ఢిల్లీ/ఢాకా: తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న బంగ్లాదేశ్‌లో.. హిందు ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా అల్లరి మూకలు ఛట్టోగ్రామ్‌లోని మూడు ఆలయాలపై రాళ్లు రువ్వి దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. మరోవైపు.. ఇస్కాన్ లక్ష్యంగా అణచివేత చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం.
తాజాగా.. బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్ సభ్యుడి అరెస్టు అయ్యారు. ఛట్టోగ్రామ్‌లో ఇస్కాన్‌కు చెందిన శ్యామ్‌దాస్ ప్రభు అరెస్టు అయినట్లు ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ఇటీవల చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ జెండాను అవమానించారని.. తద్వారా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యారనే అభియోగాలు మోపి ఆయన్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేశారు. అయితే.. ఆ అరెస్ట్‌ను నిరసిస్తూ బంగ్లా వ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించగా.. ఆ టైంలో(మంగళవారం) తలెత్తిన అల్లర్లలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణించడం.. పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చేసింది.
మరోవైపు ఇస్కాన్‌పై నిషేధం దిశగా అక్కడి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. దీంతో మరో దోవలో ఇస్కాన్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఇస్కాన్‌కు చెందిన 17 బ్యాంక్ అకౌంట్లను నెలరోజులపాటు ఫ్రీజ్ చేసింది.
బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లకు కాస్త పైనే. ఇందులో 8 శాతం హిందూ జనాభా ఉంది. మైనారిటీలుగా కొన్ని హక్కులను హిందువులు అక్కడ అనుభవిస్తూ వస్తున్నారు. అయితే అనూహ్య పరిణామాల నడుమ షేక్ హసీనా పదవి నుంచి దిగిపోగా.. ఆ తర్వాత సైన్యం సహకారంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో హిందువులపై, ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి. దీంతో చిన్మయ్ కృష్ణదాస్ రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment