ఢాకా:బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చిన్మయ్ అరెస్టుతో సంబంధం లేదని తాము ప్రకటించినట్లు వస్తున్న వార్తలను ఇస్కాన్ తాజాగా ఖండించింది. చిన్మయ్ కృష్ణదాస్‌కు ఎప్పటిలాగానే తాము అండగా ఉంటామని పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని హిందువుల హక్కులను కాపాడడానికి ఇస్కాన్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేసింది.
హిందువులను,వారి ప్రార్థనా స్థలాలను రక్షించాలని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్మయ్ కృష్ణదాస్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందనిన ఇస్కాన్ తెలిపింది. చిన్మయ్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇస్కాన్ డిమాండ్ చేసింది.బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు కల్పిత ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది.
తమ సంస్థను అప్రతిష్ఠపాలు చేయడానికి ఈ ప్రచారాలు చేస్తున్నట్లుందని సంస్థ ప్రధాన కార్యదర్శి చారు చంద్రదాస్ తెలిపారు. కాగా,చిన్మయ్ కృష్ణదాస్ ప్రవర్తన కారణంగా ఇస్కాన్‌లోని అన్ని బాధ్యతల నుంచి అతడిని తొలగించామని ఆయన చేసే నిరసనలతో తమకు ఎటువంటి సంబంధం లేదని చారు చంద్రదాస్ ప్రకటించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసకు నిరసనగా అక్టోబర్‌లో చిట్టగాంగ్‌లో నిర్వహించిన ర్యాలీలో చిన్మయ్ కృష్ణదాస్ జాతీయజెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను నిషేధించాలని ఓ న్యాయవాది అక్కడి కోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టివేసింది.
ఇదీ చదవండి: ‘చిన్మయ్’ అరెస్టుపై స్పందించిన షేక్‌హసీనా
Comments
Please login to add a commentAdd a comment