సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పేలుళ్లు సృష్టిస్తూ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన యాసిన్ భత్కల్ కదలికలపై కేంద్ర నిఘా విభాగం (ఐబీ) ఆరు నెలలుగా నిఘా తీవ్రం చేసింది. ఉగ్రవాద కదలికలను గుర్తించేందు కు ఐబీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విభాగం ద్వారా ఈ సీక్రెట్ ఆపరేషన్ జరిగింది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల సమయంలో యాసిన్, తబ్రేజ్‌లు వినియోగించిన ఫోన్ నంబర్లను నిఘావర్గాలు గుర్తించాయి. దేశవ్యాప్తంగా పేలుళ్ల కోసం ఆజంగఢ్, దర్బాంగ్ మాడ్యూల్స్‌ను యాసిన్ వినియోగించుకున్నట్లు నిర్ధారించుకున్నారు. ఆ రెండు మాడ్యూల్స్‌లోని వ్యక్తులను నీడలా వెంటాడి యాసిన్ ఆచూకీపై కొంత సమాచారం రాబట్టారు. అతను పాక్, బంగ్లాదేశ్‌ల నుంచి ఇండో-నేపాక్ సరిహద్దుకు వచ్చివెళ్తున్నట్లు రూఢీ అయిన తరువాత సీక్రెట్ ఆపరేషన్‌ను వేగిరం చేశారు. తర్వాత ఎన్‌ఐఏ నుంచి కూడా కొంత సహకారం తీసుకున్నారు.
బుధవారం రాత్రి అరెస్టు చేసేవరకూ బీహార్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అరెస్టు సమయంలో మాత్రం ఆ రాష్ట్ర అదనపు డీజీ స్థాయి అధికారులు ఇద్దరికి మాత్రం విషయం తెలిపారు. అరెస్టు సమయంలో యాసిన్ పాక్ పాస్‌పోర్టు కలిగివున్నట్లు సమాచారం. తాను ఇంజనీర్‌నని, ఉగ్రవాదులతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని అరెస్టు తరువాత కూడా నమ్మబలికే ప్రయత్నం చేశాడు. ఇలా పలుమార్లు త్రుటిలో తప్పించుకున్న అనుభవం యాసిన్‌కు ఉంది. అయితే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఎన్‌ఐఏ అధికారుల ద్వారా పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్నారు. సుదీర్ఘ విచారణలో తాను యాసిన్ భత్కల్‌నేనని అతను అంగీకరించినట్లు తెలిసింది. యాసిన్ గుర్తింపును నిర్ధారించుకునేందుకు అతని డీఎన్‌ఏనూ పరీక్షించే అవకాశం ఉంది.
నా కుమారుడు నిరపరాధి: యాసిన్ తండ్రి
బెంగళూరు, న్యూస్‌లైన్: తన కుమారుడు యాసిన్ భత్కల్ నిరపరాధని, అతన్ని రక్షించుకోడానికి న్యాయ పోరాటం చేస్తానని అతని తండ్రి యాకుబ్ సిద్ది బాషా అన్నారు. ఆయన భత్కల్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు బూటకపు ఎన్‌కౌంటర్‌లో మరణించాడని భావించామని, అయితే బతికే ఉన్నాడని తెలిసి సంతోషిస్తున్నట్లు చెప్పారు.
యాసిన్ కస్టడీ కోరుతున్న పలు రాష్ట్రాలు
బెంగళూరు, న్యూస్‌లైన్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక పోలీసులు కూడా యాసిన్ భత్కల్ కస్టడీని కోరుతున్నారు. ఉగ్రవాదులతో చేతులు కలిపి కర్ణాటక సహా అనేక రాష్ట్రాలలో బాంబు పేలుళ్లకు కారణమైన యాసిన్ భత్కల్‌ను ఇక్కడకు తీసుకొచ్చి విచారించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తునకు కర్ణాటక పోలీసులు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. యాసిన్‌ను వీలైనంత త్వరగా బెంగళూరు తీసుకువస్తామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు.
పలు ఉగ్రవాద కేసులతో సంబంధమున్న యాసిన్‌ను కస్టడీకి కోరనున్నట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీకి సంబంధించిన పలు కేసుల్లో 2011లో ఢిల్లీ హైకోర్టు బయట జరిగిన పేలుళ్లు, 2008లో జరిగిన వరుస పేలుళ్లు కీలకమైనవని చెప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసుతో పాటు మరో 35 కేసుల్లో యాసిన్‌ను గుజరాత్ పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు పోలీసు జాయింట్ కమిషనర్ ఎ.కె.శర్మ చెప్పారు. మహారాష్ట్ర యాంటీ టైస్టు స్క్వాడ్ (ఏటీఎస్) యాసిన్ కస్టడీ కోరనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ చెప్పారు.
ఆరు నెలలుగా ఐబీ నిఘా
Published Fri, Aug 30 2013 4:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
Advertisement