
ఢాకా: ఇస్కాన్ మాజీ ప్రతినిధి, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హక్కుల సాధన ఉద‍్యమకారుడు చిన్మయ్ కృష్ణదాస్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. బంగ్లాదేశ్ హైకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజద్రోహం కేసులో కిందటి ఏడాది నవంబర్‌లో ఆయన్ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబరులో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయజెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబరు 25న ఢాకా హజారత్ షాహ్‌జలాల్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను సైతం అక్కడి ఆందోళనకారులు అనుమతించలేదు.
చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ.. 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది. అయినా కూడా ఆయనకు బెయిల్ దక్కలేదు. మరోవైపు భారత్ సహా అంతర్జాతీయ సమాజం చిన్మయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపే మైనారిటీల హక్కులను కాలరాయడం సరికాదంటూ భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
చిన్మయ్ కృష్ణదాస్ స్వస్థలం చిట్టాగాంగ్‌లోని సట్కానియా ఉపజిల. 2016-2022 మధ్య ఇస్కాన్ చిట్టాగాంగ్ డివిజనల్ సెక్రటరీగా దాస్ పని చేశారు. ఆపై హిందూ మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే తరఫున ప్రతినిధిగా దాస్ పని చేశారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయనకంటూ అక్కడ ఓ పేరుంది. బంగ్లా మీడియా ఆయన్ని శిశు బోక్తాగా అభివర్ణిస్తుంటుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు మైనారిటీ ప్రోటెక్షన్ లా తేవడంంలోనూ దాస్ కృషి ఎంతో ఉంది. కిందటి ఏడాది.. అక్టోబర్ 25న చిట్టాగాంగ్‌లో, నవంబర్ 22వ తేదీన రంగ్‌పూర్‌లో ఆయన నిర్వహించిన ర్యాలీలు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. చిట్టాగాంగ్‌లో నిర్వహించిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాకు పైన కాషాయ జెండాను ఎగరేయడంతోనే ఆయనపై రాజద్రోహం కేసు నమోదు అయ్యింది.