విషయం అడిగితే విషం చిమ్మడమా?
విశ్లేషణ
నెలరోజుల్లో జవాబివ్వండి అని చట్టం ద్వారా ఆదేశించినా వినరు. పోనీ మొదటి అప్పీలు అధికారిగా ఉన్న తమ సీనియర్ అధికారి ఆదేశించినా పాటించకపోతే ఏమిటన్నట్లు? చెత్త ప్రశ్నలు అడుగుతున్నా రంటూ అడిగే వారిని నిందిం చడం అలవాటయింది. కాని చెత్త జవాబులు ఇచ్చే ప్రభుత్వాధికారుల సంగతేమిటి? సమాచార హక్కును దుర్వినియోగం చేస్తున్న మాట నిజమే కానీ జనం కన్నా ఎక్కువగా అధికారులు కూడా ఈ చట్టం ఇచ్చిన అధికారాన్ని సరిగ్గా వినియోగించ కుండా, అడిగిన వాడిని ఏడిపించేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. అడగడం హక్కైతే చెప్పడం బాధ్యత. సమాధాన సమాచారాలు ఇవ్వడం జరగకపోతే సమా చార హక్కు చట్టం దుర్వినియోగమైనట్టే. అడిగినవన్నీ ఇవ్వాల్సిందే అని ఎవ్వరూ అనడం లేదు.
అమ్మ కూడా అడిగిందంతా పెట్టదు. కానీ ఎందుకు ఇవ్వరో చెప్పడం అనే బాధ్యతను నిర్వర్తించకుండా వదిలేస్తే వారికేమిటి శిక్ష? విషయం చెప్పమని అడిగితే విషం చిమ్మే పరిస్థితు లను ఎందుకు కల్పిస్తారు? ఎవరు బాధ్యులు? అడిగిన సమాచారం ఇవ్వకపోవడమే కాదు, ఇవ్వకుండా ఉండేం దుకు ప్రజలసొమ్మును విరివిగా ఖర్చు చేయడం దుర్మార్గం. ఏ స్పందనా లేకుండా సమాచార అభ్యర్థనను వదిలేసే ప్రభుత్వ సంస్థకు మొదటి అప్పీలు ఆదేశం పాటించడం తప్ప మరో బాధ్యత లేదు. ఆ పనిచేయక పోగా మొదటి అప్పీలులో, రెండో అప్పీలులో కూడా లాయర్లను నియమించి జనం డబ్బు తగలేసి జవాబు ఇవ్వరేమిటి?
జాతీయ పర్యావరణ న్యాయస్థానం (ఎన్‌జీటీ - నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)కి వచ్చిన కొన్ని సమాచార దరఖాస్తుల ప్రతులు, వాటిపై చర్యల దస్త్రం, తొలి అప్పీళ్లు, మూడో వ్యక్తికి ఇచ్చిన నోటీసుల కాపీలు ఇవ్వా లని ఆర్‌కె జైన్ కోరారు. నెలరోజుల్లో ఇవ్వలేదు. మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. సమాధానం లేదు. ఈ నిరాకరణ వెనుక దురుద్దేశముందని జైన్ ఆరోపించారు. జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని కారణ వివరణ లేఖ జారీ చేశారు. దానికీ జవాబు లేదు. నోటీసు విచారణకు నియమితమైన తేదీ నాడు కూడా రాలేదు. హఠాత్తుగా ఒక లాయర్ గారిని కమిషన్ వద్దకు వెళ్లమని చెప్పారు కానీ ఎందుకు వెళ్లాలో ఏం చేయాలో చెప్పలేదు. సి.పి.ఐ.ఒ. (కేంద్ర ప్రజా సమాచార అధికారి) వారం పైగా సెలవులో ఉంటే ఆ బాధ్యతలను నిర్వహించడానికి మరొకరిని నియమించ కపోవడం మంచి పాలనా?
అధికారి ఇచ్చిన వివరణ తప్పుల తడక అని జైన్ వాదించారు. 20 పేజీల సమాచారం ఇవ్వడానికి తనను 40 రూపాయలు అడిగారని, సమాచారం ఇమ్మని ప్రథమ అప్పీలు అధికారి ఆదేశించినా వేల రూపా యలు ఖర్చు చేస్తూ మొదటి రెండో అప్పీళ్లలో లాయర్లను నియ మిస్తూ సమాచారం ఇవ్వకుండా దాట వేస్తున్నారని జైన్ ఆరోపించారు. ఎన్‌జీటీ ఒక్కొక్క లాయర్‌కు 31 వేల రూపాయల భత్యం, 700 రూపా యల రవాణా ఖర్చు నెలకు ఇస్తూ ప్రతి లాయర్‌కు మొదటి అప్పీలుకు 11 వేలు, రెండో అప్పీలుకు 21 వేలు ఇవ్వాలని ప్రతిపాదిం చిందని వివరించే నోట్‌ను జైన్ మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సంపాదించారు. మొదటి అప్పీలులోనూ, రెండో అప్పీలులోనూ లాయర్‌ను నియమించి తనకు సమాచారం ఇవ్వ కుండా పోరాడుతున్నారని విమర్శించారు. సెక్షన్ 20 ప్రకారం సమంజసమైన కారణం లేకుండా సమాచారం ఇవ్వకపోతే జరిమానా విధించాల్సి ఉంటుంది. కానీ మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించనందుకు మరే కారణమూ అవసరం లేకుండానే జరిమానా విధించే వీలుంది. ఆదేశించిన అధికారి సి.పి.ఐ.ఓ. కంటే పై అధికారి. ఆయనకు ఎక్కువ అనుభవం, శాఖాపరమైన పరిచయం ఉంటుంది. ఆయన ఉత్తర్వును పాటించకపోవడం క్రమశిక్షణ అనిపించు కోదు. ఒకవేళ పై అధికారి ఉత్తర్వులో ఏదైనా లోప ముంటే సీపీఐఓ కూడా అప్పీలుకు వెళ్లవచ్చు. లేని పక్షంలో ఆ ఆదేశాన్ని పాటించడం తప్ప మరో మార్గం లేదు. కాని ఆ ఆదేశాల పాలనకోసం పౌరుడు రెండో అప్పీలుకు వెళ్లే పరిస్థితి కల్పించడం అన్యాయం, అస మంజసం. దాన్ని చట్టం ఒప్పుకోదు.
ఈ కేసులో మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించకపోవడం, వారికి ఇస్తానన్న సమాచారాన్ని అంగీకరించిన తేదీలోగా ఇవ్వకపోవడం, ఆ తరువాత కూడా ఇవ్వకపోవడం వల్ల ప్రజా సమాచార అధికా రిపైన 25 వేల రూపాయల జరిమానా విధించక తప్ప దని కమిషన్ నిర్ణయించింది. చట్ట ప్రకారం ఇవ్వవలసిన సమాచారాన్ని ఇవ్వ కుండా ఏవేవో కుంటిసాకులు చూపుతూ పౌరుడిని అప్పీళ్ల చుట్టూ తిప్పడం సమాచార చట్టాన్ని భంగ పరచడమే అవుతుంది. రెండు అప్పీళ్లలో లాయర్లు హాజరయ్యారు కనుక ఎన్‌జీటీ కనీసం 32 వేల రూపాయలు ఖర్చు చేసినట్టే భావించాలి.
ఇటువంటి వృథా ఖర్చులను ఎందుకు పెడుతున్నారు? ఒక పౌరు డికి చట్ట ప్రకారం ఇవ్వవలసిన సమాచారం ఇవ్వ కుండా ఉండేందుకు ప్రజల ధనాన్ని ఈ విధంగా వెచ్చించవచ్చా? ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో పరిశీలించి, ఆ అధికారి బాధ్యుడైతే, అతని నుంచి ఈ కేసుల మీద ఖర్చు చేసిన మొత్తం సొమ్మును ఎన్‌జీటీ వద్ద డిపాజిట్ చేయించాలని కమిషన్ సూచిం చింది. ఎన్‌జీటీ అధ్యక్షులు మాజీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి కనుక ఈ అన్యాయ ఖర్చులు నివారించేందుకు ఈ సమస్యను వారి ముందుంచాలని కమిషన్ సూచించింది.
(ఇఐఇ/అ/ఇ/2014/000461 జైన్ వర్సెస్ ఎన్‌జీటీ కేసులో తీర్పు ఆధారంగా)
మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com