కాపలాదారుగా ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా కాల్పులు
దగ్గర్నుంచి కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది నారైన్ సింగ్
ఖలిస్తానీ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నందుకే అఘాయిత్యం!
అప్రమత్తమై అడ్డుకున్న పోలీసులు, తప్పిన ప్రమాదం
అమృత్‌సర్/చండీగఢ్: సిక్కులకు పరమ పవిత్రమైన అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో దారుణం చోటుచేసుకుంది. శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ (62)పై బుధవారం హత్యాయత్నం జరిగింది.
ఉదయం 9.30 గంటలకు నారైన్ సింగ్ చౌరా అనే మాజీ ఉగ్రవాది అత్యంత సమీపానికి దూసుకొచ్చి ఆయనపై పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకొని దూరంగా లాక్కెళ్లారు. తూటా గురి తప్పడంతో సుఖ్‌బీర్ సింగ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మీడియా కెమెరాల్లో రికార్డయిన ఈ హత్యాయత్నం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
2007 నుంచి 2017 దాకా పంజాబ్‌లో అకాలీదళ్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా మతాచారం ప్రకారం స్వర్ణదేవాలయం ప్రవేశద్వారం వద్ద సుఖ్‌బీర్ సింగ్ మంగళవారం కాపలాదారు (సేవాదార్)గా మారారు. బుధవారం ఆయన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. కాపలాదారు దీక్షలో ఉండగానే హత్యాయత్నం జరిగింది. కాలికి గాయమవడంతో చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్న సుఖ్‌బీర్ వైపు నారైన్ నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు. అంతా చూస్తుండగానే జేబులోంచి పిస్తోల్ బయటకు తీసి సుఖ్‌బీర్‌పై గురిపెట్టాడు.
ఆయన పక్కనే నిల్చున్న ఏఎస్సై జస్బీర్ సింగ్ వెంటనే నారైన్ చేతిని దొరకబుచ్చుకొని వెనక్కి నెట్టేశాడు. దాంతో తూటా గురి తప్పి ఆలయ ప్రవేశద్వారం గోడలోకి దూసుకెళ్లింది. ఇతర పోలీసు సిబ్బంది సుఖ్‌బీర్ చుట్టూ రక్షణ వలయంగా నిల్చున్నారు. భద్రతా సిబ్బందితో పాటు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ టాస్‌్కఫోర్స్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. కాల్పుల సమాచారం తెలియగానే సుఖ్‌బీర్ భార్య, ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుఖ్‌బీర్‌కు జెడ్ ప్లస్ భద్రత ఉంది.
నారైన్‌ను డేరాబాబా నానక్ ప్రాంతానికి చెందిన మాజీ ఉగ్రవాదిగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పిస్తోల్ స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండడం వల్లే సుఖ్‌బీర్‌సింగ్‌కు ప్రాణాపాయం తప్పిందని అమృత్‌సర్ పోలీసు కమిషనర్ గురుప్రీత్‌సింగ్ భుల్లార్ చెప్పారు. నిందితుడు ఒంటరిగానే స్వర్ణదేవాలయానికి వచ్చాడని తెలిపారు. హత్యాయత్నానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
నిందితుడిని చాకచక్యంగా అడ్డుకున్న ఏఎస్‌ఐ జస్బీర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సుఖ్‌బీర్‌పై కాల్పుల ఘటనను వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన వెనుక కారణాలు నిగ్గుతేల్చి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆఖల్ తక్త్ నిర్దేశం ప్రకారం స్వర్ణ మందిరంలో మతపరమైన సేవ అందిస్తున్న సుఖ్‌బీర్‌ను హత్య చేయాలని చూడడం చాలా బాధాకరమని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ చీఫ్ హర్జీందర్ సింగ్ ధామీ అన్నారు. ఇదిలా ఉండగా, ఖలిస్తాన్ ఉద్యమాన్ని సుఖ్‌బీర్ సింగ్ వ్యతిరేకిస్తున్నందుకే ఆయనను హత్య చేయాలని చౌరా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
పంజాబ్‌పై బీజేపీ కుట్ర: కేజ్రీవాల్
సుఖ్‌బీర్‌పై హత్యాయత్నాన్ని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను, పోలీసులను అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. శాంతిభద్రతలను ఎలా కాపాడాలో పోలీసులు చూపించారని కొనియాడారు. హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. పంజాబ్‌లో ఆప్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఆరోపించారు. ఆప్ సర్కారు అసమర్థత వల్లే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డారు. దీనికి మాన్ బదులివ్వాలని డిమాండ్ చేశారు.
Amritsar : सुखबीर सिंह बादल पर जानलेवा हमला #SukhbirSinghBadal #Punjab #GoldenTemple pic.twitter.com/S5x0EegGRE
— Adv Jony Ambedkarwadi 🇮🇳 (@TheJonyVerma) December 4, 2024
ఎవరీ చౌరా?
సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై కాల్పులు జరిపిన నారైన్ సింగ్ చౌరా (68) గతంలో కరడుగట్టిన ఉగ్రవాది అని పోలీసులు చెప్పారు. తీవ్రవాద ఘటనల్లో, ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాల్లో అతడి హస్తముందని వెల్లడించారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో చురుగ్గా పని చేశాడని తెలిపారు. అతడిపై ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమ రవాణా సహా 12కుపైగా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
→ గురుదాస్‌పూర్ జిల్లా చౌరా గ్రామంలో పుట్టిన చౌరా చిన్నప్పుడే ఖలిస్తానీ తీవ్రవాదం పట్ల ఆకర్శితుడయ్యాడు.
→ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్, అకల్ ఫెడరేషన్ వంటి సంస్థల్లో పని చేశాడు. పంజాబ్ మాజీ సీఎం బియాంత్‌సింగ్ హత్య కేసు నిందితులతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి.
→ బురైల్ జైలును బద్ధలు కొట్టి, ఖైదీలు తప్పించుకొని పారిపోయిన ఘటనకు చౌరాయే సూత్రధారి అని ఆరోపణలున్నాయి.
→ చౌరా 1984లో పంజాబ్‌లో ఉగ్రవాదం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు పాకిస్తాన్‌కు పారిపోయాడు. అక్కడి నుంచే పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించాడు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందజేశాడు.
→ పాకిస్తాన్‌లో ఉన్నప్పుడే గెరిల్లా యుద్ధరీతులపై, దేశద్రోహంపై పుస్తకాలు రాశాడు. ఖలిస్తాన్ విరుద్ధ్ సాజిష్ అనే వివాదాస్పద పుస్తకం అతడు రాసిందే.
→ పంజాబ్‌లో రాజకీయంగా ప్రాబల్యం కలిగిన బాదల్ కుటుంబం అంటే చౌరాకు మంట. మితవాదులంటే అతడికి నచ్చదు. 1980వ దశకం నుంచి బాదల్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హవారా గ్రూప్‌లో చౌరా కూడా సభ్యుడే.
→ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద అతడిపై పలు కేసులు నమోదయ్యాయి.
→ చౌరా తొలిసారిగా 2013 ఫిబ్ర వరి 28న పంజాబ్‌లోని తార్న్ తరన్‌లో అరెస్టయ్యాడు. అప్ప ట్లో మొహాలీలోని అతడి నివా సంలో భారీ ఎత్తున ఆయుధా లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment