మళ్లీ సిమి సెగ! | SIMI activist arrested by Madhya Pradesh Anti-Terrorist Squad | Sakshi
Sakshi News home page

మళ్లీ సిమి సెగ!

Published Sun, Apr 27 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

SIMI activist arrested by Madhya Pradesh Anti-Terrorist Squad

న్యూఢిల్లీ: ఎన్నో ఉగ్రవాద దాడులతో ప్రమేయమున్న భారత ఇస్లామిక్ విద్యార్థుల ఉద్యమ (సిమి) సంస్థ..ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సాయంతో మళ్లీ విస్తరణకు యత్నిస్తోందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. పాకిస్థాన్ జాతీయుడు వకాస్ సహా పలువురు  ఐఎం సభ్యుల అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు ఇది నిధులు సేకరిస్తున్నట్టు నిఘా వర్గాలు గ్రహించాయి. ఢిల్లీ సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టడానికి సిమి ప్రయత్నిస్తోందని జియా ఉర్ రెహమాన్ ఎలియాస్ వకాస్ పోలీసుల విచారణలో వెల్లడిం చారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలోనే ఉన్న ఇతడు, సిమిలో చురుగ్గా పని చేస్తున్న వారి వివరా లు కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక ఉగ్రవాద స్థాపనకు నిధుల కోసం బ్యాంకులను దోపిడీ చేయాలంటూ ముస్లిం యువకులను ప్రేరేపించిన సిమి సభ్యుడు అబూ ఫైజల్ ఎలియాస్ ‘డాక్టర్’తోనూ వకాస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు బయటపడింది.
 
 ‘డాక్టర్’ ఇది వరకే మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఐదుగురు సిమి కార్యకర్తలతోపాటు తప్పించుకున్నాడు. ఇతణ్ని పోలీసులు తిరిగి గత డిసెంబర్‌లో అరెస్టు చేశారు. మిగతా ఐదుగురు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. జైలు నుంచి తప్పించుకోవాలన్న కుట్రకు కూడా ఇతడే సూత్రధారని విచారణలో వెల్లడయింది. ఉగ్రవాద సంస్థకు నిధుల కోసం ‘డాక్టర్’ బృందం నర్మదలోని గ్రామీణబ్యాంకులో 2009లో దోపిడీ జరిపింది. దేవస్, ఇటార్సీ బ్యాంకు దోపిడీలతోనూ ఇతనికి సంబంధం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇతడు ఢిల్లీలో ఎటువంటి దాడులకూ పాల్పడకపోయినా, ఉగ్రవాద సంస్థలకు ఇతడు నిధులు సమకూర్చాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు. 2011లో అరెస్టు కాకముందు ‘డాక్టర్’ ఐంఎ సభ్యులతో సన్నిహితంగా మెలిగాడు.
 
 పాక్ నుంచి ప్రోత్సాహం
 నిర్బంధం కారణంగా చెల్లాచెదురైన సిమి కార్యకర్తలంతా తిరిగి ఒక్కటయ్యేందుకు చర్యలు తీసుకోవాలని పాక్‌లోని ఐఎం అగ్రనాయకులు భారత్‌లోని తమ రహస్య సభ్యులకు సూచించినట్టు తెలిసింది. ఇలా మళ్లీ సంఘటితంగా మారిన సిమి కార్యకర్తలు బ్యాంకు దోపిడీలకు పునఃప్రారంభిస్తారని దర్యాప్తు సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. 2010కి ముందు సిమి కార్యకర్తలు దక్షిణాది రాష్ట్రాల్లో పలుచోట్ల బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు. ‘గతంలో సిమిలో పనిచేసిన వారందరితోనూ ఐఎం కార్యకర్తలు మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నారు. సంస్థ లో చేరాల్సిందిగా ముస్లిం యువతను ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారిపై ఎక్కువ గా దృష్టి సారిస్తున్నారు’ అని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
 
 ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఐజాజుద్దీన్, అస్లాం, జాకీర్ హుస్సే న్, షేక్ మెహబూబ్, ఇక్రార్‌ను మళ్లీ అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు నిఘా సంస్థల సాయంతో ప్రత్యేకంగా గాలిస్తున్నారు. ఈ ఐదుగురు మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్ వాసులని తేలింది. ఈ విషయ మై మరింత సమాచారం సేకరించేందుకు ఢిల్లీ పోలీసు స్పెషల్‌సెల్ వకాస్‌ను తన కస్టడీలోకి తీసుకుంది. సిమి 1977లో అలీగఢ్‌లో ఏర్పాటయింది.  2002లో సిమిని నిషేధించకముందు మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు, ముఖ్యప్రాంతాల్లో దీనికి కార్యకర్తలు, కార్యాలయాలు ఉండేవి. ఇస్లామిక్ మతప్రచారం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం దీని ప్రధాన లక్ష్యాలు. సిమి అధ్యక్షుడు షహీద్ ఫలాహీ 9/11 దాడుల కేసులో అరెస్టు కావడంతో నిఘా వర్గాలు దీనిపై దృష్టి సారించాయి. నిషేధం తరువాత 1,200 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. 2010లో ఏర్పడిన ఐఎం సిమి అనుబంధ సంస్థేనని పోలీసులు అంటున్నారు. పలు పేలుళ్ల ఘటనలతో సిమి, ఐఎంకు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు.
 
 సిమి కార్యకర్త అరెస్టు
 భోపాల్: సిమిలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న గుల్రేజ్ అలీని మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం అరెస్టు చేశారు. విశేషమేమంటే ఢిల్లీ పోలీసులు ‘డాక్టర్’ను (అబూ ఫైజల్) ఆదివారమే భోపాల్‌కు తీసుకెళ్లారు. ఇతణ్ని తిరిగి తీసుకెళ్లడానికి అక్కడ వేచిచూస్తున్న ఏటీఎస్ పోలీసులకు అలీ  కనిపించాడు. ఇతనిపై రూ.15 వేల రివార్డు కూడా ఉంది. నిందితుడికి స్థానిక కోర్టు మే ఐదు వరకు పోలీసు కస్టడీ విధించింది. అలీపై ఇది వరకే పలు కేసులు నమోదయ్యాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement