
‘సిమి’ చీఫ్‌కు జీవితఖైదు
దేశద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు
ఇండోర్: నిషేధిత ‘సిమి’ సంస్థ చీఫ్ సఫ్దార్ హుస్సేన్ నగోరి, మరో 10 మంది కార్యకర్తలకు 2008 నాటి దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. నగోరితో పాటు హఫీజ్ హుస్సేన్ , ఆమిల్ పర్వజ్, శివ్లి, కమృద్దీన్, షహ్దౌలి, కమ్రాన్ , అన్సార్, అహ్మద్ బైగ్, యాసిన్ , మున్రోజ్‌లకు జీవితఖైదు ఖరారు చేస్తూ ప్రత్యేక అదనపు సెషన్స్ జడ్జి బి.కె.పలోడా తీర్పు వెలువరిం చారు. భారత రాజ్యాంగం, చట్టాలపై దోషులకు విధేయత లేదని వారి చర్యల ద్వారా స్పష్టమైందని 84 పేజీల తీర్పులో కోర్టు అభిప్రాయపడింది.
‘దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు. మత విద్వేషాలను ప్రోత్స హించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు’ అని పేర్కొంది. మన్రోజ్ మినహా మిగిలిన 10 మంది నిందితులను అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉంచినట్లు ప్రభుత్వ న్యాయవాది విమల్ మిశ్రా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు వివరాలను తెలియజేయాలన్న నిందితుల అభ్యర్థన మేరకు కోర్టు.. తీర్పు వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి తెలియజేసింది.