
48 అకౌంట్ల ద్వారా ఉగ్రవాదుల నిధుల సేకరణ
కరీంనగర్ : చొప్పదండి బ్యాంకు దోపిడీ కేసుకు సంబంధించి దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. 48 బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఉగ్రవాదులు నిధులు సేకరించినట్లు వారి దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంక్ చోరీ సొత్తు ద్వారా భారీ ఆస్తులు కూడగట్టినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సహా ఉద్యోగులందర్నీ తుపాకీతో ఓ గదిలో బంధించిన దుండగులు లాకర్‌లో ఉన్న రూ.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
ఈ దోపిడీకి పాల్పడింది అబు ఫైజల్ గ్యాంగ్గా విచారణలో తేలింది. చోరీ సొమ్ముతో ఈ గ్యాంగ్ హైదరాబాద్‌తోపాటు తిరుపతిలోనూ కొన్ని స్థలాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈడీ సైతం అప్రమత్తమై దీనిపై విచారణ జరుపుతోంది.