మరో ఈపీఎఫ్ స్కాం!
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: ఏపీ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట డివిజన్ కార్యాలయంలో మరో ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) కుంభకోణం వెలుగుచూసింది. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన దొడ్డా రమేష్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు ‘న్యూస్‌లైన్’కు అందాయి. వాటిలో పేర్కొన్న ప్రకారం డివిజన్ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 20 మంది కార్మికులకు ఈపీఎఫ్ చెల్లించడం లేదని డివిజనల్ ఆఫీసర్ రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు 2011 నుంచి ఇప్పటి వరకు అశ్వారావుపేటకు చెందిన బి. పిచ్చయ్య అనే లేబర్ కాంట్రాక్టర్ కార్యాలయానికి కార్మికులను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
- కాంట్రాక్టు ఒప్పంద పత్రాలను అడిగినప్పటికీ కార్యాలయ అధికారులు ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. కాంట్రాక్టు నిబంధనలు, కార్మికుల పనివేళలు, వేతనాల ఒప్పందం వివరాలను బయటకు వెల్లడించటంలేదు.
వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో ఈ-ప్రొక్యూర్‌మెంట్, ఆన్‌లైన్ టెండర్ విధానంలో కాంట్రాక్టుల కేటాయింపులు జరుగుతున్నా.. ఆయిల్‌ఫెడ్‌లో మాత్రం నామినేషన్ విధానంపైనే నాలుగేళ్లుగా ఒకే కాంట్రాక్టర్‌కు ఫ్యాక్టరీని కట్టబెడుతున్నారు. కాంట్రాక్టు కేటాయింపు నిబంధనలకూ నీళ్లొదిలేశారు. ఎల్ 1 (తక్కువ ధర కోడ్ చేసిన మొదటి పాధాన్యత) బిడ్డర్ అయిన డి.సుబ్బారావును మినహాయించి ఎల్ 2 (తక్కువ ధర కోడ్ చేసిన రెండో ప్రాధాన్యత) బిడ్డర్ అయిన బి. పిచ్చయ్యకే కాంట్రాక్టు కట్టబెట్టారు. ఎక్కువ ధర కోడ్ చేసిన ఎల్1 కు ఎందుకు కాంట్రాక్టు కేటాయించలేదో వెల్లడించలేదు.
ప్రతి లేబర్ కాంట్రాక్టుకూ ఏడాది లేదా రెండేళ్లు పరిమితి ఉంటుంది. కానీ ఈ కాంట్రాక్టుకు మాత్రం పరిమితి లేదు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పిచ్చయ్య కాంట్రాక్టు కొనసాగుతూనే ఉంటుంది.
కాంట్రాక్టర్ కేవలం సర్వీస్ టాక్స్ మాత్రమే చెల్లిస్తూ 20మంది లోపు ఉన్న కాంట్రాక్టు కార్మికులకు పీఎఫ్ చెల్లించడం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఓ బిల్లు చెల్లించిన తర్వాత మరో బిల్లు చె ల్లించే ముందు గత చెల్లింపులో ఈపీఎఫ్ చెల్లింపుల వివరాలను పరిశీలించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. కానీ ఇక్కడ అలాంటివేవీ జరగడం లేదు.
అశ్వారావుపేట డివిజనల్ కార్యాలయం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ పనిచేసిన కొందరు అవినీతి అధికారులతో కాంట్రాక్టర్ కుమారుడు మధుకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు దక్కుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈపీఎఫ్‌లు చెల్లించకున్నా యధాతథంగా బిల్లులు డ్రా అవుతున్నాయని అంటున్నారు. ఈ విషయమై ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట డివిజనల్ ఆఫీసర్ రమేష్‌కుమార్‌రెడ్డిని ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. కాంట్రాక్టర్ ఈపీఎఫ్‌లు చెల్లించినట్లు కార్యాలయానికి ఇప్పటి వరకు తెలియజేయలేదన్నారు. ఈపీఎఫ్‌కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు.