కేంద్రం వాదనకు పార్లమెంటరీ కమిటీ సమర్థన
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ప్రజాసంస్థలు కావని, సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి రావని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలను పార్లమెంటరీ కమిటీ సమర్థించింది. ఆర్టీఐ చట్టం పరిధి నుంచి రాజకీయ పార్టీలను తప్పించడానికి, అలాగే పారదర్శకత నిబంధనల కిందకు వస్తాయన్న కేంద్ర సమాచార కమిషనర్ (సీఐసీ) ఆదేశాలను తిరస్కరించడానికి ఉద్దేశించిన సవరణ బిల్లుకు మద్దతు తెలిపింది. ఈ మేరకు కమిటీ నివేదికను న్యాయం, సిబ్బంది విభాగ స్థాయీసంఘం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ‘‘పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం ద్వారా కానీ లేదా రాజ్యాంగం చేత లేదా రాజ్యాంగం నిబంధనల కింద కానీ ఏర్పాటుకాని రాజకీయ పార్టీలు ప్రజాసంస్థల కిందకు రావన్న ప్రభుత్వ వాదనతో కమిటీ ఏకీభవిస్తుంద’’ని కమిటీ చైర్మన్ శాంతారామ్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 కింద రిజిస్ట్రేషన్ లేదా గుర్తింపు పొందినవని మాత్రమేనని వెల్లడించారు. అలాగే ఆదాయపన్ను చట్టం-1961 కింద రాజకీయ పార్టీలు, వాటి అభ్యర్థుల ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలన్న నిబంధనపై ఆయన స్పందిస్తూ, ‘‘రాజకీయ పార్టీలను ఆర్టీఐ చట్టం కింద ప్రజాసంస్థలుగా ప్రకటిస్తే వాటి సున్నితమైన అంతర్గత పనివిధానానికి ఆటంకం కలుగుతుంది. రాజకీయ పార్టీల విధులకు భంగం కలిగించేందుకు వాటి ప్రత్యర్థులు దుర్బుద్ధితో ఆర్టీఐ చట్టంలోని నిబంధనలను దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ ఈ ఆరు రాజకీయ పార్టీలను ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన సీఐసీ... అవి ప్రజా సమాచార అధికారులను ఆరు వారాల్లోగా నియమించుకోవాలని ఈ ఏడాది జూన్ 3న ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏదైనా సంఘం లేదా వ్యక్తుల సంస్థ ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 కింద నమోదైనా లేదా గుర్తింపు పొందినా దాన్ని ప్రజాసంస్థగా పరిగణించకూడదంటూ ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 2(హెచ్)లో వివరణను చేర్చుతూ ప్రభుత్వం సవరణ బిల్లును ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై నియమితులైన ఎంపీల కమిటీ... కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ నివేదిక ఇచ్చింది.
పార్టీలు ప్రజాసంస్థలు కాదు
Published Wed, Dec 18 2013 3:09 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement