రాజకీయ పార్టీలు తప్పించుకోవాలని ప్రయత్నించినకొద్దీ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) వాటిని వెన్నాడుతోంది. ‘మిమ్మల్ని ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు తీసుకు రాకూడదో ఆరు వారాల్లో చెప్పాల’ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) రెండేళ్లక్రితం తీర్పునిచ్చినప్పుడు చాలా విలువైన మాటలు చెప్పింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. అదే సంగతిని మరోసారి మొన్న మార్చిలో చెప్పింది. కానీ రాజకీయ పార్టీల్లో కదలిక రాలేదు. అవి ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నాయో ఇంతవరకూ ఎవరికీ తెలియదు. ప్రతి అంశంలోనూ హడావుడి చేసే పార్టీలు ఇలా మౌనంగా ఉండటంలోని ఆంతర్యమేమిటో అర్ధంకాలేదు. పర్యవసానంగా ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకెళ్లింది.
ప్రజాస్వామ్యంలో జనం ఆకాంక్షలకు స్వరాన్నిచ్చి వాటికోసం కృషి చే సేవి రాజకీయ పార్టీలే. ఈ క్రమంలో ఆయా పార్టీల సిద్ధాంతాలు, ఆచరణ...వాటి విషయమై సాగే చర్చ, స్పర్థ వంటివి ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేస్తాయి. దాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయి. కొత్త ఆలోచనలకూ, పరిష్కారాలకూ దోవ కల్పిస్తాయి. అయితే ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేసే పార్టీలు తమ సంస్థాగత విషయాల్లో గోప్యత పాటిస్తున్నాయి. పార్టీని నడిపించడానికి అవసరమైన నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో...వాటిని ఎలా ఖర్చు చేస్తున్నారో చెప్పడానికి నిరాకరిస్తున్నాయి. పార్టీలనేవి వాటి ఆచరణరీత్యా చూసినా, స్వభావ రీత్యా చూసినా ప్రజా సంస్థలుగా పరిగణనలోకి వస్తాయి. ఆ పార్టీల నడత పారదర్శ కంగా ఉంటే అది ఆ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంపొందింపజేస్తుంది. అంతిమంగా అది ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టికి ఉపయోగపడుతుంది. కానీ బీజేపీ, కాంగ్రెస్ మొదలుకొని ప్రధాన రాజకీయ పక్షాలేవీ ఈ విషయంలో కలిసిరావడంలేదు. సీఐసీ ఇచ్చిన ఆదేశాల్లోని స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలేదు.
ఇటీవలికాలంలో రాజకీయ పార్టీల తీరుతెన్నులు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయాల్లోకి వద్దామని ఉత్సాహపడేవారిని నీరసింపజేస్తున్నాయి. పార్టీలు కూడా ప్రజా సంస్థల నిర్వచనంలోకొస్తాయని చెబుతూ ఇచ్చిన ఆదేశాల్లో సీఐసీ అందుకు కారణాలను కూడా చెప్పింది. రాజకీయ పార్టీలు ప్రభుత్వాలనుంచి ఉచితంగా లేదా సబ్సిడీ రేట్లకు స్థలాలు పొందడం దగ్గరనుంచి అనేక రాయితీలను, మినహాయింపు లను స్వీకరిస్తాయి. ఇవన్నీ ప్రజలకు సంబంధించినవే. ఇన్ని ఉపయోగించుకుంటూ కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండటానికీ, పారదర్శకంగా వ్యవహరించడానికీ నిరాకరించడం ఏమేరకు సహేతుకమో పార్టీలే చెప్పాలి.
మన దేశంలో రాజకీయ పక్షాలకు నిధులెలా వస్తాయన్నది రహస్యమేమీ కాదు. వాటికి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు కోట్లాది రూపాయలు అందజేస్తాయి. వ్యాపారవేత్తలైనా, పారిశ్రామికవేత్తలైనా ఇటీవలికాలంలో విరాళాలిచ్చి మాత్రమే ఊరుకోవడంలేదు. తాము కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజా ప్రతినిధులవుతు న్నారు. మంత్రులవుతున్నారు. రాజకీయాలు ఎవరికీ అస్పృశ్యమైనవి కాదు గనుక వారు రావడంలో తప్పేమీ లేదు. అయితే అలా రావడం కోసం విచ్చలవిడిగా వెదజల్లే డబ్బు దేశ ఆర్థిక వ్యవస్థనే తలకిందులు చేస్తున్నది. నిజంగా ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చేవారికి రాజకీయాల్లో స్థానం లేకుండాపోతున్నది.
ఇప్పుడు సుప్రీంకోర్టులో రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని పిటిషన్ దాఖలు చేసిన ప్రజాస్వామ్య సంస్కరణల సంఘమే... నిరుడు జరిగిన ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల జమాఖర్చుల వివరాలను వెల్లడించింది. ఆ వివరాలు దేశ పౌరులకు దిగ్భ్రమకలిగించాయి. బీజేపీకి అత్యధికంగా రూ. 588.45 కోట్లు వస్తే ఆ పార్టీ రూ. 712.48 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్‌కు రూ. 350.39 కోట్లు రాగా... 486.21 కోట్లు ఖర్చుచేసింది. ఈ లెక్కల్లోని నిజానిజాల సంగతలా ఉంచి రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎంతగా పెరిగిపోయిందో అర్ధం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. వాస్తవానికి పార్టీలన్నీ తమకొచ్చే విరాళాల వివరాలను 24-ఏ పత్రంలో పొందుపరిచి ఎన్నికల సంఘానికి ఇవ్వాలన్న నిబంధన ఉంది. దాని ప్రకారం రూ. 20,000కు పైబడిన విరాళాలను ప్రతి రాజకీయ పక్షమూ చూపాల్సి ఉంటుంది.
అయితే, ఈ నిబంధనను సాకుగా తీసుకుని పార్టీలు సంపూర్ణ వివరాలు ఇవ్వడంలేదు. తమకు అందే విరాళాల్లో రూ. 20,000కు మించినవి పది శాతం ఉన్నాయని ఒక పార్టీ...15 శాతం ఉన్నాయని మరో పార్టీ కాకిలెక్కలు చెప్పి చేతులు దులుపుకుంటున్నాయి. ‘చిల్లర విరాళాల’ ముసుగులో కోట్లాది రూపాయల విరాళా లను దాచిపెడుతున్నాయి. ఇలా వచ్చే విరాళాలను ఎన్నికల సమయంలో విచ్చల విడిగా వెదజల్లి తమ అభ్యర్థులను గెలిపించుకుంటున్నాయి. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మూడురోజులక్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బలం లేకపోయినా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి ఇలా డబ్బులు వెదజల్లడమేనన్న ఆరోపణలొచ్చాయి.
చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల ఆడియో, వీడియో టేపుల వ్యవహారం మన రాజకీయాలు ఎంత భ్రష్టుపట్టిపోయాయో వెల్లడించాయి. నానాటికీ దిగజారుతున్న ఇలాంటి పరిస్థితులను చూసే మొన్న మార్చిలో సమర్పించిన 225వ నివేదికలో లా కమిషన్ ఎన్నికల సంస్కరణలకు గట్టిగా సిఫార్సుచేసింది. పార్టీలకు రూ. 20,000 లోపు చొప్పున వచ్చే విరాళాలు... మొత్తం విరాళాల్లో 20 శాతం మించినా... లేదా వాటి విలువ రూ. 20 కోట్లు మించినా అలాంటి విరాళాలిచ్చినవారి పాన్ కార్డు వివరాలతోసహా అన్నిటినీ వెల్లడించేలా నిబంధన విధించాలని సూచించింది. నిర్ణీత మొత్తం రుసుముగా చెల్లించేవారికి విరాళాల వివరాలు అందజేసే ఏర్పాటుండాలని అభిప్రాయపడింది.
అనుమతిలేని దాతలనుంచి విరాళాలు పొందే పార్టీలకు అవి స్వీకరించిన విరాళానికి అయిదు రెట్ల మొత్తాన్ని పెనాల్టీగా విధించాలని పేర్కొంది. సీఐసీ చెప్పిన రెండేళ్ల తర్వాత కూడా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న తమ వైఖరివల్లా, సహాయ నిరాకరణవల్లా ప్రజాస్వామ్యానికి ఇప్పటికే ఎంతో అపచారం జరిగిందని పార్టీలు గ్రహించాలి. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన తాము ఎన్నికల సంస్కరణలను అడ్డుకోవడంద్వారా నల్లడబ్బు పెచ్చరిల్లడానికి కారకులమవుతున్నా మని గుర్తించాలి. కట్టుదప్పిన ప్రవర్తన అరాచకానికీ, అనైతికతకూ... అంతిమంగా ప్రజాస్వామ్య క్షీణతకూ మాత్రమే దారితీస్తుందని గమనించాలి.
పార్టీలూ... పారదర్శకత
Published Thu, Jul 9 2015 1:04 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement