సమాచార హక్కు చట్టం ఉపయోగించినందుకు..
నందిపేట(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం జీజీ నడ్కుడలో రాజుగౌడ్ అనే గీత కార్మికుడి కుటుంబాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సాంఘిక బహిష్కరణ చేశారు. గ్రామంలో 8 నెలల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామంలో గృహావసర, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఎన్ని ఉన్నాయో తెలపాలంటూ రాజు సమాచార హక్కు చట్టం కింద విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో అధికారులు గ్రామాభివృద్ధి కమిటీకి తెలిపారు.
తమకు సమాచారం ఇవ్వకుండా ట్రాన్స్‌కోకు దరఖాస్తు చేసుకోవడంపై ఆగ్రహం చెందిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రూ. 60 వేల జరిమానా చెల్లించాలని, లేకపోతే గ్రామం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. విద్యుత్ శాఖతో గ్రామానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోతే డబ్బులు తిరిగి ఇవ్వడా నికి అంగీకరించారు. దీంతో రాజుగౌడ్ జరిమానా చెల్లిం చాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల ఎన్నికైన గ్రామాభివృద్ధి నూతన కమిటీ సభ్యులను రాజుగౌడ్ కోరగా వారు తిరస్కరించారు. దీంతో అతడు పోలీసు లను ఆశ్రయించాడు. ఆగ్రహించిన గ్రామాభివృద్ధి కమి టీ సభ్యులు ఐదు రోజుల క్రితం రాజుగౌడ్ కుటుంబానికి మరోసారి సాంఘిక బహిష్కరణ శిక్ష విధించారు. అతడి కుటుంబంతో మాట్లాడితే రూ. 3 వేల జరిమానా విధి స్తామని గ్రామస్తులను హెచ్చరించారు.