‘సమాచారం’ కోసం ఉగ్రవాది పోరాటం!
హైదరాబాద్: కర్ణాటకలోని ఉల్లాల్ పోలీ సులు తనపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం అందించలేదంటూ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి పోరాటం ప్రారంభిం చాడు. ప్రస్తుతం ముంబైలోని ఆథర్ రోడ్ జైల్లో ఉన్న ఇతడు బెంగళూరులో ఉన్న కర్ణాటక రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ ల్లో చోటు చేసుకున్న పేలుళ్ల కేసులో ఇతడు నిం దితుడిగా ఉన్నాడు.
మహారాష్ట్రలోని పుణేకు చెందిన అక్బర్ వృత్తిరీత్యా కంప్యూటర్ మెకానిక్. మంగుళూరు నుంచి పుణే మీదుగా అహ్మదాబాద్, ముంబై తదితర ప్రాంతాలకు పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు 2008లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇతడిని అరెస్టు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంగుళూరులో ఉన్న ఉల్లాల్ పోలీసుస్టేషన్‌లో ఇతడిపై ఓ కేసు నమోదు చేశా రు. దీనిపై పురోగతి లేకపోవడంతో గత ఏడాది ఫిబ్రవరి 28న సమాచార హక్కు చట్టం కింద కేసు వివరాలు కోరుతూ ఉల్లాల్ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం కింద తనపై ఉల్లాల్ పోలీసులు నమోదు చేసిన కేసు సమాచారం అందించాల్సిందిగా కోరాడు. దీనిపై 30 రోజుల్లో సమాచారం అం దించాలని పోలీసుల్ని కమిషన్ ఆదేశించింది.