SIMI
-
‘సిమి’ అంటే ఏమిటి? విద్యార్థి సంఘం ఎందుకిలా మారింది?
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ప్రస్తుతం తీవ్రవాద సంస్థగా పేరుగాంచింది. ‘సిమి’ తొలుత యూపీలోని అలీగఢ్‌లో విద్యార్థి సంఘంగా ఏర్పడింది. అయితే ఈ సంఘం అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలు రావడంతో 2001లో తొలిసారి దీనిని నిషేధించారు. ఈ నిషేధం నేటికీ కొనసాగుతోంది. ఐదేళ్ల క్రితం యూఏపీఏ కింద చర్యలు తీసుకుంటూ ఐదేళ్ల పాటు నిషేధం విధించగా, దీనిని మరోసారి పొడిగించారు. ఇస్లామిక్ ల్యాండ్‌గా మార్చాలని.. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఏప్రిల్ 1977లో స్థాపితమయ్యింది. భారతదేశాన్ని ఇస్లామిక్ ల్యాండ్‌గా మార్చడం ద్వారా ‘భారతదేశానికి విముక్తి’ కల్పించాలనేది సిమి మిషన్ అనే ఆరోపణలున్నాయి. భారత్‌లో ఇస్లామిక్ పాలనను నెలకొల్పడమే ‘సిమి’ లక్ష్యమని, దాని మనుగడ కొనసాగేందుకు అనుమతించబోమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. నిషేధిత సంస్థ కార్యకర్తలు ఇప్పటికీ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతకు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మహ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ సారధ్యంలో.. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జమాతే ఇస్లామీ హింద్ (జేఈఐహెచ్)ను విశ్వసించే యువత, విద్యార్థుల సంస్థగా ‘సిమి’ 1977 ఏప్రిల్ 25, 1977న ఉనికిలోకి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. 1993లో అది స్వతంత్ర సంస్థగా ప్రకటించుకుంది. సిమి వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ. ఆయన ప్రస్తుతం మాకోంబ్లోని వెస్ట్రన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఇంగ్లీష్, జర్నలిజం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. యాసర్ అరాఫత్ తీరుపై నిరసన 1981లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) నేత యాసర్ అరాఫత్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ‘సిమి’ కార్యకర్తలు నిరసనకు దిగడంతో ఈ సంస్థ తొలిసారి ముఖ్యాంశాలలో కనిపించింది. న్యూఢిల్లీలో సిమి కార్యకర్తలు యాసర్ అరాఫత్‌కు నల్లజెండాలతో స్వాగతం పలికారు. అరాఫత్ పశ్చిమ దేశాల కీలుబొమ్మ అని నాడు సిమి కార్యకర్తలు ఆరోపించారు. జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) సీనియర్ నేతలు అరాఫత్‌ను పాలస్తీనా వాదానికి ఛాంపియన్‌గా అభివర్ణించారు. దీని తర్వాత ‘సిమి’, జేఐహెచ్ విడిపోయాయి. ‘సిమి’పై నిషేధం 2001లో తొలిసారిగా ‘సిమి’పై నిషేధం విధించారు. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఆ నిషేధం కొనసాగుతూనే ఉంది. అయితే 2008 ఆగస్టులో ప్రత్యేక ట్రిబ్యునల్ ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే నాటి సీజేఐ కేజీ బాలకృష్ణన్ దానిని పునరుద్ధరించారు. జాతీయ భద్రత దృష్ట్యా 2008 ఆగస్టు 6న అప్పటి సీజేఐ దీనిని నిషేధించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 2019 అంటే యూఏపీఏ ప్రకారం భారత ప్రభుత్వం 2019లో ‘సిమి’ని నిషేధించింది. ఈ నిషేధాన్ని ఐదు సంవత్సరాల పాటు విధించారు. 2019లో విధించినఈ నిషేధం 2024 ఫిబ్రవరితో ముగుస్తుంది. అయితే దీనికిముందే హోం మంత్రిత్వ శాఖ దీనిపై కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిషేధ కాలాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించింది. వివిధ సంస్థలు పేర్లతో.. ‘సిమి’ వివిధ సంస్థలు పేర్లతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. సిమిపై నిషేధం విధించిన తర్వాత ఆ సంస్థ ఖైర్-ఎ-ఉమ్మత్ ట్రస్ట్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, తెహ్రీక్-ఏ-అహయా-ఏ-ఉమ్మత్, తెహ్రీక్-తలాబా-ఏ-అరేబియా, తెహ్రీక్ తహఫుజ్-ఇ, షాయర్-ఎ-ఇస్లాం, వహ్దత్-ఇ-ఇస్లామీ పేర్లతో తన కార్యకలాపాలను యధేచ్ఛగా నిర్వహిస్తున్నదనే ఆరోపణలున్నాయి. -
సిమిపై మరో ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ శాంతి, మత సామరస్యానికి భంగం కలిగిస్తున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై నిషేధాన్ని కేంద్ర ప్రభ్వుం మరో అయిదేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం ‘ఎక్స్’లో ప్రకటించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)కింద సిమిని చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా సుమారు 10 రాష్ట్రాల వినతి మేరకు.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా మొదటిసారిగా కేంద్రం 2001లో సిమిని నిషేధించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 1977లో సిమి ఏర్పాటైంది. భారత్‌ను ముస్లిం దేశంగా మార్చాలన్న అజెండాతో పనిచేస్తున్నట్లు ఈ సంస్థపై ఆరోపణలొచ్చాయి. గత కొన్నేళ్లలో సిమి కార్యకర్తలపై ఉగ్రవాద సంబంధ 17 కేసులు నమోదు కాగా, 27 మంది సభ్యులను అరెస్ట్ చేసినట్లు హోం శాఖ తెలిపింది. -
కేంద్రం కీలక నిర్ణయం.. ‘సిమి’పై మరో ఐదేళ్లు నిషేధం
న్యూఢిల్లీ: చట్ట విరుద్ధమైన స్టుడెంట్స్ ఆఫ్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(SIMI)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం(UAPA) కింద.. సిమిపై మరో ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని సోమవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా వెల్లడించింది. మొదటి ఏన్డీయే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 2014లో ఉపా చట్టం కింద ‘సిమి’ సంస్థపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. Bolstering PM @narendramodi Ji's vision of zero tolerance against terrorism ‘Students Islamic Movement of India (SIMI)’ has been declared as an 'Unlawful Association' for a further period of five years under the UAPA. The SIMI has been found involved in fomenting terrorism,… — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) January 29, 2024 ‘ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న ప్రధాని మోదీ విధానాన్ని బలపరుస్తూ.. యూఏపీఏ కింద ‘సిమి’ని మరో ఐదేళ్లపాటు ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించబడింది. భారత సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, శాంతి, మతసామరస్యానికి భంగం కలిగించడంలో ‘సిమి’ ప్రమేయం ఉన్నట్లు తేలింది’ అని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం పేర్కొంది. -
హైదరాబాద్ వచ్చి వెళ్లిన ఆసియా అంద్రాబీ
సాక్షి, సిటీబ్యూరో: దేశద్రోహం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఢిల్లీ యూనిట్ అధికారులు శుక్రవారం వివాదాస్పద కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ దుక్త్రాన్–ఏ–మిల్లత్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆసియా అంద్రాబీని అరెస్టు చేశారు. ఈమెకు నగరంతోనూ కొన్ని లింకులు ఉన్నాయి. 2014లో హైదరాబాద్‌కు వచ్చి వెళ్ళడంతో పాటు 2015లో నగరంలో చిక్కిన ‘ఐసిస్ త్రయం’ సైతం కాశ్మీర్ వెళ్లి ఈమెను కలవడానికి ప్రయత్నాలు చేశారు. నగరానికి వచ్చిన సందర్భంలో ఆసియా అప్పట్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) జాతీయ మాజీ అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళింది. తాజాగా ఆమెతో పాటు మరో ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేయడంతో విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఐసిస్‌లో చేరేందుకు సిరియా వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్న త్రయం అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్‌లను 2015 డిసెంబర్లో సిట్ పోలీసులు నాగ్‌పూర్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ‘సిమి’ సలావుద్దీన్‌కు బంధువులైన వీరు నాగ్‌పూర్ నుంచి విమానంలో శ్రీనగర్ వెళ్లి ఆసియాను కలవాలనే లక్ష్యంతో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. నల్లగొండలో పుట్టి సిమిలో చేరి జాతీయ స్థాయికి ‘ఎదిగి’ ఆ సంస్థ మాజీ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ సలార్‌కు జాతీయ స్థాయిలో సంబంధాలు ఉండేవి. నల్లగొండకు చెందిన సలావుద్దీన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బతుకుతెరువు కోసం ముంబై వెళ్లిన నేపథ్యంలో అక్కడి సిమి క్యాడర్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 1998 వరకు నార్తన్ రీజన్ కమాండర్‌గా పని చేస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో సిమి కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. ఆపై రెండేళ్ల పాటు సిమికి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో జాతీయ స్థాయిలో వివాదాస్పద సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేస్తుకున్నాడు. అప్పట్లోనే ఇతడికి అంద్రాబీతో పరిచయం ఏర్పడింది. 2011లో దుబాయ్ నుంచి భారత్‌కు వస్తూ అరెస్టు అయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఇతడు నగరంలో నివసించాడు. 2014 అక్టోబర్‌లో నల్లగొండ నుంచి కారులో వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న అంద్రాబీ హైదరాబాద్‌కు వచ్చి అతడి కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళారు. ఈమె కుమారుడు సైతం నగరంలోని ఓ విద్యాసంస్థలో చదువుకున్నాడు. ఈ నేపథ్యంలోనే 2012లోనూ అంద్రాబీ ఓసారి హైదరాబాద్ వచ్చివెళ్ళారని సమాచారం. పాక్ అనుకూల వాదిగా ముద్రపడ్డ అంద్రాబీ 2015 సెప్టెంబర్‌లో కాశ్మీర్లో పాకిస్థాన్ జెండాలను ప్రదర్శించి వివాదాస్పదమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన శ్రీనగర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2016లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆసియా సలావుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించినట్లు అంగీకరించారు. -
సిటీ పేలుళ్లలో ఐఎం ఉగ్రవాది హస్తం?
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రసంస్థ నగరంలో 2007, 2013ల్లో పాల్పడిన జంట పేలుళ్ల కేసులో ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ పాత్రపై రాష్ట్ర నిఘా విభాగం లోతుగా ఆరా తీస్తోంది. దశాబ్దకాలంగా పరారీలో ఉన్న ఈ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు అక్కడి ఘాజీపురలో శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో అతడిని విచారించేందుకు రాష్ట్రంలోని నిఘా విభాగానికి చెందిన ఓ ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది. సిమిలో ఉండగా సిటీకి మధ్యప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన తౌఖీర్ కంప్యూటర్ కోర్సు కోసం ముంబై వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఆలిండియా చీఫ్ సఫ్దర్ నఘోరీ పరిచయంతో ఓ సంస్థలో ఉన్నతోద్యోగానికి 2001లో రాజీనామా చేశాడు. సిమి వెలువరిస్తున్న ‘ఇస్లామిక్ మూవ్మెంట్’ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలోనే నఘోరీతో కలసి హైదరాబాద్ వచ్చి సిమి సానుభూతిపరుల్ని కలిశాడు. వీరికి గుజరాత్ అల్లర్లు, రెచ్చగొట్టే ప్రసంగాలతో కూడిన వీడియోలు ఉన్న హార్డ్‌డిస్క్‌ను ఓ వ్యక్తి ఇచ్చినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ ఒక్క ‘పర్యటనే’రికార్డుల్లోకి ఎక్కినప్పటికీ వీరు పలుమార్లు నగరానికి వచ్చినట్లు అనుమానాలున్నాయి. ఐఎం ఏర్పాటులో కీలకంగా బండ్లగూడలోని ఓ విద్యాసంస్థలో పని చేసి, అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో అరెస్టయిన ముఫ్తీ అబు బషర్‌ను తౌఖీర్ కలసినట్లు అనుమానిస్తున్నాయి. 2001 సెప్టెంబర్‌లో కేంద్రం సిమిపై నిషేధం విధించడంతో అతడితోపాటు మరికొందరు అప్పట్లో ముంబైలో ఉంటున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లను కలసి ఐఎంను స్థాపించారు. బాంబుల తయారీలో నిష్ణాతుడిగా పేరున్న తౌఖీర్ పేరు అహ్మదాబాద్, ముంబై పేలుళ్లలో నేరుగా వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి పరారీలో ఉన్న అతడు కొన్నాళ్ల పాటు పాక్, దుబాయ్‌ల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు పేలుళ్ల వెనుక ఐఎం గోకుల్‌చాట్, లుంబినీపార్క్ (2007), దిల్సుఖ్నగర్ (2013)లో జంట పేలుళ్లకు పాల్పడింది. ఈ రెండు కేసుల్లోనూ రియాజ్ భత్కల్, ఒకదాంట్లో ఇక్బాల్ భత్కల్, అమీర్ రజా ఖాన్ నిందితులుగా ఉన్నారు. వీటికి సంబంధించిన సమావేశాల్లో భత్కల్ సోదరులతో పాటు తౌఖీర్ కూడా పాల్గొని ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది రూఢీ అయితే నగరంలోని జంటపేలుళ్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో ఇతడు వాంటెడ్‌గా మారతాడు. -
‘సిమి’ చీఫ్‌కు జీవితఖైదు
దేశద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు ఇండోర్: నిషేధిత ‘సిమి’ సంస్థ చీఫ్ సఫ్దార్ హుస్సేన్ నగోరి, మరో 10 మంది కార్యకర్తలకు 2008 నాటి దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. నగోరితో పాటు హఫీజ్ హుస్సేన్ , ఆమిల్ పర్వజ్, శివ్లి, కమృద్దీన్, షహ్దౌలి, కమ్రాన్ , అన్సార్, అహ్మద్ బైగ్, యాసిన్ , మున్రోజ్లకు జీవితఖైదు ఖరారు చేస్తూ ప్రత్యేక అదనపు సెషన్స్ జడ్జి బి.కె.పలోడా తీర్పు వెలువరిం చారు. భారత రాజ్యాంగం, చట్టాలపై దోషులకు విధేయత లేదని వారి చర్యల ద్వారా స్పష్టమైందని 84 పేజీల తీర్పులో కోర్టు అభిప్రాయపడింది. ‘దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు. మత విద్వేషాలను ప్రోత్స హించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు’ అని పేర్కొంది. మన్రోజ్ మినహా మిగిలిన 10 మంది నిందితులను అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉంచినట్లు ప్రభుత్వ న్యాయవాది విమల్ మిశ్రా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు వివరాలను తెలియజేయాలన్న నిందితుల అభ్యర్థన మేరకు కోర్టు.. తీర్పు వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి తెలియజేసింది. -
తల, ఛాతీలపై కాల్చి చంపారు!
సిమి కార్యకర్తల పోస్టుమార్టమ్ భోపాల్: తల, ఛాతీలపై కాల్చడంతోనే 8 మంది సిమి కార్యకర్తలు చనిపోయినట్లు మృతుల కుటుంబాల లాయర్ పర్వేజ్ అలమ్ తెలిపారు. వారిపై ముందువైపు నుంచే కాల్పులు జరిపారని చెప్పే పోస్టుమార్టమ్ నివేదికను తాను చూశానని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం నడుము కింది భాగంలోనే పోలీసులు కాల్చాలని, కాని నడుము పైభాగంలో కాల్పులు జరిపారని పేర్కొన్నారు. భోపాల్ జైలులోని మిగిలిన 20 మందికిపైగా సిమి కార్యకర్తలపైనా విచక్షణా రహితంగా దాడి జరిగిందని ఆరోపించిన పర్వేజ్.. వారికి వైద్య పరీక్షలు జరిపించాలని కోర్టులో పిటిషన్ వేశారు. తనకు కూడా ప్రాణహాని ఉందన్నారు. కాగా, పోస్టుమార్టమ్ అనంతరం సిమి కార్యకర్తల మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు. ‘బిర్యానీ తింటున్నారు’ ‘ఉగ్రవాద నిందితులు జైళ్లలో ఏళ్లపాటు చికెన్ బిర్యానీ తింటూ గడిపేస్తున్నారు. విచారణ పూర్తయి, వారికి శిక్ష పడ్డానికి చాలా ఏళ్లు పడుతుంది. దీంతో రోజూ బిర్యానీ బాగా తింటారు.తర్వాత తప్పించుకుంటారు. నేరాలకు పాల్పడతారు. అవినీతి కేసులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులున్నప్పుడు, ఉగ్రవాదులను శిక్షించేందుకు మాత్రం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఎందుకు ఉండకూడదు’ అని మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. -
ఔను! నిరాయుధులే.. అయితే ఏంటి?
భోపాల్: జైలు నుంచి పరారైన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్కౌంటర్ ఉదంతంపై మధ్యప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరారైన సిమీ కార్యకర్తలు హతమైన సమయంలో వారి వద్ద ఆయుధాలు లేవని, నిరాయుధులైన వారిని పోలీసులు కాల్చిచంపారని ఆయన పేర్కొన్నారు. ‘పోలీసులు ఎప్పుడు ఆయుధాలను ఉపయోగించి ప్రాణాలు తీసుకోవాలో చట్టంలో ఉన్నది. వీరు కరుడుగట్టిన నేరస్తులు. ఇలాంటి వ్యక్తులు పరారైనప్పుడు పోలీసులు గరిష్ఠమైన శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది’ అని ఏటీఎస్ చీఫ్ సంజీవ్ షమీ పేర్కొన్నారు. అయితే, పరారైన సిమీ కార్యకర్తలు మొదట కాల్పులు జరపడంతో తాము ఎదురుకాల్పుల్లో జరిపామని, ఈ ఎదురుకాల్పుల్లోనే వారు హతమయ్యారని పోలీసులు చెప్తుండగా.. వారి వాదనను విభేదిస్తూ షమీ వ్యాఖ్యలు చేశారు. రెండురోజుల కిందట సిమీ కార్యకర్తలు పోలీసుల చేతిలో చనిపోయిన విషయాన్ని మొదట ప్రకటించింది తానేనని, కాబట్టి ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసునని షమీ తెలిపారు. సిమీ కార్యకర్తల వద్ద ఆయుధాలు లేవని విషయంలో తన వాదనకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కాగా, భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని.. ఆ తర్వాత హతమైన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్కౌంటర్ ఘటనపై పలు ఆరోపణలు వస్తుండటంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) స్పందించింది. వీరి ఎన్కౌంటర్ ఘటనపై వివరణ ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీసులను ఎన్‌హెచ్చార్సీ ఆదేశించింది. -
జైల్లో బిర్యానీ తిని.. తప్పించుకుంటున్నారు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ రాష్ట్ర మంత్రులు.. భోపాల్ ఎన్కౌంటర్ ఘటనను సమర్థిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్నవారు ఏళ్లతరబడి జైళ్లలో చికెన్ బిర్యానీ తింటూ, తప్పించుకుని పారిపోయి మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చౌహాన్ అన్నారు. ఉగ్రవాదదాడి కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఎనిమిదిమంది నిషేధిత సిమి కార్యకర్తలు ఎన్కౌంటర్లో హతమైన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వచ్చాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. పోలీసుల చర్యలను మధ్యప్రదేశ్ సీఎం, మంత్రులు సమర్థిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకున్నాక ఖైదీలు పోలీసులపై కాల్పులు జరిపారని, దీంతో వారు ఎదురు కాల్పులు జరపక తప్పలేదని చెప్పారు. కాగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా జాతీయ మానవ హక్కుల సంఘం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
దుర్గమ్మ ఆలయాన్ని టార్గెట్ చేశారా..
ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరిక అప్రమత్తమైన దేవస్థానం, పోలీసు అధికారులు కొండపై నిఘా కట్టుదిట్టం ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక విజయవాడ : నిత్యం భక్తులతో జనసమ్మర్థంగా ఉండే ఇంద్రకీలాద్రిపై సిమీ ఉగ్రవాదులు కన్నేశారా.. దుర్గమ్మ ఆలయాన్ని టార్గెట్ చేశారా.. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికలు ఈ అనుమానాలను నిజం చేస్తున్నాయి. రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానాన్ని లక్ష్యంగా చేసుకుని సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్) దాడులకు తెగబడే అవకాశం ఉందంటూ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు రావడంతో సోమవారం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో అబుఫైజల్ గ్యాంగ్‌కు చెందిన సిమీ ఉగ్రవాదులు అస్లాం, ఇజాజ్ అహ్మద్ హతమైన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఫైజల్ సహా ఆరుగురు ఉగ్రవాదులు తప్పించుకోగా.. ఎన్కౌంటర్లో ఇద్దరు చనిపోయారు. చనిపోయిన ఇద్దరూ గతంలో విజయవాడలో జనసమ్మర్థంగా ఉండే కొన్ని ముఖ్యమైన స్థలాలపై రెక్కీ నిర్వహించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. రెండోసారి విజయవాడకు వస్తూనే ఎన్కౌంటర్లో చనిపోయారని, మిగిలిన నలుగురు ఉగ్రవాదులు రాజధాని ప్రాంతంలోనే తలదాచుకున్నారనే అనుమానాలు ఇంటిలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు. అధికారులు అప్రమత్తం... ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేవస్థానం ఈవో సీహెచ్ నర్సింగరావు వెంటనే దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్ రాఘవయ్యతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కమాండెంట్ నాగమల్లేశ్వరరావు, సివిల్ పోలీసు, సెక్యూరిటీ సిబ్బందితో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యల గురించి చర్చించారు. దేవస్థానంలో మూడు షిఫ్టుల్లోనూ కలిపి 113 మంది ఓపీడీఎస్ సిబ్బంది, 18 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, 20 మంది హోమ్‌గార్డులు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి వీరు సరిపోతారని, అయితే వీరు నిరంతరం నిఘాను ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. సెల్ఫోన్లపై నిషేధం! ప్రస్తుతానికి దేవస్థానంలో సెల్ఫోన్లను అధికారులు అనుమతిస్తున్నారు. అయితే సెల్ఫోన్లకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి భక్తులు అక్కడ పెట్టుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుందని పోలీసు, సెక్యురిటీ అధికారులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న డాగ్ చెకింగ్, భక్తుల బ్యాగుల చెకింగ్లను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అంతరాలయంలోకి భక్తుల బ్యాగులను అనుమతించకూడదనే నిబంధన మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు. దేవస్థానానికి వచ్చే దారులన్నింటిలోనూ రాత్రివేళల్లోనూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దేవస్థానంలో ఉన్న సీసీ కెమెరాలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తామని, అవసరమైతే మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని దేవస్థానం అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వానికి నివేదిక... విజయవాడ నగరంలో సిమీ ఉగ్రవాదుల జాడలు కనపడుతున్న నేపథ్యంలో దేవస్థానంలో తీసుకునే కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న రక్షణ చర్యలపై పోలీసు, దేవస్థానం అధికారులు ఒక ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం కోరిక మేరకే ఈ నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి సెక్యురిటీ పరంగా ఇంకా ఏదైనా సలహాలు, సూచనలు వస్తే వాటిని కూడా తక్షణం అమలు చేసేందుకు దేవస్థానం అధికారులు సిద్ధంగా ఉన్నారు. -
మోదీ హత్యకు సిమి కుట్ర?
రాయ్‌పూర్ : చత్తీస్ఘడ్ పోలీసుల విచారణలో ప్రధాని నరేంద్ర మోదీపై హత్యా ప్రయత్నానికి సంబంధించిన మరో్ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాది గుర్ఫాన్ వెల్లడిస్తున్న విషయాలు పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేసేందుకు సిమి ప్లాన్ చేసి విఫలమైనట్లు తెలుస్తోంది. అంబికాపూర్ లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీని హత్యచేసేందుకు ప్లాన్ చేసి, కొన్ని అనివార్య కారణాల వల్ల తన పథకాలను అమలు చేయలేకపోయినట్టుగా గుర్ఫాన్ పోలీస్ విచారణలో అంగీకరించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ఐజీ జేపీసింగ్ సమాచారం ప్రకారం ..జార్ఖండ్ పేలుళ్ళ సంఘటన తరువాత రాయ్‌పూర్ నుంచి పరారైన గుర్ఫాన్ అరేబియన్ సముద్రానికి సమీపంలో తలదాచుకున్నాడు. అక్కడ కొన్నాళ్లు కేర్ టేకర్‌గా పనిచేశాడు. అతను దుబాయ్‌లో ఉన్నపుడు అంతర్జాతీయ ఉగ్రవాది అబూ సలేంతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా మరి కొంతమంది సభ్యులను కలిసినట్టుగా అంగీకరించాడు. అంతేకాదు గుర్ఫాన్ సిమీ నేతల ఆధ్వర్యంలో నేపాల్‌లో జరిగిన న్యూ ఇయర్ గ్రాండ్ పార్టీకి కూడా హాజరైనట్టుగా పోలీసులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేరగాళ్లందరూ ఈ పార్టీకి హాజరైనా భారతీయనిఘా వ్యవస్థ కనుక్కోలేక పోయిన విషయాన్ని కూడా గుర్ఫాన్ పోలీసులకు తెలిపినట్టుగా తెలుస్తోంది. తన సహచరులు ఇజాయిద్దీన్, అస్లాం ను ఇండోర్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన తరువాత స్వయంగా గుర్ఫాన్ రాయ్‌పూర్ కోర్టులో లొంగిపోయాడు. అయితు గుర్ఫాన్ పోలీసుల విచారణకుసహకరిస్తున్నప్పటికీ, కీలక సమాచారాన్ని మాత్రం అందించడంలేదని ఐసీ వెల్లడించారు. జార్ఖండ్ పేలుళ్ల సూత్రధారులను తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
ఆ ముష్కరుల అడ్డా హైదరాబాదే!
చాదర్‌ఘాట్ పరిసరాల్లోనే నివాసం? సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్న పోలీసులు.. మదర్సాలపైనా దృష్టి హతమైన ఉగ్రవాదుల కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా జానకీపురం గ్రామ శివార్లలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ‘సిమి’ ఉగ్రవాదులు అస్లాం, ఇజాజ్‌లు హైదరాబాద్‌నే అడ్డా చేసుకున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు ధ్రువీకరించాయి. వీరు హైదరాబాద్‌లోనే మకాం ఏర్పరుచుకొని విజయవాడలో దోపిడీలకు పథకం వేసినట్లు భావిస్తున్న పోలీసులు హైదరాబాద్‌లో ఎక్కడ మకాం వేశారనే దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. చాదర్‌ఘాట్‌లో వారు బస్సు ఎక్కే సమయంలో ఆ ప్రాంతానికి ఎలా, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలను కనుక్కునేందుకు సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో కొన్ని మదర్సాలపైనా దృష్టి సారించారు. నల్లగొండ జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సిమి మాజీ అధ్యక్షుడు మహ్మద్ సలావుద్దీన్ మలక్‌పేటలో ఫర్నిచర్ షాప్ నిర్వహించేవాడు. సిమి ఉగ్రవాదులు సైతం చాదర్‌ఘాట్‌లో బస్సు ఎక్కడం, సలావుద్దీన్ నివాసం కూడా చాదర్‌ఘాట్‌కు ఆనుకునే ఉండటంతో ఈ ప్రాంతంపై పోలీసులు మరింత దృష్టి సారించారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి 2013 అక్టోబర్ 1న పారిపోయిన ఏడుగురు ఉగ్రవాదుల్లో అస్లాం, ఇజాజ్‌లు జానకీపురం ఎన్కౌంటర్లో మృతిచెందగా ఫైజల్, అబీద్‌లు గతేడాదే పోలీసులకు చిక్కారు. ఇక మిగిలిన మహబూబ్, అంజద్, జకీర్‌లు నేటికీ పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా హైదరాబాద్‌లోనే మకాం వేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరు జానకీపురం ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అతని కోసం వరంగల్, నల్లగొండ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ‘సిమి’కి కేంద్రంగా నల్లగొండ... ఉమ్మడి రాష్ట్రంలో సిమి బలపడటం వెనక నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు ఈ సంస్థలో కీలక పాత్ర పోషించారు. జిల్లాకు చెందిన సయ్యద్ సలావుద్దీన్ 1998లో ‘సిమి’ అఖిల భారత అధ్యక్షుడి స్థాయికి ఎదిగాకే ఈ సంస్థ తీవ్రవాద కార్యకలాపాలను ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో సిమి కార్యకలాపాల నిర్వహణకు నల్లగొండ జిల్లాను మూడో కేంద్రంగా నడిపించారు. గుజరాత్ మాజీ హోం మంత్రి హరీన్ పాండ్య హత్య కేసులో పాల్గొన్న అస్గర్ అలీ కూడా ఇదే జిల్లాకు చెందిన వ్యక్తే. కాగా, హైదరాబాద్‌లో గతంలో టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని పేల్చేసిన ‘హుజి’ ఉగ్రవాది అబ్దుల్ ఖాజా కూడా నల్లగొండ జిల్లాకు చెందినవాడే. కీలకం కానున్న కాల్‌డేటా... జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదుల నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇందులో కీలక సమాచారాన్ని రాబట్టారు. సెల్ఫోన్లలోని ఔట్‌గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్‌పై ఇప్పటికే ఆరా తీయడంతోపాటు ఫోన్లలో ముష్కరులు ఫీడ్ చేసుకున్న కొన్ని సెల్ నంబర్ల ఆధారంగా వారి చిరునామాలను గుర్తించి అనుమానితులను అదుపులోకి తీసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ బృందాలు పనిచేస్తున్నాయి. -
ఎక్కడిదీ సిమి?
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఇద్దరు సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌తో ఈ సంస్థ కార్యకలాపాలు మరోసారి సర్వత్రా చర్చనీయమయ్యాయి. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఎంఐ) పేరుతో ఇస్లాం మతవ్యాప్తే లక్ష్యంగా కొందరు యువకులు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ కేంద్రంగా 1977లో ఈ సంస్థను నెలకొల్పారు. భారత్‌ను ఇస్లాం దేశంగా మార్చాలనే సంకల్పంతో దేశంపైనే జిహాద్(పవిత్ర యుద్ధం) ప్రకటించింది సిమి! హింసాత్మక కార్యకలాపాల ద్వారా లక్ష్యసాధనకు ఉగ్రవాదాన్నే మార్గంగా ఎంచుకుంది. యూపీకి చెందిన ప్రొఫెసర్ మహమ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ దీని వ్యవస్థాపకుడు. మొదట్లో జమాతే ఇస్లామే హింద్ విద్యార్థి విభాగంగా ఆవిర్భవించిన సిమి.. 1981లో ఆ సంస్థతో సంబంధాలు తెంచుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నేరం కింద 14 ఏళ్ల కిందటే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశంలో పలు విధ్వంసక చర్యల్లో సిమి పేరు వినిపించింది. అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు, కాన్పూరు మత ఘర్షణల్లో సిమి ఉగ్రవాదుల ప్రమేయం బట్టబయలైంది. 2001లో ఈ సంస్థను నిషేధించాక మధ్యప్రదేశ్ నుంచి గుట్టుగా తమ కార్యకలాపాలను విస్తరించింది. నిషేధం తర్వాత ఆ రాష్ట్రంలోనే పోలీసులు దాదాపు 180 మంది మిలిటెంట్లను అరెస్టు చేయడమే సిమి విస్తరించిన తీరుకు అద్దం పడుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లోని పలు ఉగ్రవాద సంస్థలతో ఈ సంస్థకు సంబంధాలున్నాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతోనూ లింకులున్నట్లు పోలీసులు తేల్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సిమి చాపకింద నీరులా విస్తరించింది. సిమి తమ కార్యకలాపాలకు అవసరమయ్యే నిధుల సమీకరణకు ‘మాల్ ఏ ఘనీమత్’ పేరుతో యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో చనిపోయిన ఉగ్రవాదులు ఈ టీమ్‌లోని సభ్యులే. అందుకే వరుసగా బ్యాంకు దోపిడీ, నగల దోపిడీలపైనే ఈ ముఠా దృష్టి సారించింది. -
వాళ్లు సిమి ఉగ్రవాదులే
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో కాల్పులకు పాల్పడింది సిమి ఉగ్రవాదులేనని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జైలు నుంచి పరారైన అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా వీరిని నిర్ధారించినట్లు సమాచారం. ఈ దుండగులిద్దరూ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేసేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు వారి వేలిముద్రలు తీసుకొచ్చినట్లు రాష్ట్ర పోలీసుల సమాచారం. వారు మరి కాసేపట్లో ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలో ఉన్న తీవ్రవాదులుగా భావిస్తున్న వారి మృతదేహాలు పరిశీలించనున్నారు. మూడో ఉగ్రవాది కూడా నల్లగొండలోనే.. ఇక రైల్వే టికెట్ ఆధారంగా మూడో ఉగ్రవాది కూడా ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతడు నల్లగొండ జిల్లాలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. తుంగతుర్తి మండలం కుక్కడంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఒకరిని స్థానికులు ప్రశ్నించారని, అతడు హిందీలో మాట్లాడుతూ కనిపించడంతో అతడిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆ వెంటనే అతడు వరంగల్ జిల్లా పెముప్పారం వైపు అతడు పరారయినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు కుక్కడం పరిసరాల్లో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
అధికార లాంఛనాలతో నాగరాజు అంత్యక్రియలు
నల్లగొండ : నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం రసూల్ గూడలో కానిస్టేబుల్ నాగరాజు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. సూర్యాపేట కాల్పుల దుండగుల ఎన్కౌంటర్ నేపథ్యంలో వారితో శనివారం పోరాడి ప్రాణాలొదిలిన నాగరాజుకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు జరగనున్నాయి. దుండగుల తూటాలకు మృత్యు ఒడికి చేరిన కానిస్టేబుల్ నాగరాజు అంత్యక్రియలకు రాష్ట్రమంత్రులు హరీష్ రావు, జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి హాజరుకానున్నారు. -
అర్వపల్లిలో వేగంగా కూంబింగ్
నల్లగొండ: అర్వపల్లిలో పోలీసులు తీవ్రంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో హతమైన ముష్కరుల విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదని నిర్ణయించుకొని మరిన్ని అధారాలకోసం అణువణువూ జల్లెడ పడుతున్నారు. ఇద్దరు ముష్కరులు హతమవ్వగా వారికి చెందిన ఒక రైల్వే టికెట్ మూడో వ్యక్తి ఉండొచ్చనే అనుమానానికి తావివ్వడంతో అతడు ఎవరై ఉంటారు? ఎక్కడ ఉన్నాడు అనే వివరాలకోసం పోలీసులు గాలింపులు ప్రారంభించారు. అర్వపల్లిలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అర్వపల్లి దర్గాలో ముష్కరులు తల దాచుకున్నారన్న సమాచారం తెలిసిందే. దీంతో వారికి ఎవరైనా సహాయం చేసి ఉంటారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అణువణువు జల్లెడ పడుతున్నారు. అక్కడే మౌలానా అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, నిందితుల చిత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు పంపించాలని కూడా భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే పంచనామా పూర్తి చేసి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించిన దుండగుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనంతరం ఓ నాలుగు రోజులపాటు అక్కడే ఉంచనున్నారు. వారి తరుపున ఎవరైనా వస్తే వారికి అప్పగించాలని, లేదంటే పోలీసులే వారిని ఖననం చేయాలని భావిస్తున్నారు. -
ఖేల్ ఖతం
సూర్యాపేట కాల్పుల దుండగులు హతం నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ఎన్కౌంటర్ యూపీకి చెందిన అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా గుర్తింపు ప్రాణాలకు తెగించి మరీ కాల్చి మట్టుపెట్టిన పోలీసులు ఎదురుకాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందిన కానిస్టేబుల్ నాగరాజు తీవ్రంగా గాయపడ్డ ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్ధయ్య.. పరిస్థితి విషమం రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి గాయాలు.. కామినేనిలో చికిత్స సినీఫక్కీలో ఘటన, రెండున్నర గంటల చేజింగ్ తర్వాత ముష్కరులు హతం ముందు రెండుసార్లు ఎదురుపడ్డా ఆయుధాలు లేక చేతులెత్తేసిన పోలీసులు నలుగురు కానిస్టేబుళ్ల ధైర్యసాహసాలతో జానకీపురంలో ముగిసిన వేట సిమి’ ఉగ్రవాదులంటున్న పోలీస్ వర్గాలు.. ఇంకా గుర్తించలేదన్న డీజీపీ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆపరేషన్ ‘సూర్యాపేట’ ముగిసింది. రెండు రోజులుగా సాగిన ‘ఖేల్’ ఖతమైంది. నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డ దుండగులు హతమయ్యారు. జిల్లాలోని మోత్కూరు మండలం జానకీపురం గ్రామ శివారులో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ముష్కరులను పోలీసులు మట్టుబెట్టారు. వీరిని స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా గుర్తించారు. అలాగే సూర్యాపేట ఘటనలో ఎత్తుకెళ్లిన కార్బైన్ కూడా లభించడంతో బస్టాండ్‌లో కాల్పులు జరిపింది వీరేనని కూడా నిర్ధారణ అయింది. అయితే ఈ ఎన్కౌంటర్లో ఓ కానిస్టేబుల్ చనిపోయారు. ఆత్మకూర్(ఎం) పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నాగరాజు(28) ముష్కరుల బుల్లెట్లకు బలయ్యారు. ఆత్మకూర్(ఎం) స్టేషన్ ఎస్ఐ సిద్ధయ్య, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి కూడా గాయపడ్డారు. సిద్ధయ్య శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేస్తున్నారు. కాగా, సిద్ధయ్య భార్య ధరణి నిండుచూలాలు. భర్తను చూడటానికి వెళ్లగానే పురిటినొప్పులు రావడంతో ఆమెను కూడా శనివారం రాత్రి కామినేనిలోనే చేర్చారు. కాసేపటికి ఆమెకు బాబు పుట్టాడు. ఆద్యంతం సినీఫక్కీలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముష్కరులు హతమైనా కానిస్టేబుల్ చనిపోవడం, ఎస్ఐ ప్రాణాపాయ స్థితిలో ఉండటం విషాదం. ఉదయం అర్వపల్లి నుంచి మొదలు... బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిపి పరారవడం, వారికోసం పోలీస్ యంత్రాంగమంతా తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టడం తెలిసిందే. విస్తృతంగా తనిఖీలు జరుపుతుండడంతో దుండగులు నల్లగొండ జిల్లా దాటి వెళ్లలేకపోయారు. ఈ రెండు రోజులు ఎక్కడ తలదాచుకున్నారో తెలియకపోయినా శనివారం ఉదయం అకస్మాత్తుగా బయటకువచ్చారు. సూర్యాపేటకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్వపల్లి దర్గా ప్రాంతంలో కనిపించారు. ఉదయం 6 గంటలప్పుడు అర్వపల్లిలోని ముదిరాజ్ కాలనీ మీదుగా సీతారాంపురంవైపు నడుచుకుంటూ వెళ్లారు. తమ వద్ద ఉన్న కార్బైన్‌ను దుప్పటిలో, నాటు తుపాకీని కవరులో పెట్టుకుని వెళుతున్న వీరిని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో తుంగతుర్తి సీఐ గంగారాం ఓ ప్రైవేటు వాహనంలో గాలింపు చే పట్టారు. సీతారాంపురం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో దుండగులున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే సీఐ గంగారాం వారిపైకి కాల్పులు జరిపారు. ఆరు రౌండ్ల కాల్పుల అనంతరం ఆయన తుపాకీ పేలలేదు. దాంతో దుండగులు ఎదురుకాల్పులకు దిగారు. ఇతర సిబ్బంది వద్ద ఆయుధాలు లేకపోవడంతో పోలీసులు సీతారాంపురంవైపు వెళ్లిపోయారు. దుండగులు కాలువ నుంచి బయటపడి మళ్లీ అర్వపల్లికి వచ్చారు. బస్టాండ్ సమీపంలో లింగయ్య అనే వ్యక్తిని ఆపి అతని బజాజ్ డిస్కవరీ బైక్ లాక్కుని తిరుమలగిరివైపు వెళ్లారు. నాగారం క్రాస్‌రోడ్డు వరకు ప్రయాణించి ఫణిగిరి స్టేజీ నుంచి ఈటూరు మీదుగా అనంతారం రోడ్డుపైకి చేరుకున్నారు. అక్కడ రోడ్డు పక్కన ఓ దుకాణంలో పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికి ఉదయం 7:30 అయింది. అప్పటికే సమాచారం అందుకున్న మోత్కూరు ఎస్ఐ పులిందర్భట్ సిబ్బందితో అనంతారం మీదుగా వెళ్తూ, పెట్రోల్ పోయించుకుంటున్న దుండగులను గుర్తించారు. అప్పటికే వారిని దాటిపోవడంతో పోలీసులు వాహనాన్ని ఆపి కిందకు దిగారు. తమవద్ద ఆయుధాలు లేకపోవడంతో కర్రలు, రాళ్లు పట్టుకుని గట్టిగా అరుస్తూ, గ్రామస్తులను ఇళ్లలోకి వెళ్లాలంటూ హెచ్చరించారు. అది చూసిన దుండగులు తమ ఆయుధాన్ని బయటకు తీసి భుజానికి తగిలించుకున్నారు. దాన్ని పోలీసులకు చూపుతూ మోత్కూరువైపు బైక్‌పై వెళ్లారు. మోత్కూరు పీఎస్‌కు చెందిన అనిల్, రమేశ్ ధైర్యంగా మరో వాహనంపై వారిని వెంబడించారు. ఆయుధాల్లేకపోయినా వారిని అనుసరించారు. అనంతారం నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని చిర్రగూడూరు వరకు వెళ్లి దుండగులు కుడివైపుమళ్లారు. పోలీసులు గ్రామస్తులను పోగుచేసుకుని వారిని వెంబడించారు. మార్గంలో వాగు రావడం, ఇసుకలో బైక్ కదలకపోవడంతో దుండగులు దాన్ని వదిలి వాగులో దాక్కున్నారు. ఇద్దరు పోలీసులతో పాటు యువకులు రావడంతో వారిపై కాల్పులు జరిపారు. దాంతో అంతా చెట్ల చాటున దాక్కున్నారు. యువకులు తెచ్చిన ఓ వాహనంపై ముష్కరులిద్దరూ జానకీపురం రోడ్డెక్కారు. ఇక్కడే డెత్‌స్పాట్... జానకీపురం వైపునకు బైక్‌పై వెళుతున్న దుండగులు ఎదురుగా ఎడ్లబండి రావడంతో ఆగిపోయారు. ఆ బండి వెనుకనే ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్ధయ్య తన సిబ్బందితో కలిసి మరో వాహనంలో వస్తున్నారు. దగ్గరకు వచ్చేంతవరకు ఒకరినొకరు గుర్తించలేదు. అకస్మాత్తుగా పోలీసులు కనిపించడంతో దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. డ్రైవర్ సీటులో ఉన్న కానిస్టేబుల్ నాగరాజు నుదిటిలోకి బుల్లెట్ దిగడంతో అక్కడికక్కడే చనిపోయారు. ముందు సీటులో ఉన్న ఎస్ఐ సిద్ధయ్యకు పొట్ట, మెదడు భాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వాహనం వద్దకొచ్చిన దుండగులు.. ఆయుధాలిస్తే వదిలేస్తామని హిందీలో చెప్పారు. వెనుక సీట్లో ఉన్న కానిస్టేబుల్ మధు ఆయుధాలిస్తున్నాం ఉండమని చెబుతూనే ఒక్కసారిగా తనవైపున్న డోర్‌తో ఇద్దరినీ గట్టిగా గుద్దాడు. వారు పక్కనున్న చెట్లలో పడిపోవడంతో ఒక్క ఉదుటున వారిపైకి దూకాడు. వారితో పెనుగులాడుతున్న సమయానికే పోలీసులు కేకలు వేశారు. వారి వాహనానికి 5 మీటర్ల దూరంలో రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి దిగి కాల్పులు ప్రారంభించారు. దుండగులు ఆయనను కూడా టార్గెట్ చేశారు. ఒక బుల్లెట్ ఆయన లాఠీని రాసుకుంటూ వెళ్లిపోయింది. మరో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు... సీఐ గన్‌మన్ జానకిరాం కార్బన్‌ను తీసుకుని దుండగులపై కాల్పులు జరిపాడు. ఎక్కడా వారికి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా సమయస్ఫూర్తితో కాల్పులు జరపడంతో ఇద్దరూ అక్కడే చనిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మోత్కూరు కానిస్టేబుళ్లు అనిల్, రమేశ్.. దుండగులను వెంబడించడం, గతంలో గ్రేహౌండ్స్‌లో పనిచేసిన ధైర్యాన్ని మధు ప్రదర్శించడం, వెంకటేశ్వర్లు సమయస్ఫూర్తితో తుపాకీ ఎక్కుపెట్టడంతో ఉదయం 8 గంటలకు పోలీసుల వేట ముగిసింది. తమవారిని పొట్టనబెట్టుకున్న దుండగులను పోలీసులు కసితీరా కాల్చిచంపారు. దుండగుల శరీరం నిండా బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం... నాగరాజు మృతదేహాన్ని, సిద్ధయ్యను ఆస్పత్రికి తరలించారు. ఆయుధాలు లేకుండా ఆపరేషన్! ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. సాయుధులైన దుండగులను ఎదుర్కొనే ప్రణాళిక సరిగ్గా లేకపోవడంతో మరో పోలీసు ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది. తుంగతుర్తి సీఐకి దుండగులు తారసపడిన సమయంలోనే ఇతర పోలీసుల దగ్గర ఆయుధాలున్నా, కనీసం సీఐ గన్‌మెన్ అందుబాటులో ఉన్నా ఎస్సారెస్పీ కాల్వలోనే దుండగులు హతమయ్యేవారు. అనంతారంలో మోత్కూరు పోలీసుల వద్ద ఆయుధాలు లేకే దుండగులు బతికిపోయారు. సూర్యాపేట ఘటన సమయంలో కూడా అనుమానితులను విచారించే సమయంలో పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఇలా ఆయుధాలు లేకుండా ఆపరేషన్‌లో పాల్గొనడం పట్ల పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలికి డీజీపీ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన దుండగుల మృతదేహాలను పరిశీలించారు. ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఆధారాలను సేకరించింది. కాగా, దుండగులను ఇంకా గుర్తించలేదని డీజీపీ చెప్పారు. పాత నేరస్తుల ఫొటోల ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మృతదేహాల వద్ద ఆయుధాలతో పాటు బస్సు టికెట్లు మాత్రమే లభించాయన్నారు. ఇతర ఆధారాలేవీ లభ్యం కాకపోవడంతో వెంటనే గుర్తించలేకపోయామన్నారు. దీనిపై ఆదివారం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ప్రాణాలకు తెగించి.. భయమనేదే తెలియదన్నట్టు పేట్రేగిపోయిన ఇద్దరు దుండగులను హతమార్చడానికి పోలీసులు ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. గ్రేహౌండ్స్‌లో పనిచేసిన కానిస్టేబుల్ మధు చూపించిన ధైర్యసాహసాలు పోలీసు శాఖ పరువు నిలబెట్టాయనే చెప్పాలి. అతనే ఆ సాహసం చేయకుంటే మళ్లీ దుండగులకు ఆయుధాలు అప్పగించడమో, అంతా చనిపోవడమో జరిగేది. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తుపాకీని పేల్చడంలో 2 సెకన్లు ఆలస్యమైనా దుండగులు ఇంకో రౌండ్ కాల్పులు జరిపేవారని, అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులే టార్గెట్! రోడ్లపై కాలినడకన, వాహనంపై సంచరించిన దుండగులు తమ చేతిలో ఆయుధాలున్నా సామాన్య ప్రజలను మాత్రం ఏమీ చేయలేదు. కేవలం పోలీసులు ఎదురుపడ్డప్పుడు మాత్రం ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరు కిరాయి హంతకులా లేక ఉగ్రవాదులా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఉగ్రవాదులైతే ఇలా బైక్‌ల మీద తిరుగుతూ హల్చల్ చేయరనే చర్చ కూడా జరుగుతోంది. కానీ, పోలీసులు మాత్రం ఈ దుండగులకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయని అంటున్నారు. వీరు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా జైలు నుంచి తప్పించుకున్న ఏడుగురి ముఠాలోని సభ్యులని చెబుతున్నారు. -
పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో జరిగిన రెండు దుర్ఘటనలపై ప్రభుత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనల్లో పోలీసులు మరణిస్తే పరిహారమిచ్చి తమ పని అయిపోయిందని ప్రభుత్వం అనుకొంటే సరిపోదన్నారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. పోలీసు కుటుంబాలకు, గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కాల్పులు, ఇమాంపేట వద్ద గెయిల్ పరిశ్రమ గ్యాస్‌పైప్‌లైన్ లీకేజీలో ఇద్దరు మృతి సంఘటనలపై లోతైన అధ్యయ నం అవసరమన్నారు. పోలీసుల ధైర్య సాహసాలు అభినందించాల్సిందేనన్నా రు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిం దని చెప్పారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ఉగ్రవాదులేనా..?
సాక్షి, హైదరాబాద్: జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో హతమైన ముష్కరులు ఉగ్రవాది అబు ఫైజల్ ముఠా సభ్యులని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులతో పాటు నిఘావర్గాలు ఉగ్రవాద కోణంలో దర్యాప్తు ప్రారంభించాయి. ముఖ కవళికల ఆధారంగా ఎన్కౌంటర్లో మృతి చెందిన దుండగులను అబు ఫైజల్ గ్యాంగ్ సభ్యులైన అస్లాం, జాకీర్‌గా ఒక నిర్ధారణకు వచ్చినా... పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)తో సంబంధాలున్న అబు ఫైజల్ ముఠా... దేశంలో పలుచోట్ల బాంబు పేలుళ్లతో పాటు బ్యాంకు దోపిడీలకు పాల్పడింది. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పిం చుకుని తిరుగుతున్న ఈ ఉగ్ర ముఠా సభ్యులు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో ఉన్నారు. -
పోలీసుల త్యాగం గొప్పది
కాల్పులు, ఎన్కౌంటర్ ఘటనలపై కేసీఆర్ స్పందన అమరవీరులుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం సాక్షి, హైదరాబాద్: దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పోలీసు కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజు, హోంగార్డు మహేష్‌లది గొప్ప త్యాగమని సీఎం కేసీఆర్ కొనియాడారు. వీరు అమరవీరులుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సూర్యాపేటలో కాల్పులు, అనంతరం చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసులు స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించారని సీఎం అభినందించారు. ఈ రెండు ఘటనల్లో గాయపడిన సీఐలు మొగిలయ్య, బాల గంగిరెడ్డి, ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్ధయ్య, హోంగార్డు కిశోర్ అత్యంత సాహసోపేతంగా దుండగులతో పోరాడారని ప్రశంసించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన కాల్పులతో పాటు మోత్కూరు మండలం జానకీపురం వద్ద శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ ఘటనలపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనల్లో మృతిచెందిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం చేయిస్తామన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చు అయినా సరే వెనకాడకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పోలీసులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
ఆ ముష్కరులు వీళ్లే
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో హతమైన ఇద్దరు తీవ్రవాదులతో పాటు వారి సహచరుల ఫోటోలు బహిర్గతమయ్యాయి. మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి 2013లో తప్పించుకున్న ఐదుగురు ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దులు సిమీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరిలో అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్‌లు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీ పురం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. వీరు కొద్ది రోజులు కిందటి వరకు నెల్లూరు జిల్లా తడని కేంద్రంగా చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని నిఘా వర్గాలు ఇది వరకే రాష్ట్ర పోలీసులని హెచ్చరించాయి. 2014 మే లో జరిగిన చెన్నై రైల్వే స్టేషన్ బాంబు పేలుళ్లు, 2014 ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు దొంగతనం, మే 2014 లో ఉత్తర్ ప్రదేశ్ బిజ్నూర్ పేలుళ్లలో వీరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
తడలో ఉగ్రవాదుల షెల్టర్?
నల్లగొండ: పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందిన వ్యక్తులు గతంలో నెల్లూరు జిల్లా తడలో షెల్టర్ తీసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్‌లకు చెన్నై పేలుళ్లతో కూడా సంబధం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల ఫోటోలను నెల్లూరు పోలీసులకు పంపి వారి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో తెలంగాణ పోలీసు యంత్రాంగం ఉంది. సిమీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పోలీసులు జనవరిలోనే హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితులు తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్నారని నిఘావర్గాలు అప్పుడే సమాచారం అందించాయి. దీంతో జనవరిలోనే ఏపీ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తప్పించుకున్న ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దు ఫోటోలను తమిళనాడు పోలీసులు అప్పుడే తడ పోలీసులకు పంపారు. దాంతో శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. దీంతో జనవరిలోనే శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. తాజాగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరిలో ఇద్దరు మరణించడం సంచలనం సృష్టించింది. -
తీగ లాగుతుంటే..డొంక కదులుతోంది..
నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసులు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇద్దరు దుండగుల నేర చరిత్ర ఒక్కొక్కటిగా బయటకు పడుతోంది. మృతులు అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్‌కు సిమీ ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలో వీరి ఇరువురిపై అనేక కేసులు ఉన్నాయి. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఫైజల్ గ్యాంగ్‌లో అస్లాం, జాకీర్ హుస్సేన్ కీలకం. గతంలో మధ్యప్రదేశ్ ఖండ్వా జైలు నుంచి వీరిద్దరు పరారైనట్లు తెలుస్తోంది. కాగా, దుండగులు ఇద్దరిని ఇంకా ఉగ్రవాదులుగా గుర్తించలేదని, విచారణ కొనసాగుతుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. వీరిద్దరి నేర చరిత్ర పరిశీలిస్తే.... ముంబై యాంటీ టెర్రరిస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో అస్లం అయూబ్, జాకీర్ హుస్సే న్ 2007 కేరళలో ఉగ్రవాద సాయుధ శిబిరం నిర్వహించిన గ్యాంగ్ ఖండ్వా పోలీస్ స్టేషన్లో 2009, 2010 వీరిపై కేసులు నమోదు 2010లో భోపాల్‌లోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో చోరీ చిన్నప్పటి నుంచే నేరాలకు అలవాటు పడ్డ అస్లాం మహారాష్ట్ర, తమిళనాడు బాంబు పేలుళ్లతో సంబంధం 2013లో నరేంద్ర మోదీ ర్యాలీలో బాంబు పేల్చింది ఈ ముఠానే 2014 అక్టోంబర్ కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడింది ఈ ముఠా సభ్యులే. -
ఉగ్రవాదుల కలకలం: శ్రీహరికోటలో హై అలర్ట్
-
48 అకౌంట్ల ద్వారా ఉగ్రవాదుల నిధుల సేకరణ
కరీంనగర్ : చొప్పదండి బ్యాంకు దోపిడీ కేసుకు సంబంధించి దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. 48 బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఉగ్రవాదులు నిధులు సేకరించినట్లు వారి దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంక్ చోరీ సొత్తు ద్వారా భారీ ఆస్తులు కూడగట్టినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సహా ఉద్యోగులందర్నీ తుపాకీతో ఓ గదిలో బంధించిన దుండగులు లాకర్లో ఉన్న రూ.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీకి పాల్పడింది అబు ఫైజల్ గ్యాంగ్‌గా విచారణలో తేలింది. చోరీ సొమ్ముతో ఈ గ్యాంగ్ హైదరాబాద్‌తోపాటు తిరుపతిలోనూ కొన్ని స్థలాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈడీ సైతం అప్రమత్తమై దీనిపై విచారణ జరుపుతోంది. -
ఉగ్ర పేలుళ్లకు ‘చొప్పదండి సొమ్ము’
పక్కా కుట్రపన్నిన జమాత్ అల్ ముజాహిదీన్ బ్యాంకు దోపిడీకి పాల్పడింది అబు ఫైజల్ గ్యాంగ్ బుర్ద్వాన్ పేలుడు ఘటనలో దొరికిన నోట్ల కట్టలు ‘ఉగ్ర’ నగదుతో హైదరాబాద్, తిరుపతిలో స్థలాలు ఆర్థిక సహకారంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కీలకం లోతుగా ఆరా తీస్తున్న దర్యాప్తు అధికారులు, ఈడీ సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఓ ముష్కరమూక తప్పించుకుంది... కొన్ని నెలలకే కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంకు దోపిడీకి పాల్పడింది... ఆ సొమ్మును వినియోగించి హైదరాబాద్‌తోపాటు తిరుపతిలోనూ కొన్ని స్థలాలు కొనుగోలు చేసింది... అదే సొమ్ముతో దీపావళి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పేలుళ్లకు పథక రచన కూడా చేసింది... అయితే బాంబుల తయారీకి యత్నిస్తుండగా జరిగిన పేలుడుతో ఈ కుట్ర మొత్తం బట్టబయలైంది. ఈ నెల మొదటివారంలో పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో జరిగిన ఈ పేలుడు కేసు దర్యాప్తులో పలు కీలక కోణాలు వెలుగులోకి వచ్చాయి. జమాత్ అల్ ముజాహిదీన్ పేరుతో కొత్తగా ఏర్పడిన ఈ మాడ్యూల్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈడీ సైతం అప్రమత్తమై దీనిపై లోతుగా ఆరా తీస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివీ... అబు ఫైజల్ నేతృత్వంలో జైల్ బ్రేక్... ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ ముంబైలో ఉన్న జుహూ కేంద్రంగా కార్యకలాపాలు సాగించాడు. నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) మాడ్యూల్‌కు చెందిన ఇతడు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి గత ఏడాది అక్టోబర్ 1న మరో ఆరుగురితో(మహబూబ్, అంజాద్, అస్లం, ఎజాజ్, జకీర్, అబిద్) కలసి పరారయ్యాడు. ఇది జరిగిన నాలుగు గంటల్లోనే వారిలో ఒకడైన అబిద్ చిక్కగా మిగతా వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనేక ప్రయత్నాల తరవాత డిసెంబర్లో మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో అబు ఫైజల్ చిక్కాడు. పరారీలో ఉన్న మిగిలిన ఐదుగురూ మరికొందరితో కలసి కొత్తగా జమాత్ అల్ ముజాహిదీన్ పేరుతో కొత్త మాడ్యూల్ ఏర్పాటు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా, బంగ్లాదేశ్‌కు చెందిన హుజీ-బి, దేశవాళీ సంస్థ ఇండియన్ ముజాహిదీన్లలోని ఉగ్రవాదులతో ఇది ఏర్పాటైంది. దీపావళి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఈ మాడ్యూల్ అందుకు అవసరమైన సొమ్ము కోసం దోపిడీల బాటపట్టింది. కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు సానుభూతిపరుల సహకారంతో ఆ జిల్లాలో కొంతకాలం బస చేసిన ఉగ్రవాదులు అనేక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. చివరకు చొప్పదండిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్‌గా చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 1న పంజా విసిరారు. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సహా ఉద్యోగులందర్నీ తుపాకీతో ఓ గదిలో బంధించిన దుండగులు లాకర్లో ఉన్న రూ.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పేలుడుతో బయటపడిన భారీ కుట్ర... పశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్‌లోని ఖాగ్రాఘర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఈ నెల 2న భారీ పేలుడు సంభవించింది. స్థానిక టీఎంసీ నేతలకు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కొందరు భారీ ఎత్తున బాంబుల్ని తయారు చేస్తుండగా వాటిలో కొన్ని పేలిపోయాయి. ఈ ఘటనలో బాంబులు తయారు చేస్తూ మరణించిన వ్యక్తిని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్‌లో ఒకడిగా గుర్తించారు. ఘటనా స్థలి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదుపై చొప్పదండి ఎస్బీహెచ్ బ్యాంక్ లేబుళ్లు, ముద్రలు సైతం ఉన్నాయి. అదే ప్రాంతంలో 55 పేలని బాంబుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు.. హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్‌లతో పాటు మరో ఇద్దరు మహిళలు రజియా బీబీ, అలీమా బీబీలను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్లో సెప్టెంబర్ 12న ఇదే తరహా పేలుడు సంభవించింది. ఈ ఇంటిలో బాంబులు తయారు చేస్తున్నది ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న వారిగా దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అక్కడ-ఇక్కడ పేలని బాంబులు ఒకే మెకానిజంతో ఉండటంతో ఒకరి పనిగా స్పష్టమైంది. విచారణలో తిరుపతి, హైదరాబాద్ ప్రస్తావన.. బుర్ద్వాన్ పేలుడు కేసులో దర్యాప్తు అధికారులు అరెస్టు చేసిన నిందితుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీపావళికి ఈ మాడ్యూల్ దేశవ్యాప్తంగా ఏకకాలంలో పేలుళ్లకు కుట్రపన్నినట్లు వెల్లడైంది. ఈ ఉగ్రవాద సంస్థకు పరోక్షంగా ఆర్థిక సహకారం అందిస్తున్న వారిలో హైదరాబాద్‌లో స్వచ్ఛంద సంస్థ ముసుగులో నిధుల సమీకరణ చేస్తున్న ఓ మహిళ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థ సభ్యులు తలదాచుకోవడంతోపాటు బాంబులు తయారు చేయడానికి వినియోగించే విధంగా స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్‌తో పాటు తిరుపతి పరిసరాల్లోనూ కొన్ని స్థలాల్ని కొనుగోలు చేయడానికి యత్నించి నట్లు వెలుగులోకి వచ్చింది. బుర్ద్వాన్-చొప్పదండి లింకు వెలుగులోకి రావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు మూడు రోజుల క్రితం చొప్పదండి వెళ్లారు. స్థానిక పోలీసుల నుంచి ఆ కేసు వివరాలతో పాటు అప్పట్లో సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజ్‌ను సేకరించి విశ్లేషిస్తున్నారు. ఆందోళనకరంగా మారిన ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, ఈడీ లోతుగా ఆరా తీస్తున్నాయి. చొప్పదండి బ్యాంకు దోపిడీలో హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్, రజియా బీబీ, అలీ మా బీబీల పాత్రను అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. -
నగరంలో నిషేధిత సిమీ ఉగ్రవాదుల అరెస్ట్
హైదరాబాద్: నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) సంస్థకు చెందిన ఉగ్రవాదులను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన సా ముదాసిర్, సోహెబ్ లుగా పోలీసులు గుర్తించారు. సా ముదాసిర్ గతంలో సిమీలో పనిచేశారు. ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన మన్సూర్ ఆలీకి సోహెబ్ సహచరుడని పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా జిహద్ ప్రచారం నిర్వహిస్తున్న సాముదాసిద్, సోహెబ్ లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఫేస్ బుక్ ద్వారా పాకిస్థాన్ కు చెందిన అబూ సైఫ్, కమ్రాన్ షాలతో చాటింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారత దేశంలో బాంబులతో విధ్వంసం సృష్టించాలని సాముదాసిర్, సోహెబల్ లను ఫేస్ బుక్ చాటింగ్ లో అబూసైఫ్, కమ్రాన్ షాలు కోరినట్టు పోలీసులు వెల్లడించారు. -
మళ్లీ సిమి సెగ!
న్యూఢిల్లీ: ఎన్నో ఉగ్రవాద దాడులతో ప్రమేయమున్న భారత ఇస్లామిక్ విద్యార్థుల ఉద్యమ (సిమి) సంస్థ..ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సాయంతో మళ్లీ విస్తరణకు యత్నిస్తోందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. పాకిస్థాన్ జాతీయుడు వకాస్ సహా పలువురు ఐఎం సభ్యుల అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు ఇది నిధులు సేకరిస్తున్నట్టు నిఘా వర్గాలు గ్రహించాయి. ఢిల్లీ సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టడానికి సిమి ప్రయత్నిస్తోందని జియా ఉర్ రెహమాన్ ఎలియాస్ వకాస్ పోలీసుల విచారణలో వెల్లడిం చారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలోనే ఉన్న ఇతడు, సిమిలో చురుగ్గా పని చేస్తున్న వారి వివరా లు కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక ఉగ్రవాద స్థాపనకు నిధుల కోసం బ్యాంకులను దోపిడీ చేయాలంటూ ముస్లిం యువకులను ప్రేరేపించిన సిమి సభ్యుడు అబూ ఫైజల్ ఎలియాస్ ‘డాక్టర్’తోనూ వకాస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు బయటపడింది. ‘డాక్టర్’ ఇది వరకే మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఐదుగురు సిమి కార్యకర్తలతోపాటు తప్పించుకున్నాడు. ఇతణ్ని పోలీసులు తిరిగి గత డిసెంబర్లో అరెస్టు చేశారు. మిగతా ఐదుగురు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. జైలు నుంచి తప్పించుకోవాలన్న కుట్రకు కూడా ఇతడే సూత్రధారని విచారణలో వెల్లడయింది. ఉగ్రవాద సంస్థకు నిధుల కోసం ‘డాక్టర్’ బృందం నర్మదలోని గ్రామీణబ్యాంకులో 2009లో దోపిడీ జరిపింది. దేవస్, ఇటార్సీ బ్యాంకు దోపిడీలతోనూ ఇతనికి సంబంధం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇతడు ఢిల్లీలో ఎటువంటి దాడులకూ పాల్పడకపోయినా, ఉగ్రవాద సంస్థలకు ఇతడు నిధులు సమకూర్చాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు. 2011లో అరెస్టు కాకముందు ‘డాక్టర్’ ఐంఎ సభ్యులతో సన్నిహితంగా మెలిగాడు. పాక్ నుంచి ప్రోత్సాహం నిర్బంధం కారణంగా చెల్లాచెదురైన సిమి కార్యకర్తలంతా తిరిగి ఒక్కటయ్యేందుకు చర్యలు తీసుకోవాలని పాక్‌లోని ఐఎం అగ్రనాయకులు భారత్‌లోని తమ రహస్య సభ్యులకు సూచించినట్టు తెలిసింది. ఇలా మళ్లీ సంఘటితంగా మారిన సిమి కార్యకర్తలు బ్యాంకు దోపిడీలకు పునఃప్రారంభిస్తారని దర్యాప్తు సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. 2010కి ముందు సిమి కార్యకర్తలు దక్షిణాది రాష్ట్రాల్లో పలుచోట్ల బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు. ‘గతంలో సిమిలో పనిచేసిన వారందరితోనూ ఐఎం కార్యకర్తలు మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నారు. సంస్థ లో చేరాల్సిందిగా ముస్లిం యువతను ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారిపై ఎక్కువ గా దృష్టి సారిస్తున్నారు’ అని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఐజాజుద్దీన్, అస్లాం, జాకీర్ హుస్సే న్, షేక్ మెహబూబ్, ఇక్రార్ను మళ్లీ అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు నిఘా సంస్థల సాయంతో ప్రత్యేకంగా గాలిస్తున్నారు. ఈ ఐదుగురు మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్ వాసులని తేలింది. ఈ విషయ మై మరింత సమాచారం సేకరించేందుకు ఢిల్లీ పోలీసు స్పెషల్‌సెల్ వకాస్‌ను తన కస్టడీలోకి తీసుకుంది. సిమి 1977లో అలీగఢ్‌లో ఏర్పాటయింది. 2002లో సిమిని నిషేధించకముందు మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు, ముఖ్యప్రాంతాల్లో దీనికి కార్యకర్తలు, కార్యాలయాలు ఉండేవి. ఇస్లామిక్ మతప్రచారం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం దీని ప్రధాన లక్ష్యాలు. సిమి అధ్యక్షుడు షహీద్ ఫలాహీ 9/11 దాడుల కేసులో అరెస్టు కావడంతో నిఘా వర్గాలు దీనిపై దృష్టి సారించాయి. నిషేధం తరువాత 1,200 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. 2010లో ఏర్పడిన ఐఎం సిమి అనుబంధ సంస్థేనని పోలీసులు అంటున్నారు. పలు పేలుళ్ల ఘటనలతో సిమి, ఐఎంకు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. సిమి కార్యకర్త అరెస్టు భోపాల్: సిమిలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న గుల్రేజ్ అలీని మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు భోపాల్ రైల్వే స్టేషన్లో ఆదివారం అరెస్టు చేశారు. విశేషమేమంటే ఢిల్లీ పోలీసులు ‘డాక్టర్’ను (అబూ ఫైజల్) ఆదివారమే భోపాల్‌కు తీసుకెళ్లారు. ఇతణ్ని తిరిగి తీసుకెళ్లడానికి అక్కడ వేచిచూస్తున్న ఏటీఎస్ పోలీసులకు అలీ కనిపించాడు. ఇతనిపై రూ.15 వేల రివార్డు కూడా ఉంది. నిందితుడికి స్థానిక కోర్టు మే ఐదు వరకు పోలీసు కస్టడీ విధించింది. అలీపై ఇది వరకే పలు కేసులు నమోదయ్యాయి.