Indian intelligence agencies
-
ఉర్దూస్తాన్, ఖలిస్తాన్..
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రత్యేక ఖలిస్తాన్ కోసం వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ పెద్ద ప్రణాళికలే రచించాడు. సంబంధిత వివరాలు ఉన్న భారత నిఘా వర్గాల నివేదిక ఈ విషయాలను వెల్లడిస్తోంది. ఆ నివేదికలోని వివరాలను ఓసారి గమనిస్తే ► మతాల ప్రాతిపదికన భారత్‌ను విడగొట్టాలి అనేది పన్నూ ప్రధాన ఎజెండా. ► ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్‌సహా పలు రాష్ట్రాల్లో పన్నూపై పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్న పన్నూపై భారత్‌లో చాలా రాష్ట్రాల్లో పదహారుకు పైగా కేసులు నమోదవడాన్ని బట్టి ఎస్ఎఫ్జే కార్యకలాపాలు ఇండియాలో ఎంతగా విస్తరించాయో అర్ధమవుతుంది. ► భారత భూభాగంలో ముస్లింల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటుచేయాలనేది పన్నూ ఆలోచన. దీనికి ‘ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దూస్తాన్’ అని పేరు కూడా ఖాయం చేసుకున్నాడు. ► దేశం నుంచి కశీ్మర్‌ను వేరుచేసేందుకు కశ్మీర్‌లోని ప్రజలను విప్లవకారులుగా తయారుచేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసం భారత్ పట్ల వ్యతిరేకభావన ఉన్న ప్రాంతాల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. కశీ్మర్లో అసంతృప్తితో రగిలిపోతున్న వారికి మరింత ఉద్రేకపరిచేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తాన్ జెండా ఎగరేస్తానని పన్నూ గతంలో ప్రకటించాడు కూడా. అసలు ఎవరీ పన్నూ ? దేశ విభజన కాలంలో 1947లో పన్నూ కుటుంబం పాకిస్తాన్ నుంచి అమృత్సర్ దగ్గర్లోని ఖాన్కోట్ గ్రామానికి వలసవచి్చంది. అమృత్‌సర్‌లో పుట్టిన పన్నూ.. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పుచ్చుకున్నాడు. అమెరికాలో ఉంటున్న పన్నూ అక్కడే అటారీ్నగా పనిచేస్తున్నాడు. భారత్‌లో ఖలిస్తాన్‌ను ఏర్పాటుకు కృషిచేస్తున్న ఎస్ఎఫ్జే సంస్థకు న్యాయ సలహాదారుగా ఉంటున్నట్లు పన్నూ చెప్పుకుంటున్నాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సాక్ష్యాధారాలతో గుర్తించిన కేంద్ర హోం శాఖ పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. పన్నూ ప్రేలాపణలు.. భారత్‌లో ఖలిస్తాన్ వేర్పాటువాదంలో నిమగ్నమైన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తుంటాడని పన్నూపై ఆరోపణలు ఉన్నాయి. తాను చెప్పిన పనులు చేసినా భారీ బహుమతులు ఇస్తానని గతంలో బహిరంగ ప్రకటనలుచేశాడు. ఢిల్లీలోని ప్రఖ్యా త ఇండియాగేట్ వద్ద ఖలిస్తాన్ జెండా ఎగరేస్తే 25 లక్షల డాలర్లు ఇస్తానని పిలుపునిచ్చాడు. 2021లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ మువ్వన్నెల జెండా ఎగరేయకుండా ఎవరైనా పోలీసు అడ్డుకుంటే అతనికి 10 లక్షల డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిన పన్నూపై ఎన్ఐఏ కోర్టు 2021 ఫిబ్రవరిలో నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. -
ట్రూడో ఆరోపణలు తీవ్రమైనవే: అమెరికా
న్యూయార్క్: ఖలిస్తానీ ఉగ్రవాది హత్యోదంతంలో భారతీయ నిఘా వర్గాల పాత్రపై అమెరికా జాతీయ భద్రతా మండలి ఉన్నతాధికారి స్పందించారు. ‘ కెనడా పౌరుడైన నిజ్జర్ హత్యతో భారతీయ నిఘా వర్గాలకు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేస్తున్న ఆరోపణలు నిజంగా తీవ్రమైనవి. ఈ వివాదం ముగిసిపోవాలంటే సమగ్ర, విస్తృతస్థాయి దర్యాప్తు అవససరం. కెనడా ఇప్పుడు అదే పనిలో ఉంది. ఇందుకు భారత్ సైతం పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేం కూడా కోరుకుంటున్నాం’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయ కర్త(వ్యూహాత్మక సంబంధాలు) జాన్ కిర్బీ సీఎన్ఎన్ వార్తాసంస్థ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. -
నందాదేవి.. ఓ మిస్టరీ.. పొంచి ఉన్న అణు ముప్పు!!
ఐదు దశాబ్దాల క్రితం జరిగిన ఒక సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు మన వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చైనాపై నిఘా పెట్టడానికి హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణులకు తరలించిన అణు పరికరం.. భవిష్యత్తులో ఏం ప్రకంపనలు రేపుతుందోనని గుబులు రేపుతోంది. మంచులో కూరుకుపోయిన దాని జాడ పసిగట్టేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది. మరోవైపు ఆ సీక్రెట్ ఆపరేషన్ వెండితెరపై ఆవిష్కృతం కానుంది. అసలు అప్పుడేం జరిగింది ? మనకు పొంచి ఉన్న ముప్పేంటి ? 53 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే... అది 1964 సంవత్సరం. చైనా తొలిసారిగా అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలకు ముఖ్యంగా పెద్దన్న అమెరికాకు దడ పుట్టించింది. దీంతో చైనా అణుపాటవం తెలుసుకోవడానికి హిమాలయాల్లో సెన్సార్లు ఏర్పాటు చేయాలని అమెరికా భావించింది. దీనికి భారత్ సహకారం కోరింది. అనాలోచితంగా భారత్ దీనికి అంగీకరించింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంయుక్తంగా చైనా అణుకార్యకలాపాలపై హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణుల నుంచి నిఘా పెట్టడానికి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలకు చెందిన సిబ్బంది అణు ఇంధనంతో నడిచే జనరేటర్, ప్లుటోనియం క్యాప్సూల్స్, ఏంటెనాలు ఏర్పాటు చేయడానికి 1965 జూన్ 23న అలాస్కాలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత అక్టోబర్‌లో నందాదేవి శ్రేణులకు వెళ్లారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జనరేటర్, క్యాప్సూల్స్‌ను అక్కడే విడిచి వచ్చేశారు. వాతావరణం చక్కబడ్డాక తిరిగి వెళ్లి చూస్తే అవి అక్కడ కనిపించలేదు. ఎక్కడో మంచులో కూరుకుపోయా యి. వాటిని అలాగే వదిలేస్తే ప్రమాదం ఉంటుందని భావించిన ఈ బృందం తిరిగి 1966, 67లలో కూడా హిమాలయాలకు వెళ్లి వాటి కోసం విస్తృతంగా గాలించాయి. కానీ లాభం లేకుండా పోయింది. అవెక్కడున్నాయో కనిపెట్టలేకపోయారు. అది రహస్య ఆపరేషన్ కావడంతో చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయారు. అయితే అప్పట్లో భారత్ బృందానికి నేతృత్వం వహించిన కెప్టెన్ మన్మోహన్సింగ్ కోహ్లి మాత్రం భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడాయనకు 88 ఏళ్లు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున పరికరాల జాడ కనిపెట్టాలంటున్నారు. క్యాప్సూల్స్‌తో ప్రమాదం ఎలా ? ప్లుటోనియం క్యాప్సూల్స్ జీవితకాలం వందేళ్లు. ఆ తర్వాత అవి కరిగిపోతాయి. ఇప్పటికే 53 ఏళ్లు గడిచిపోగా మరో 47 ఏళ్లే మిగిలి ఉంది. గంగానదికి అణు ముప్పు ప్లుటోనియం క్యాప్సూల్స్ ఒకవేళ కరిగిపోయి రిషి గంగలో కలిస్తే పవిత్ర జలాలన్నీ కలుషితమైపోతాయి. ఆ నీటిని వినియోగిస్తే ఎందరో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉన్న ప్రజలు రేడియేషన్ బారినపడే అవకాశం ఉంది. ఇప్పుడేం చేస్తారు? ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పల్ మహరాజ్ ఇటీవల ప్రధాని మోదీని కలిసి గంగానదికి ఉన్న అణుముప్పు గురించి వివరించారు. ప్లుటోనియం క్యాప్సూల్స్‌ను వెలికితీయకపోతే 40ఏళ్ల తర్వాత పెను ప్రమాదం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాడార్లు, సెన్సార్ల ద్వారా 10–15 అడుగుల లోతైన మంచు పొరలను తొలిచి ఆ పరికరాల జాడ కనుగొనాలని కోరారు. ఇందుకు కేంద్రం ఓకే చెప్పింది. తెరకెక్కనున్న హాలీవుడ్ సినిమా... స్మోక్ సిగ్నల్స్, హోమ్ ఎలోన్ వంటి చిత్రాలను నిర్మించిన హాలీవుడ్ నిర్మాత స్కాట్ రోజెన్ఫెల్ట్ని ఈ సీక్రెట్ మిషన్ విపరీతంగా ఆకర్షించింది. కెప్టెన్ కోహ్లి ఈ ఆపరేషన్‌పై స్పైస్ ఇన్ హిమాలయాస్ పేరుతో చాలా ఏళ్ల కిందటే ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం హక్కుల్ని రోజెన్‌ఫెల్ట్ పదేళ్ల క్రితమే కొనుగోలు చేశారు. కానీ బడ్జెట్ సరిపోక ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మలబెర్రి ఫిలిమ్స్, రోజెన్‌ఫెల్ట్ సంయుక్తంగా 2 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీక్రెట్ ఆపరేషన్‌లో పాల్గొన్న పలువురిని రోజెన్‌ఫెల్ట్ కలసి వారు చెప్పిన అనుభవాలతో ఆపరేషన్ నందాదేవిని తెరకెక్కిం చనున్నారు. భారత్ సిబ్బంది పాత్రల్లో భారతీయులనే తీసుకోనున్నారు. కెప్టెన్ కోహ్లి పాత్రకు రణబీర్‌ను సంప్రదించినట్టు సమాచారం. -
దావూద్ ఇబ్రహీం చిరునామా ఇదీ!
⇒ మూడు చిరునామాలను పట్టేసిన భారత నిఘావర్గాలు ⇒ మాజీ క్రికెటర్ మియాందాద్ కొడుకుతో దావూద్ వియ్యం ⇒ దావూద్ ఇబ్రహీంకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు ⇒ భార్య పేరుతో ఉన్న టెలిఫోన్ బిల్లు కూడా లభ్యం ⇒ సంచలన ఆధారాలు సంపాదించిన భారత నిఘాబృందం న్యూఢిల్లీ: భారతదేశంలో పదే పదే ఉగ్రవాద దాడులకు కుట్రలు పన్ని.. పాకిస్థాన్‌లో నక్కి ఉన్న దావూద్ ఇబ్రహీం చిరునామా మొత్తం భారత నిఘా వర్గాలకు తెలిసిపోయింది. తన భార్య మెహజబీన్ షేక్, కొడుకు మొయీన్ నవాజ్, కూతుళ్లు మహరుక్, మెహ్రీన్, మాజియా అందరితో కలిసి దావూద్ పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలోనే ఉంటున్నట్లు తెలిసిపోయింది. అందుకు పక్కా ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వాటితో పాటు.. దావూద్ తాజా ఫొటోను కూడా భారత నిఘావర్గాలు సంపాదించాయి. కరాచీ శివార్లలోని క్లిఫ్టన్ అనే ప్రాంతంలో దావూద్ ప్రస్తుతం ఉంటున్నాడు. అతడి కొడుకు మొయీన్‌కు సానియా అనే అమ్మాయితో పెళ్లయింది. కూతుళ్లలో మహరూఖ్కు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ కొడుకు జునాయిద్తో పెళ్లయింది. 2015 ఏప్రిల్ నెలలో దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ పేరు మీద ఉన్న టెలిఫోన్ బిల్లులను కూడా భారత నిఘా వర్గాలు సంపాదించాయి. అందులో దావూద్ చిరునామా ఇలా ఉంది.. ''డి-13, బ్లాక్-4, కరాచీ డెవలప్మెంట్ అథారిటీ, ఎస్‌సిహెచ్-5, క్లిఫ్టన్''. దావూద్ ఇబ్రహీంకు మూడు పాకిస్థానీ పాస్‌పోర్టులు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ ఒక్క చిరునామాయే కాకుండా.. మరో రెండు చిరునామాలు కూడా అతడికి ఉన్నాయి. వాటిలో ఒకటి.. ''6ఎ, ఖయబాన్ తంజీమ్, ఫేజ్ 5, డిఫెన్స్ హౌసింగ్ ఏరియా. మరొకటి మొయిన్ ప్యాలెస్, రెండో అంతస్థు, అబ్దుల్లా షా ఘాజీ దర్గా వద్ద, క్లిఫ్టన్, కరాచీ. 1993లో ముంబై మహానగరంలో వరుస పేలుళ్లకు ప్రధాన కుట్రదారు అయిన దావూద్ ఇబ్రహీం పేరు మీద ఇంటర్‌పోల్ ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది. ఆ పేలుళ్లలో 257 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. దావూద్ తమ దేశంలో ఉన్న విషయాన్ని పాక్ పదే పదే ఖండిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా ఆధారాలతో ఇక ఆ దేశం ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. -
ఆరు నెలలుగా ఐబీ నిఘా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పేలుళ్లు సృష్టిస్తూ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన యాసిన్ భత్కల్ కదలికలపై కేంద్ర నిఘా విభాగం (ఐబీ) ఆరు నెలలుగా నిఘా తీవ్రం చేసింది. ఉగ్రవాద కదలికలను గుర్తించేందు కు ఐబీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విభాగం ద్వారా ఈ సీక్రెట్ ఆపరేషన్ జరిగింది. దిల్సుఖ్నగర్ పేలుళ్ల సమయంలో యాసిన్, తబ్రేజ్‌లు వినియోగించిన ఫోన్ నంబర్లను నిఘావర్గాలు గుర్తించాయి. దేశవ్యాప్తంగా పేలుళ్ల కోసం ఆజంగఢ్, దర్బాంగ్ మాడ్యూల్స్‌ను