమాండ్ మేరకు ఏడు శాతం సర్‌చార్జీ విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
నగర పరిధిలోని ఆయా విద్యుత్ సంస్థల డిమాండ్ మేరకు బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ వినియోగదారులకు ఏడు శాతం, బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ వినియోగదారులకు 4.5 శాతం, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వినియోగదారులకు 2.5 శాతం చార్జీ పెంపు ఉంటుందని డీఈఆర్‌సీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన చార్జీలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే తన నిర్ణయాన్నిఉపసంహరించుకుంటునట్లు డీఈఆర్‌సీ శుక్రవారం ఉదయం పేర్కొంది.
ఎస్‌ఎంఎస్ వచ్చింది : ఎల్జీ
విద్యుత్ చార్జీల ఉపసంహరణ గురించి తనకు తెలియదని లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తెలిపారు. అయితే చార్జీలను ఉపసంహరించిట్లు తన కార్యాలయానికి ఎస్‌ఎంఎస్ వచ్చిందన్నారు. సర్‌చార్జ్ విధించడం కోసం జరిపిన లెక్కల్లో పొరపాటు దొర్లి ఉంటుందని, అందువల్లనే చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించి ఉండొచ్చని ఆయన అన్నారు. డీఈఆర్‌సీ స్వతంత్ర సంస్థ అని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన వివరించారు.
అటువంటిదేమీ లేదు : డీఈఆర్‌సీ
రాజకీయ పార్టీల ఒత్తిళ్ల కారణంగా విద్యుత్తు చార్జీల పెంపు ప్రకటనను ఉపసంహరించుకోలేదని డీ ఈఆర్‌సీ చైర్మన్ పి.డి. సుధాకర్ తెలిపారు. విద్యుత్ ఉత్పాదనకయ్యే వ్యయానికి సంబంధించి పూర్తి వివరాలను అందజేయాల్సిందిగా గ్యాస్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను కోరామని అన్నారు. ఈ సమాచారం లభించిన వెంటనే అన్ని వివ రాలను పరిశీలించి రెండు మూడు వారాల్లో తాజా నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
కాంగ్రెస్, ఆప్ విమర్శనాస్త్రాలు
డీఈఆర్‌సీ నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించాయి. తక్షణమే ఉపసంహరించుకోవాలని మాండ్ చేశాయి. డీఈఆర్‌సీ... డిస్కంలు ఆడించినట్లు ఆడుతోందంటూ ఆప్ విమర్శించింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ వద్ద ఈ విషయాన్ని లేవనెత్తుతామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ పేర్కొన్నారు.