‘భవన ప్లాన్’ ప్రైజ్డ్ మెటీరియల్ కాదు | Not prized material on building community planning | Sakshi
Sakshi News home page

‘భవన ప్లాన్’ ప్రైజ్డ్ మెటీరియల్ కాదు

Published Fri, Jan 9 2015 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

‘భవన ప్లాన్’ ప్రైజ్డ్ మెటీరియల్ కాదు

‘భవన ప్లాన్’ ప్రైజ్డ్ మెటీరియల్ కాదు

* విక్రయ నిమిత్తం దానికి ధర నిర్ణయించలేదని హైకోర్టు స్పష్టీకరణ
* రూ.44,787 చెల్లిస్తేనే ప్లాన్ కాపీ ఇస్తామన్న జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులు రద్దు


సాక్షి, హైదరాబాద్: భవన సముదాయ ప్రణాళిక (ప్లాన్)ను సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టంలో నిర్దేశించిన ‘ప్రైజ్డ్ మెటీరియల్’గా పరిగణించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్లాన్‌కు బహిరంగ మార్కెట్‌లో విక్రయ నిమిత్తం ప్రభుత్వం దానికి అమ్మకపు ధర నిర్ణయించలేదు కాబట్టి, దానిని ప్రైజ్డ్ మెటీరియల్‌గా పరిగణించరాదని హైకోర్టు స్పష్టం చేసింది.
 
 కాబట్టి సమాచార హక్కు చట్టం కింద భవన ప్లాన్‌ను అందించాలని ఎవరైనా కోరినప్పుడు, దానికి ప్రైజ్డ్  మెటీరియల్ కింద కాకుండా ఇతర మెటీరియల్‌ను అందించేందుకు ఎంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారో అంతే మొత్తాన్ని (పేజీకి రూ.2) మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ముద్రిత సమాచారం, మ్యాపులు, ప్లాన్లు, ఫ్లాపీలు, సీడీలు, శ్యాంపిల్స్, మోడల్స్, ఇతర ఏ రూపంలోనైనా ఉన్న మెటీరియల్‌కు విక్రయ నిమిత్తం ధర నిర్ణయించి ఉంటే వాటిని మాత్రమే ఆర్టీఐ ప్రకారం ప్రైజ్డ్ మెటీరియల్‌గా భావించాలని తేల్చిచెప్పింది. ప్లాన్‌ను ప్రైజ్డ్ మెటీరియల్‌గా నిర్ణయించి, దానికి రూ.44,787 చెల్లించాలన్న జీహెచ్‌ఎంసీ సమాచార అధికారి ఉత్తర్వులను, వాటిని సమర్థిస్తూ సమాచార కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపడుతూ, వాటిని రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పునిచ్చారు.
 
 స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఓ.ఎం.దేబరా అమీర్‌పేటలోని ఓ ఆస్తికి సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన ప్రణాళిక (శాంక్షన్డ్ ప్లాన్)ను అందచేయాలంటూ ఆర్టీఐ కింద 2007 జూన్ 6న జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. ప్లాన్ కాపీని పొందాలంటే రూ.44,787 చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఆదేశాలను దేబరా సమాచార కమిషన్ ముందు సవాలు చేశారు. కమిషన్ సైతం జీహెచ్‌ఎంసీనే సమర్థించింది. ఈ ఉత్తర్వులపై దేబరా 2008లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పు వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement