హైదరాబాద్‌ వచ్చి వెళ్లిన ఆసియా అంద్రాబీ | Asiya Andrabi Visit Hyderabad ? | Sakshi
Sakshi News home page

నగరంతో లింకులు

Published Sat, Jul 7 2018 11:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Asiya Andrabi Visit Hyderabad ? - Sakshi

ఆసియా అంద్రాబీ , ఐసిస్‌ త్రయం

సాక్షి, సిటీబ్యూరో: దేశద్రోహం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఢిల్లీ యూనిట్‌ అధికారులు శుక్రవారం వివాదాస్పద కాశ్మీర్‌ వేర్పాటువాద సంస్థ దుక్త్రాన్‌–ఏ–మిల్లత్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆసియా అంద్రాబీని అరెస్టు చేశారు. ఈమెకు నగరంతోనూ కొన్ని లింకులు ఉన్నాయి. 2014లో హైదరాబాద్‌కు వచ్చి వెళ్ళడంతో పాటు 2015లో నగరంలో చిక్కిన ‘ఐసిస్‌ త్రయం’ సైతం కాశ్మీర్‌ వెళ్లి ఈమెను కలవడానికి ప్రయత్నాలు చేశారు. నగరానికి వచ్చిన సందర్భంలో ఆసియా అప్పట్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) జాతీయ మాజీ అధ్యక్షుడు సయ్యద్‌ సలావుద్దీన్‌ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళింది.

తాజాగా ఆమెతో పాటు మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్టు చేయడంతో విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఐసిస్‌లో చేరేందుకు సిరియా వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్న త్రయం అబ్దుల్లా బాసిత్, సయ్యద్‌ ఒమర్‌ ఫారూఖ్‌ హుస్సేనీ, మాజ్‌ హసన్‌ ఫారూఖ్‌లను 2015 డిసెంబర్‌లో సిట్‌ పోలీసులు నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ‘సిమి’ సలావుద్దీన్‌కు బంధువులైన వీరు నాగ్‌పూర్‌ నుంచి విమానంలో శ్రీనగర్‌ వెళ్లి ఆసియాను కలవాలనే లక్ష్యంతో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. నల్లగొండలో పుట్టి సిమిలో చేరి జాతీయ స్థాయికి ‘ఎదిగి’ ఆ సంస్థ మాజీ చీఫ్‌ సయ్యద్‌ సలావుద్దీన్‌ సలార్‌కు జాతీయ స్థాయిలో సంబంధాలు ఉండేవి. నల్లగొండకు చెందిన సలావుద్దీన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. బతుకుతెరువు కోసం ముంబై వెళ్లిన నేపథ్యంలో అక్కడి సిమి క్యాడర్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 1998 వరకు నార్తన్‌ రీజన్‌ కమాండర్‌గా పని చేస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో సిమి కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు.

ఆపై రెండేళ్ల పాటు సిమికి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో జాతీయ స్థాయిలో వివాదాస్పద సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేస్తుకున్నాడు. అప్పట్లోనే ఇతడికి అంద్రాబీతో పరిచయం ఏర్పడింది. 2011లో దుబాయ్‌ నుంచి భారత్‌కు వస్తూ అరెస్టు అయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఇతడు నగరంలో నివసించాడు. 2014 అక్టోబర్‌లో నల్లగొండ నుంచి కారులో వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న అంద్రాబీ హైదరాబాద్‌కు వచ్చి అతడి కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళారు. ఈమె కుమారుడు సైతం నగరంలోని ఓ విద్యాసంస్థలో చదువుకున్నాడు. ఈ నేపథ్యంలోనే 2012లోనూ అంద్రాబీ ఓసారి హైదరాబాద్‌ వచ్చివెళ్ళారని సమాచారం. పాక్‌ అనుకూల వాదిగా ముద్రపడ్డ అంద్రాబీ 2015 సెప్టెంబర్‌లో కాశ్మీర్‌లో పాకిస్థాన్‌ జెండాలను ప్రదర్శించి వివాదాస్పదమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన శ్రీనగర్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2016లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆసియా సలావుద్దీన్‌ కుటుంబాన్ని పరామర్శించినట్లు అంగీకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement