1978లో బీఏ డిగ్రీ పాసైన విద్యార్థులందరి వివరాలను చూసుకోడానికి సమాచార హక్కు దరఖాస్తుదారుడిని అనుమతించాలని
న్యూఢిల్లీ: 1978లో బీఏ డిగ్రీ పాసైన విద్యార్థులందరి వివరాలను చూసుకోడానికి సమాచార హక్కు దరఖాస్తుదారుడిని అనుమతించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)ను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ప్రధాని మోదీ 1978లో డిగ్రీ పాసయ్యారని డీయూ గతంలో పేర్కొనడం తెలిసిందే. 1978లో డీయూలో బీఏ పరీక్షలు ఎంతమంది రాశారు, ఎంత మంది పాసయ్యారు తెలపాల్సిందిగా నీరజ్ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు.
ఆ వివరాలన్నీ వ్యక్తిగత సమాచారం కిందకు వస్తాయంటూ విశ్వవిద్యాలయ కేంద్ర ప్రజా సమాచార అధికారి మీనాక్షి సహాయ్ వాటిని ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ వివరాలను తనిఖీ చేసుకోడానికి అనుమతించడంతోపాటు ఒక కాపీని ఉచితంగా దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సిందేనని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు తాజాగా మీనాక్షి సహాయ్‌ని ఆదేశించారు. ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీకి చెందిన న్యాయవాది మహమ్మద్ ఇర్సద్ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ మీనాక్షికి రూ.25,000 జరిమానాను కూడా మాడభూషి విధించారు.