యాసిన్ వినియోగించుకున్నట్లు నిర్ధారించుకున్నారు. ఆ రెండు మాడ్యూల్స్‌లోని వ్యక్తులను నీడలా వెంటాడి యాసిన్ ఆచూకీపై కొంత సమాచారం రాబట్టారు. అతను పాక్, బంగ్లాదేశ్‌ల నుంచి ఇండో-నేపాక్ సరిహద్దుకు వచ్చివెళ్తున్నట్లు రూఢీ అయిన తరువాత సీక్రెట్ ఆపరేషన్‌ను వేగిరం చేశారు. తర్వాత ఎన్ఐఏ నుంచి కూడా కొంత సహకారం తీసుకున్నారు. బుధవారం రాత్రి అరెస్టు చేసేవరకూ బీహార్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అరెస్టు సమయంలో మాత్రం ఆ రాష్ట్ర అదనపు డీజీ స్థాయి అధికారులు ఇద్దరికి మాత్రం విషయం తెలిపారు. అరెస్టు సమయంలో యాసిన్ పాక్ పాస్‌పోర్టు కలిగివున్నట్లు సమాచారం. తాను ఇంజనీర్‌నని, ఉగ్రవాదులతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని అరెస్టు తరువాత కూడా నమ్మబలికే ప్రయత్నం చేశాడు. ఇలా పలుమార్లు త్రుటిలో తప్పించుకున్న అనుభవం యాసిన్‌కు ఉంది. అయితే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఎన్ఐఏ అధికారుల ద్వారా పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్నారు. సుదీర్ఘ విచారణలో తాను యాసిన్ భత్కల్నేనని అతను అంగీకరించినట్లు తెలిసింది. యాసిన్ గుర్తింపును నిర్ధారించుకునేందుకు అతని డీఎన్ఏనూ పరీక్షించే అవకాశం ఉంది. నా కుమారుడు నిరపరాధి: యాసిన్ తండ్రి బెంగళూరు, న్యూస్‌లైన్: తన కుమారుడు యాసిన్ భత్కల్ నిరపరాధని, అతన్ని రక్షించుకోడానికి న్యాయ పోరాటం చేస్తానని అతని తండ్రి యాకుబ్ సిద్ది బాషా అన్నారు. ఆయన భత్కల్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు బూటకపు ఎన్కౌంటర్లో మరణించాడని భావించామని, అయితే బతికే ఉన్నాడని తెలిసి సంతోషిస్తున్నట్లు చెప్పారు. యాసిన్ కస్టడీ కోరుతున్న పలు రాష్ట్రాలు బెంగళూరు, న్యూస్‌లైన్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక పోలీసులు కూడా యాసిన్ భత్కల్ కస్టడీని కోరుతున్నారు. ఉగ్రవాదులతో చేతులు కలిపి కర్ణాటక సహా అనేక రాష్ట్రాలలో బాంబు పేలుళ్లకు కారణమైన యాసిన్ భత్కల్ను ఇక్కడకు తీసుకొచ్చి విచారించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తునకు కర్ణాటక పోలీసులు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. యాసిన్‌ను వీలైనంత త్వరగా బెంగళూరు తీసుకువస్తామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. పలు ఉగ్రవాద కేసులతో సంబంధమున్న యాసిన్‌ను కస్టడీకి కోరనున్నట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీకి సంబంధించిన పలు కేసుల్లో 2011లో ఢిల్లీ హైకోర్టు బయట జరిగిన పేలుళ్లు, 2008లో జరిగిన వరుస పేలుళ్లు కీలకమైనవని చెప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసుతో పాటు మరో 35 కేసుల్లో యాసిన్‌ను గుజరాత్ పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు పోలీసు జాయింట్ కమిషనర్ ఎ.కె.శర్మ చెప్పారు. మహారాష్ట్ర యాంటీ టైస్టు స్క్వాడ్ (ఏటీఎస్) యాసిన్ కస్టడీ కోరనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ చెప్పారు.