స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ప్రస్తుతం తీవ్రవాద సంస్థగా పేరుగాంచింది. ‘సిమి’ తొలుత యూపీలోని అలీగఢ్‌లో విద్యార్థి సంఘంగా ఏర్పడింది. అయితే ఈ సంఘం అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలు రావడంతో 2001లో తొలిసారి దీనిని నిషేధించారు. ఈ నిషేధం నేటికీ కొనసాగుతోంది. ఐదేళ్ల క్రితం యూఏపీఏ కింద చర్యలు తీసుకుంటూ ఐదేళ్ల పాటు నిషేధం విధించగా, దీనిని మరోసారి పొడిగించారు.
ఇస్లామిక్ ల్యాండ్‌గా మార్చాలని..
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఏప్రిల్ 1977లో స్థాపితమయ్యింది. భారతదేశాన్ని ఇస్లామిక్ ల్యాండ్‌గా మార్చడం ద్వారా ‘భారతదేశానికి విముక్తి’ కల్పించాలనేది సిమి మిషన్ అనే ఆరోపణలున్నాయి. భారత్‌లో ఇస్లామిక్ పాలనను నెలకొల్పడమే ‘సిమి’ లక్ష్యమని, దాని మనుగడ కొనసాగేందుకు అనుమతించబోమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. నిషేధిత సంస్థ కార్యకర్తలు ఇప్పటికీ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతకు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
మహ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ సారధ్యంలో..
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జమాతే ఇస్లామీ హింద్ (జేఈఐహెచ్)ను విశ్వసించే యువత, విద్యార్థుల సంస్థగా ‘సిమి’ 1977 ఏప్రిల్ 25, 1977న ఉనికిలోకి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. 1993లో అది స్వతంత్ర సంస్థగా ప్రకటించుకుంది. సిమి వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ. ఆయన ప్రస్తుతం మాకోంబ్‌లోని వెస్ట్రన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఇంగ్లీష్, జర్నలిజం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
యాసర్ అరాఫత్ తీరుపై నిరసన
1981లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌ఓ) నేత యాసర్ అరాఫత్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ‘సిమి’ కార్యకర్తలు నిరసనకు దిగడంతో ఈ సంస్థ తొలిసారి ముఖ్యాంశాలలో కనిపించింది. న్యూఢిల్లీలో సిమి కార్యకర్తలు యాసర్ అరాఫత్‌కు నల్లజెండాలతో స్వాగతం పలికారు. అరాఫత్ పశ్చిమ దేశాల కీలుబొమ్మ అని నాడు సిమి కార్యకర్తలు ఆరోపించారు. జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) సీనియర్ నేతలు అరాఫత్‌ను పాలస్తీనా వాదానికి ఛాంపియన్‌గా అభివర్ణించారు. దీని తర్వాత ‘సిమి’, జేఐహెచ్ విడిపోయాయి.
‘సిమి’పై నిషేధం
2001లో తొలిసారిగా ‘సిమి’పై నిషేధం విధించారు. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఆ నిషేధం కొనసాగుతూనే ఉంది. అయితే 2008 ఆగస్టులో ప్రత్యేక ట్రిబ్యునల్ ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే నాటి సీజేఐ కేజీ బాలకృష్ణన్ దానిని పునరుద్ధరించారు. జాతీయ భద్రత దృష్ట్యా 2008 ఆగస్టు 6న అప్పటి సీజేఐ దీనిని నిషేధించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 2019 అంటే యూఏపీఏ ప్రకారం భారత ప్రభుత్వం 2019లో ‘సిమి’ని నిషేధించింది. ఈ నిషేధాన్ని ఐదు సంవత్సరాల పాటు విధించారు. 2019లో విధించినఈ నిషేధం 2024 ఫిబ్రవరితో ముగుస్తుంది. అయితే దీనికిముందే హోం మంత్రిత్వ శాఖ దీనిపై కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిషేధ కాలాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించింది.
వివిధ సంస్థలు పేర్లతో..
‘సిమి’ వివిధ సంస్థలు పేర్లతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. సిమిపై నిషేధం విధించిన తర్వాత ఆ సంస్థ ఖైర్-ఎ-ఉమ్మత్ ట్రస్ట్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, తెహ్రీక్-ఏ-అహయా-ఏ-ఉమ్మత్, తెహ్రీక్-తలాబా-ఏ-అరేబియా, తెహ్రీక్ తహఫుజ్-ఇ, షాయర్-ఎ-ఇస్లాం, వహ్దత్-ఇ-ఇస్లామీ పేర్లతో తన కార్యకలాపాలను యధేచ్ఛగా నిర్వహిస్తున్నదనే ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment