చిన్మయ్ దాస్‌కు బెయిల్ నిరాకరించిన కోర్టు
రాజధాని ఢాకాతోపాటు దేశవ్యాప్త నిరసనలు
తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్
సమైక్య బంగ్లాదేశ్‌ను కోరుకుంటున్నామన్న దాస్
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశ ద్రోహం ఆరోపణలపై అరెస్టయిన హిందూ నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారికి అక్కడి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ రాజధాని ఢాకా, చిట్టోగ్రామ్ తదితర ప్రాంతాల్లో హిందువులు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయని తెలిపింది. ఇస్కాన్ మాజీ సభ్యుడు, సమ్మిళిత సనాతని జోత్ అనే హిందూ సంఘం నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి సోమవారం చిట్టోగ్రామ్‌కు వెళ్లేందుకు ఢాకా విమానాశ్రయానికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిట్టోగ్రామ్‌కు తరలించారు.
చిట్టోగ్రామ్‌లోని లాల్‌డిగి మైదాన్‌లో అక్టోబర్ 25న హిందువులు నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జాతీయ పతాకాన్ని అవమానపరిచారంటూ దాస్, మరో 18 మందిపై మాజీ ప్రధాని ఖలేదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్‌పీ)నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో చిట్టోగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దాస్‌ను పోలీసులు మంగళవారం ఆరో మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కాజీ షరీఫుల్ ఇస్లాం ఎదుట హాజరు పరిచారు. దాస్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మేజి్రస్టేట్..చిట్టోగ్రామ్ వెలుపల ఈ అరెస్ట్ జరిగినందున నిబంధనల మేరకు 24 గంటలపాటు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉండాల్సిందేనని ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.
నిబంధనలకు లోబడి జైలులో మతాచారం ప్రకారం పూజాకార్యక్రమాలు జరుపుకోవచ్చన్నారు. దాస్‌ను జైలుకు తరలిస్తుండగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు నినాదాలు చేశారు. దాస్‌ను తరలిస్తున్న వ్యాన్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జైలు వ్యానులో నుంచి విక్టరీ సింబల్ చూపుతూ దాస్ ప్రసంగించారు. తాము సమైక్య బంగ్లాదేశ్‌ను కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, డిమాండ్లు నెరవేరాదాకా శాంతియుత పోరాటం సాగించాలని మద్దతుదారులను దాస్ కోరారు. ఈ మేరకు ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరలవుతోంది. పోలీసులు లాఠీచార్జీ జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు.
దాస్ అరెస్ట్‌పై నిరసనలు
దాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఢాకా, చిట్టోగ్రామ్, ఖుల్నా, దినాజ్‌పూర్, కాక్స్ బజార్ కుమిల్లా తదితర చోట్ల హిందువులు ర్యాలీలు చేపట్టారు. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ దాస్ అరెస్ట్‌ను ఖండించింది. దాస్ అరెస్ట్‌పై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు ఇతర మైనారిటీల భద్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బంగ్లా అధికారులను కోరింది. దాస్ అరెస్ట్‌ను ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధా రామణ్ దాస్ ఖండించారు. బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎత్తుగా మరో జెండాను ఎగరేయడాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, అంతే తప్ప అగౌరపర్చలేదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment